ఆర్‌ఎస్‌కే పరిశీలన
విజయనగరం ఫోర్ట్: రైతుల నుంచి బస్తాకు అదనంగా రెండు కేజీలు చొప్పన మిల్లర్లు వసూలు చేస్తున్నారనే అంశంపై ‘ఇదేం దోపిడీ..! శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి వ్యవసాయ, సివిల్ సప్‌లై అధికారులు స్పందించారు. గంట్యాడ మండలంలోని సిరిపురం రైతు సేవా కేంద్రం (రైతు భరోసా కేంద్రం)ను సివిల్ సప్‌లై డీటీ మూర్తి, మండల వ్యవసాయ అధికారి బి.శ్యామ్‌కుమార్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలుకు సంబంఽధించిన రికార్డులు, ట్రక్ షీట్లను తనిఖీచేశారు.
110 ఏళ్ల వృద్ధురాలు మృతి
గుర్ల: మండలంలోని రాగోలులో 110 ఏళ్ల వయస్సు గల వృద్ధురాలు దిండి రాములమ్మ సోమవారం మృతి చెందింది. ఆమె మృతి చెందిన వరకు ఎటువంటి అనార్యోగం దరి చేర లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సైతం ఆమెకు భయపడిందంటూ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గ్రామంలో అత్యధిక వయస్కురాలు మృతి చెందడంపై విచారం వ్యక్తంచేశారు. మృతురాలికి ముగ్గురు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.
గణతంత్ర వేడుకలకు పక్కా ఏర్పాట్లు
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
విజయనగరం అర్బన్: జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఈ నెల 26న గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. గణతంత్ర వేడుకల నిర్వహణపై కలెక్టర్ జిల్లా అధికారులతో సోమవారం సమీక్షించారు. ప్రశంసా పత్రాల కోసం ఉద్యోగుల పేర్లను సిఫారుసు చేస్తూ వెంటనే లేఖలు అందజేయాలని ఆదేశించారు. ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలపై శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల అధికారులు మైదానాన్ని సిద్ధం చేయడం, వేదిక, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు చూడాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ దాట్ల కీర్తి, తదితరులు పాల్గొన్నారు.
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రసాద్
● రెడ్‌క్రాస్‌పై విడుదలైన స్టాంప్స్ సేకరణ
● 177 దేశాల్లో విడుదలైన స్టాంపులు, కవర్లు సేకరణ
● గతంలో గాంధీజీపై స్టాంప్స్ సేకరణలో రికార్డు
చీపురుపల్లి: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చీపురుపల్లి పట్టణంలోని శ్రీనివాసా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏడీఎన్‌ఎస్‌వీ ప్రసాద్ స్థానం దక్కించుకున్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థపై ముద్రించిన స్టాంప్స్, కవర్స్‌ను సేకరించి అవార్డును అందుకున్నారు. 2011 నుంచి 2024 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 177 దేశాల్లో రెడ్‌క్రాస్ సంస్థ పేరుతో విడుదలైన 1313 స్టాంప్స్, కవర్స్‌ను ప్రసాద్ సేకరించారు. దీనికి గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయనను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసి మెడల్, ధ్రువీకరణ పత్రం, జ్ఞాపికను ఆ సంస్థ చీఫ్ ఎడిటర్ డా.బిస్వరూప్ రాయ్ చౌదరి ప్రదానం చేశారు. ప్రసాద్ గతంలో కూడా బాపూజీపై ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన స్టాంప్స్ సేకరణలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ఆయనను కళాశాల అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment