పనులు చేయరు.. నీరు వదలరు..!
పనులు నిలిచిపోవడంతో కత్తులకవిటి వద్ద వెలవెలబోతున్న పాత ఆయకట్టు ఎడమకాలువ
● తోటపల్లి ఆయకట్టు రైతులకు కూటమి వెన్నుపోటు
● రూ.193 కోట్లతో జరుగుతున్న ఆధునికీకరణ పనులను రద్దు చేసిన ప్రభుత్వం
● రబీ సాగుకు నీరు విడిచిపెట్టని
జలవనరులశాఖ అధికారులు
● వాస్తవంగా పనులు చేసేందుకు
అదును ఇదే..
● కాలువల పనులు చేపట్టకపోతే
ఆయకట్టు శివారు భూములకు
సాగునీరు ప్రశ్నార్థకమే..
● తోటపల్లి పాత ఆయకట్టు సుమారు
64 వేల ఎకరాలు
చిత్తశుద్ధి ఉంటే పనులు చేయండి
ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన మాటను కూటమి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే నిలబెట్టుకోవాలి. ఇలా అర్ధాంతరంగా కాలువ పనులు నిలిపివేయడం పద్ధతికాదు. రబీకి నీరవ్వనన్నారు... కనీసం ఖరీఫ్ నాటికై నా కాలువ పనులు చేపట్టి శివారు ఆయకట్టుకు నీరందేలా చొరవ చూపాలి.
– కర్రి లీలాప్రసాదరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి, నడుకూరు, వీరఘట్టం మండలం
ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చాం
తోటపల్లి పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ పనులు 25 శాతం కంటే తక్కువ జరిగినందున ఈ పనులు ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతం పనులు చేపట్టేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని, ఇక్కడ రైతుల పరిస్థితి, వారి జీవనాధారంపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చాం. తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
– వై.గన్నిరాజు, డీఈఈ, జలవనరులశాఖ,
పాకొండ డివిజన్
వీరఘట్టం:
తోటపల్లి జలాశయం.. పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల రైతులకు సాగునీటి ఆదరువు. ప్రాజెక్టులో నీరున్నా కాలువలు అభివృద్ధి చేయకపోవడంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. గతంలో విడుదల చేసిన రూ.193 కోట్ల ఖర్చుతో జరుగుతున్న పాత ఆయకట్టు కాల్వల ఆధునికీకరణ పనులను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దుచేయడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. వాస్తవంగా కాలువల పనులు చేపట్టేందుకు ఇదే అదును. ఇప్పటి నుంచి నిరంతరాయంగా 6 నెలల పాటు పనులు చేపడితే వచ్చే ఖరీఫ్ సీజన్‌లో పుష్కలంగా శివారు భూములకు సాగునీరందించవచ్చు. ప్రభుత్వ తీరుతో పాత ఆయకట్టు పనులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న ఖరీఫ్ సీజన్‌కు శివారు భూములకు సాగునీరు ప్రశ్నార్ధకమేనని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాలువల పనులు నిలిచిపోయాయి... జలశయంలోని నీటిని రబీ పంటల సాగుకు విడిచిపెట్టాలని రైతులు విజ్ఞప్తిచేస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. నీరు విడుదల అంశం తమ చేతిలో లేదంటూ జలవనరులశాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు.
● ఇదీ పరిస్థితి...
2014–19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులు కేవలం 9 శాతం మాత్రమే జరగగా అప్పటి టీడీపీ ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా బిల్లులు చెల్లించలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019–24 వరకు 14 శాతం పనులు పూర్తిచేసింది. రెండు విడతలకు 2021 మార్చి 31న రూ.15.96కోట్లును, తర్వాత 2022 మార్చి 31న రూ.7.63కోట్లను అప్పటి వరకు జరిగిన పనులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించింది. ఇంత వరకు 23 శాతం పనులు మాత్రమే జరిగాయని చెప్పి తోటపల్లి ఆధునికీకరణ పనులను రద్దుచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పనులు పూర్తిచేసేలా చూడాలే తప్ప పనులను రద్దుచేయడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
నమ్మించి మోసం చేశారు..
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తోటపల్లి పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ పనులను శరవేగంగా పూర్తి చేసి మూడు పంటలకు నీరిస్తామని నమ్మబలికారు. ఇప్పుడేమో కాలువ పనులు 25 శాతం కూడా పూర్తి కానందున తోటపల్లిని ప్రాధాన్యత ప్రాజెక్టుల నుంచి తప్పించారు. ఫలితంగా తోటపల్లి పాత ఆయకట్టు కాలువల్లో జరుగుతున్న ఆధునికీకరణ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. కాలువ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని చెప్పింది కూటమి నాయకులే... ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతానికి ప్రతిపక్ష నాయకుడి హోదాలో వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇక్కడ సెల్ఫీ కూడా తీసుకున్నారు.. తీరా అధికారం చేపట్టాక తోటపల్లి ప్రాజెక్టు పాత ఆయకట్టు పనులను నిలిపివేయడంపై రైతులు మండిపడుతున్నారు. నమ్మించి మోసం చేశారని వాపోతున్నారు.
రబీకి నీరివ్వరంట...
తోటపల్లి పాత ఆయకట్టు ఆధునికీకరణ పనులు ఆగినందున కనీసం ఈ రబీలోనైనా తోటపల్లి పాత ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని ఇటీవల నూతనంగా ఎంపికై న 25 మంది నీటి సంఘాల అధ్యక్షులు, టీసీలతో కలిసి జలవనరులశాఖ అధికారులను కోరారు. తోటపల్లి పాత ఆయకట్టు పరిధిలో ఉన్న కుడి, ఎడమ కాలువల్లో ఆధునికీకరణ పనులను ప్రభుత్వం రద్దు చేసిందని జలవనరులశాఖ అధికారులు స్పష్టం చేశారని, ప్రాజెక్టుల్లో గరిష్ట నీటి మట్టం 105 మీటర్లు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 104.15 మీటర్లు ఉందని, పాత ఆయకట్టు కాలువల ద్వారా రబీ సాగుకు నీరు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినా కుదరదని ప్రాజెక్టు అధికారులు తేల్చిచెప్పడం గమనార్హం.
ఖరీఫ్ పరిస్థితి?
రబీకి సాగునీరు విడుదల చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. మరి రానున్న ఖరీఫ్‌కు పాలకొండ శివారు వరకు నీరు వస్తుందా అంటే అది కూడా ప్రశ్నార్థకంగానే మారింది. పాత ఆయకట్టు కాలువల కింద సుమారు 64 వేల ఎకరాల సాగుభూమి ఉంది. ఏటా ఖరీఫ్‌లో జూలై, ఆగస్టు నెలల్లో సాగునీరు విడుదల చేస్తున్నారు. నవంబర్ నెలాఖరున నీటిని నిలుపుదల చేస్తున్నారు. రెండు పంటలకు నీరివ్వాల్సి ఉన్నా ఆ దిశగా అడుగులు పడడం లేదు. ప్రస్తుతం కాలువ పనులకు వాతావరణం అనుకూలంగా ఉన్నా పనులు చేయకుండా తోటపల్లిపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి ప్రదర్శిస్తుండడంపై రైతన్నలు మండిపడుతున్నారు. ఇప్పుడు పనులు చేపట్టకపోతే రానున్న ఖరీఫ్‌కు సాగునీరు వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు.
పనులు వెంటనే ప్రారంభించాలి
తోటపల్లి పాత ఆయకట్టును సస్యశ్యామలం చేస్తామని ఎన్నికల ముందు రైతాంగానికి కల్లబొల్లి మాటలు చెప్పిన కూటమి ప్రభుత్వం... ప్రస్తుతం ప్రాధాన్యతా జాబితా నుంచి తోటపల్లి ఆధునికీకరణ పనులను తప్పించడం సరైన విధానం కాదు. తోటపల్లి కాలువ పనులు పూర్తి చేస్తారని మిమ్మిల్ని నమ్మి ఓట్లు వేసిన రైతన్నలను మోసం చేయడం పద్ధతి కాదు. ఆపేసిన తోటపల్లి పాత ఆయకట్టు ఆధునికీకరణ పనులను వెంటనే ప్రారంభించాలి. – జంపు కన్నతల్లి, జెట్పీటీసీ సభ్యురాలు, వీరఘట్టం
Comments
Please login to add a commentAdd a comment