ప్రణాళికతో ఫలితమొచ్చేనా..!
రామభద్రపురం:
పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు విద్యా శాఖ అధికారులు డిసెంబర్ 1 నుంచే వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించారు. ఇప్పటివరకు స్టడీ మెటీరియల్ కూడా విద్యార్థులకు అందలేదు. జిల్లాలోని 336 ప్రభుత్వ పాఠశాలల్లో 16,650 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. పది పరీక్షల ఫలితాలు పెంచేందు కు ఉదయం గంట, మధ్యాహ్నం గంట ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించాలని ప్రత్యేక ప్రణాళికలు తయా రు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. అయితే స్టడీ అవర్స్ నామమాత్రంగా జరుగుతున్నాయని, విద్యా శాఖ అధికారుల పర్యవేక్షణను గాలికొదలడంతో హెచ్‌ఎం, టీచర్లు కూడా ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అప్పుడలా.. ఇప్పుడిలా..
పది పరీక్షల ఫలితాల పెంపునకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సబ్జెక్టు నిపుణులను ఎంపిక చేసి, వారితో స్టడీ మెటీరియల్‌ను తయారు చేయించే వారు. ఎఫ్‌ఏ–1, ఎఫ్‌ఏ–2 పరీక్షలతో పాటు, స్లిప్ టెస్ట్‌లలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించి సీ, డీ కేటగిరీ విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్ తయారు చేసి ఉచితంగా అందించి వారిపై ప్రత్యేక దృష్టి సారించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అలాంటి చర్యలేవీ చేపట్టడం లేదు. విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ ఇవ్వకుండా అఽ‘ధనం’భారం వేసేందుకు సిద్ధం అయ్యింది. ఈ ఏడాది నిధులు లేవని రాష్ట్ర విద్యా శాఖ తయారు చేసిన క్వశ్చన్ బ్యాంకు, మోడల్ ప్రశ్న పత్రాలతో కూడిన బుక్‌లెట్లను పీడీఎఫ్ ఫైల్ రూపంలో స్కూళ్లకు పంపించారు. విద్యార్థులనే ప్రింట్ తీసుకుని చదువుకోవాలని సూచనలు చేస్తున్నారని సమాచారం. లాంగ్వేజ్ బుక్‌లెట్, నాన్ లాంగ్వేజ్ బుక్‌లెట్‌లను ప్రింట్ తీసుకోవాలంటే విద్యార్థులపై అదనపు భారం పడుతుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 23,690 మంది పదో తరగతి విద్యార్థులు పది పరీక్షలు రాశారు. వీరిలో 91.82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాది సాధించిన ఫలితాలపై సమీక్షించి ఏ సబ్జెక్టుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిలయ్యారో గుర్తించి ఆ పరిస్థితి ఈ ఏడాది పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన విద్యా శాఖ అధికారులు అవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో ఈ ఏడాది పరీక్షల ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొంది.
పరీక్షల నిర్వహణ ఇలా..
2020లో ఆరో తరగతిలో ఉన్న విద్యార్థులు ఈ ఏడాది మార్చిలో పదో తరగతి పరీక్షలు ఇంగ్లిష్ మీడియంతో పాటు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌తో కూడిన పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలను మాత్రం ఎస్‌ఎస్‌సీ నిర్వహిస్తోంది. ఆరు సబ్జెక్టులు, ఏడు పేపర్ల విధానంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. సైన్స్ సబ్జెక్టులో భౌతిక, రసాయన శాస్త్రం ఒకటిగా, జీవ శాస్త్రం ఒకటిగా 50 మార్కుల చొప్పున్న రెండు పరీక్షలు నిర్వహించనున్నారు. మిగిలిన ఐదు సబ్జెక్టులకు సంబంధించి ఐదు పరీక్ష లు 100 మార్కులకు ఉంటుంది. మొత్తం 3.15 గంటల సమయం ఇస్తుండగా అన్ని ప్రశ్నలు రాయాలి. 24 పేజీల ఆన్సర్ బుక్‌లెట్ ఇస్తారు. ఆ తరువాత అడిగితే మరో 12 పేజీల బుక్‌లెట్ ఇవ్వనున్నారు.
ఉత్తమ ఫలితాలే లక్ష్యం
ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా వంద రోజుల ప్రణాళికలు తయారు చేశాం. ఎంఈఓలు, హెచ్‌ఎంలతో సమీక్షలు నిర్వహించడంతో పాటు పర్యవేక్షణ చేస్తున్నాం. విద్యార్థులకు గతంలో స్టడీ మెటీరియల్‌ను డీసీఈబీ ద్వారా ఇచ్చే వాళ్లం. అయితే డీసీఈబీలో నిధులకొరత ఉండడంతో ఈ ఏడాది స్టడీ మెటీరియల్ ఇవ్వలేకపోతున్నాం. రాష్ట్ర విద్యా శాఖ కార్యాలయం అధికారులే తయారు చేసి పంపించిన క్వశ్చన్ బ్యాంకు, మోడల్ క్వశ్చన్ పేపర్ల బుక్‌లెట్‌లు పీడీఎఫ్ ఫైల్స్‌ను స్కూళ్లకు పంపించాం. వాటిని ప్రింట్ తీసుకోవాలని తెలియజేశాం. – యూ మాణిక్యంనాయుడు, డీఈఓ, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment