బెల్టు షాపుల జోరు..!
మంత్రి ఇలాకాలో
ఆకస్మిక దాడులు చేస్తున్నాం
గ్రామాల్లో ఆకస్మిక దాడులు చేసి బెల్టుషాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నాం. బెల్టు షాపుల నిర్వహణ కోసం వేలం పాటలు నిర్వహించిన విషయం తెలియరాలేదు. సిబ్బందిని పంపించి చర్యలు తీసుకుంటాం.
– విజయలక్ష్మి, ఎకై ్సజ్ శాఖ సర్కిల్ ఇన్‌స్పెక్టర్
● షాపుల నిర్వహణ కోసం గ్రామాల్లో వేలం పాటలు
● నిర్వాహకులకు మంత్రి బంధువుల అండదండలు
● ప్రతి గ్రామంలో 5 నుంచి 10 వరకు బెల్టుషాపుల నిర్వహణ
● చోద్యం చూస్తున్న ఎకై ్సజ్ శాఖ అధికారులు
గంట్యాడ: మండలంలోని ఓ గ్రామంలో బెల్టు షాపు నిర్వహణకు కొద్ది రోజుల క్రితం వేలం పాట నిర్వహించారు. ఆ గ్రామంలో సుమారు రూ. 5 లక్షల వరకు ఓ వ్యక్తి వేలం పాటలో పాడుకున్నట్లు సమాచారం. ఈ గ్రామంలో వేలంపాట నిర్వహించే ముందు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బంధువు ఒకరిని గ్రామస్తులు కలిసినట్లు సమాచారం. మీకు ఏమీ ఫర్వాలేదు. నేను చూసుకుంటూ..మీరు వేలం పాట పెట్టుకోండి అని సదరు బంధువు గ్రామస్తులకు అభయం ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మండలం కేంద్రానికి అతి సమీపంలో ఉన్న మరో గ్రామంలో బెల్టు షాపు నిర్వహణకు వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో ఓ వ్యక్తి రూ.4 లక్షలకు బెల్టుషాపును దక్కించుకున్నట్లు తెలిసింది. దీంతో నిర్భయంగా బెల్టు షాపు నిర్వహించుకుంటున్నారు.
● మండలంలోని మరో గ్రామంలో బెల్ట్‌షాపు కోసం వేలం పాట నిర్వహించారు. ఇందులో ఓ వ్యక్తి రూ.4 లక్షలకు వేలం పాట దక్కించుకున్నట్లు తెలిసింది. దీంతో ఈ గ్రామంలో కూడా మద్యం యథేచ్ఛగా విక్రయిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మూడు గ్రామాల్లో బెల్టు షాపుల కోసం వేలం పాటలు జరిగాయి. వేలం పాటలు లేకుండానే పలు గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. అధికారం ఉంది కదా అని అధికార పార్టీ నేతలే బెల్టుషాపులు ఎక్కువగా నిర్వహిస్తున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి.
గ్రామాల్లో 5 నుంచి 10 వరకు బెల్టుషాపులు
గ్రామాల్లో సందుకు ఒకటి, పుట్టకొకటి చొప్పున బెల్టుషాపులు వెలిశాయి. వేలం పాట జరిగిన గ్రామాల్లో మినహాయిస్తే మిగిలిన గ్రామాల్లో 5 నుంచి 10 వరకు బెల్టుషాపులు వెలిశాయి. కొన్ని గ్రామాల్లో 15 నుంచి 20 వరకు బెల్టుషాపులు ఉన్నాయి.
ఏటీఎంల మాదిరి బెల్టుషాపుల నిర్వహణ
గ్రామాల్లో బెల్టు షాపులు ఏటీఎం (ఎనీ టైమ్ మద్యం) మాదిరి నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారు. కొంతమంది అయితే బ్రష్ చేయడం కంటే ముందే మద్యం తాగుతున్నారు. దీన్ని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పట్టించుకోని ఎకై ్సజ్ శాఖ అధికారులు
గ్రామాల్లో బెల్టుషాపులు యథేచ్ఛగా నిర్వహిస్తున్నప్పటికీ చర్యలు చేపట్టాల్సిన ఎకై ్సజ్‌శాఖ చోద్యం చూస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఎకై ్సజ్ శాఖ అధికారులు అయితే ఎవరైనా బెల్టు షాపుల గురించి సమాచారం ఇస్తే ఆ సమాచారాన్ని వెంటనే బెల్టు షాపులకు చేరవేరస్తున్నారు. దీంతో వారు సమాచారం ఇచ్చిన వారిని బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబువి ఉత్తి మాటలే!
బెల్టు షాపులు నిర్వహిస్తే తోలు తీస్తాం, నార తీస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కానీ సాక్షాత్తు జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న మండలంలోనే బెల్టుషాపులు విచ్చలవిడిగా వెలిశాయి. కొన్ని గ్రామాల్లో బెల్టుషాపుల కోసం వేలం పాటలు కూడా నిర్వహించారు. బెల్టు షాపుల నిర్వహణకు మంత్రి అండదండలు ఉన్నాయనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment