ప్రతి వినతికీ పరిష్కారం చూపించాలి
విజయనగరం అర్బన్: ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి వినతికి పరిష్కారం చూపాల్సిందేనని కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా వినతుల పరిష్కారం జరగాలన్నారు. ఆయా వినతుల తనిఖీ సందర్భంగా అర్జీదారు సంతృప్తి చెందే రీతిలో వినతిని పరిష్కరించలేదని నిర్ధారణ జరిగితే ఆ వినతిని మళ్లీ తెరిచి సంతృప్తికర పరిష్కారం చూపించాల్సి ఉంటుందన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ అంబేడ్కర్ పాల్గొని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి, ఆర్‌డీఓ కీర్తిలతో కలిసి వినతుల స్వీకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వినతుల పరిష్కారంపై కలెక్టర్ సమీక్షించారు. ప్రజావినతుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆయా శాఖల జిల్లా అధికారులకు అందజేసి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్బంగా పలు సమస్యల పరిష్కారంపై 183 వినతులు అందాయి.
ఆర్‌అండ్‌బీ స్థలం ఆక్రమణను అడ్డుకోవాలి
చీపురుపల్లి మండలం పత్తికాయవలస గ్రామంలో లావేరు రోడ్డును ఆనుకుని ఉత్తర దిశగా ఆర్‌అండ్‌బీ రహదారిపై ఉన్న ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని దాన్ని అడ్డుకోవాలని ఆ గ్రామ మాజీ సర్పంచ్ పట్ట ఎల్లయ్య కోరారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా వినతుల పరిష్కార వేదికకు ఆయనతోపాటు పలువురు గ్రామస్తులు వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ అక్రమణపై స్థానిక తహసీల్దార్, ఆర్‌ఆండ్‌బీ అధికారులు, పోలీసులకు ఈ నెల 8న ఇచ్చిన ఫిర్యాదుపై సంబంధిత అధికారులు స్పందించి చీపురుపల్లి సర్వేయర్‌తో సర్వే చేశారు. ఆర్‌అండ్‌బీ స్థలంగా రుజువు అవడంతో ఖాళీ చేయమని ఆదేశాలిచ్చారు. అయితే అధికారుల ఆదేశాలను పట్టించుకోవడం లేదని జిల్లా స్థాయిలో చర్యలు తీసుకుని ఆక్రమణలను తొలగించాలని వారు కోరారు.
ప్రజాసమస్యల పరిష్కారవేదికకు 32 ఫిర్యాదులు
విజయనగరం క్రై మ్: ప్రజల సమస్యలు తక్షణ పరిష్కారానికి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్పీ వకుల్ జిందల్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి 32 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment