అమ్మ తొలేళ్ల సంబరానికి సర్వం సిద్ధం
● నేడు తొలేళ్ల ఉత్సవం ● ఘనంగా కారుగేద వాలకం ● పశువులేర్లుతో గ్రామానికి చేరుకున్న సిరిమాను కర్ర
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, గిరిజనుల ముద్దుబిడ్డ శంబర పోలమాంబ అమ్మవారి తొలేళ్ల ఉత్సవం సోమవారం జరగనుంది. జాతరకు ఇతర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు రానున్నారు. జాతరకొచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ మాధవరెడ్డి, అడిషనల్ ఎస్పీ దిలీప్‌కిరణ్, సబ్‌కలెక్టర్ అశుతోష్‌శ్రీవాస్తవ్, ఈఓ వి.వి.సూర్యనారాయణ, ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షణలో జాతర ఏర్పాట్లు చేశారు.
ఘనంగా కారుగేద వాలకం
శంబరలో ఆదివారం రాత్రి గ్రామస్తులు ఘనంగా కారుగేద వాలకం నిర్వహించారు. గ్రామానికి చెందిన చెల్లూరి రాములు ఉదయం నుంచి ఉపవాసం ఆచరించి, వరిగడ్డితో శరీరమంతా కప్పుకొని, యాదవవీధికి చేరుకున్న అమ్మవారి ఘటాలకు నమస్కరించారు. సీ్త్ర వేషధారణలో ఓ వ్యక్తి వచ్చి రాములును అమ్మవారి ఘటాల నుంచి తీసుకువెళ్లడం ఆనవాయితీ.
700 మందితో పోలీస్ బందోబస్తు
జాతరలో 700మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. 41సీసీ కెమెరాలు, డ్రోన్లతో పోలీస్ ఉన్నతాధికారులు కంట్రోల్‌రూమ్ నుంచి జాతర పర్యవేక్షించనున్నారు. జాతరలో ఎస్పీ మాధవరెడ్డి, అడిషనల్ ఎస్పీ దిలీప్‌కిరణ్, ఏఎస్పీ, డీఎస్సీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, పీసీలు, రోప్ పార్టీ, సీఆర్‌పీఎఫ్ బలగాలు, హోంగార్డులు బందోబస్తు నిర్వహించనున్నారు. జాతరకొచ్చే భక్తుల అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా రోడ్డుమ్యాప్‌ను ఏర్పాటు చేశారు.
130 ప్రత్యేక బస్సులు
విజయనగరం టౌన్: శంబర పోలమాంబ జాతరకు 130 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రజారవాణాధికారి సీహెచ్. అప్పలనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం, ఎస్.కోట, సాలూరు, పార్వతీపురం డిపోల నుంచి ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment