పోలీస్ ప్రజావాణికి ఏడు అర్జీలు
వనపర్తి: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఏడు అర్జీలు దాఖలైనట్లు ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం భోజన విరామం వరకు ఎస్పీ నేరుగా ప్రజల సమస్యలను తెలుసుకొని అర్జీలను స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం ఎస్‌హెచ్‌ఓలకు సిఫారస్ చేశారు. దాఖలైన అర్జీల్లో పరస్పర గొడవలు, భూతగాదాలకు సంబంధించినవి ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
కొడంగల్ ఫార్మాసిటీతో సాగునీటి దోపిడీకి కుట్ర
వనపర్తి: కొడంగల్ ఫార్మాసిటీతో సాగునీటి దోపిడీకి కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసం నుంచి మాట్లాడిన ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. ఫార్మాసిటీతో భీమా నుంచి ఏడు టీఎంసీల నీటిని తరలించాలని చూస్తున్నారన్నారు. ఈ చర్య దేవరకద్ర, మక్తల్, వనపర్తి, కొల్లాపూర్ ప్రాంతాలకు గొడ్డలిపెట్టు లాంటిదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ముచ్చర్ల వద్ద ఫార్మా సిటీ కోసం 14వేల ఎకరాలు సేకరించి, గోదావరి నీళ్లను తరలించాలని ప్రతిపాదించామని.. దాన్ని పక్కన పెట్టి కొడంగల్‌లో రైతులు వద్దన్న చోట ఫార్మా సిటీ పెట్టాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఇది అనాలోచిత నిర్ణయమన్నారు. రైతులను భయపెట్టి, బలవంతంగా భూసేకరణ చేయడం సరికాదన్నారు. పాలమూరు బిడ్డగా చెప్పే సీఎం రేవంత్‌రెడ్డి.. జిల్లాకు అదనంగా నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేయకుండా, రైతాంగానికి ఉపయోగించాల్సిన కృష్ణా జలాలకు గండికొడుతున్నారని విమర్శించారు. ఈ చర్యతో పాలమూరు రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు.
కార్మికుల పెండింగ్
వేతనాలు చెల్లించండి
వనపర్తి రూరల్: గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు డిమాండ్ చేశారు. సోమవారం గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) కార్మికులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ ఏఓ భానుప్రకాష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు ఇచ్చేది తక్కువ వేతనాలు అని.. పైగా నెలల తరబడి చెల్లించక పోవడంతో కార్మికులు కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీల్లో మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బొబ్బిలి నిక్సన్, నందిమళ్ల రాములు, పుష్ప, శ్రీను, దాసు, రామచంద్రయ్య, గంగ, నరసింహ, భద్రయ్య, జమ్ములు, సుగ్రీవుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment