పరిశోధనలను ప్రోత్సహిద్దాం
వనపర్తి: మానవళి హితం కోరే పరిశోధనలను ప్రోత్సహిద్దామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి కోరారు. జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన 52వ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమం శనివారం నిర్వహించగా ఆయనతో పాటు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి ముఖ్యఅతిథులు హాజరై విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. సైన్స్ విజ్ఞానాభివృద్ధికి ఉపకరించేలా ఉండాలన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞానిక సదస్సులు ఊపయోగపడతాయని తెలిపారు. నూతన ఆవిష్కరణల్లో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. వృక్షంలో జీవం ఉందని మొదటిసారి ప్రపంచానికి తెలిపిన నోబుల్ బహుమతి గ్రహీత జగదీశ్ సుభాష్‌చంద్ర మరణించింది ఇదేరోజు కావడం యాదృచ్చికమని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయరంగాలకు ప్రాధాన్యమిస్తుందని.. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 20 వేల ఉపాధ్యాయ పోస్టుల్లో పది వేలు భర్తీ చేసిందని, మిగిలిన పోస్టులను కూడా భర్తీ చేస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి చదివిన పాఠశాల అభివృద్ధికి రూ.160 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. నియోజకవర్గానికి ఎడ్యుకేషనల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హబ్ మంజూరైందని తెలిపారు. అలాగే 25 ఎకరాల్లో స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణం చేయనున్నట్లు వివరించారు. అనంతరం శాట్ చైర్మన్ కె.శివసేనారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే ప్రయోగాత్మక విద్యపై ఆసక్తి పెంచుకోవాలని చెప్పారు. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులను సాంకేతిక విద్య వైపు ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాద్యాయులపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజులు, మున్సిపల్ చైర్మన్ మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్‌గౌడ్, జిల్లా సైన్స్ టీచర్ శ్రీనివాసులు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment