మళ్లీ కలకలం..!
నడిగడ్డలో నకిలీ మద్యం..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం పాతపాలెంలో సుమారు రెండేళ్ల క్రితం నకిలీ మద్యం తయారీ రాకెట్ గుట్టు రట్టు కాగా.. సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా అదే జిల్లాలో నకిలీ మద్యం జాడలు మళ్లీ వెలుగు చూశాయి. అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ పట్టణంలో ఇటీవల నకిలీ మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని (ఏపీ 29 బీడబ్ల్యూ 4444) ఎకై ్సజ్ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. 30 లీటర్ల నకిలీ మద్యంతో పాటు క్యారమిల్ (మద్యంలో కలిపే రంగు), స్పిరిట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇద్దరు నిందితులు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయారు. ఈ క్రమంలో ఎకై ్సజ్ అధికారులు తీగ లాగితే డొంక కదిలినట్లు తెలుస్తోంది.
కల్తీ మద్యం తయారీ, రవాణాకు సంబంధించి ఎకై ్సజ్ అధికారులు కూపీ లాగగా.. ఇద్దరు సూత్రధారుల ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ దందా కొన్ని నెలలుగా సాగుతున్నట్లు తేలింది. ఆ మద్యాన్ని ఉమ్మడి పాలమూరుతో పాటు సమీపంలోని వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలోని పలు బెల్ట్‌ట్‌షాపులకు సైతం సరఫరా చేసినట్లు తెలుస్తోంది. గద్వాల జిల్లా గట్టు మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన రవినాయుడు మరి కొంతమందితో కలిసి కొంతకాలంగా అయిజ పట్టణంలో ఓ బార్ అండ్ రెస్టారెంట్‌ను అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన చిన్న ఉరుకుందుగౌడ్ కొంతకాలంగా డీసీఎం వాహనం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం క్రితం వీరిద్దరికి ఒక ఒప్పందం కుదిరింది. చిన్న ఉరుకుందుగౌడ్ నకిలీ మద్యం తయారు చేయాలి.. దాన్ని రవినాయుడికి అందజేయాలి. ఈ మేరకు రవినాయుడు.. చిన్న ఉరుకుందుగౌడ్ బ్యాంక్ ఖాతాలో రూ.80వేలు జమచేశాడు. మరో రూ.40 వేలను నగదు రూపకంగా ఇచ్చాడు.
నకిలీ మద్యం తయారీకి సంబంధించి ఆ ఇద్దరు మరికొందరి సాయంతో క్యారమిల్‌ను కర్ణాటకలోని రాయచూరు నుంచి.. స్పిరిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల నుంచి సేకరించారు. చిన్న ఉరుకుందు గౌడ్ నీటిలో క్యారమిల్, స్పిరిట్ కలిపి నకిలీ మద్యం తయారు చేశాడు. ఇది వరకే సేకరించుకున్న ఖాళీ మద్యం సీసాల్లో ఈ శాంపిళ్లను పోసి కొందరికి ఇచ్చాడు. పలు బెల్ట్‌షాపులకు సరఫరా చేశాడు. అంతా సజావుగా సాగుతుండడంతో ఆ ఇద్దరు కలిసి రానున్న స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పోటీలో నిలవాలని భావిస్తున్న వారిని టార్గెట్‌గా పెట్టుకుని పావులు కదిపినట్లు సమాచారం. ఈ మేరకు పలు రహస్య స్థలాల్లో ఇప్పటికే నకిలీ మద్యం సీసాలను దాచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 13న బేరమాడేందుకని స్కార్పియో వాహనంలో కొన్ని శాంపిళ్లను పెట్టుకుని వస్తుంటే అయిజ పట్టణంలో ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం రవినాయుడు, చిన్న ఉరుకుందుగౌడ్‌తోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
కర్ణాటక నుంచి క్యారమిల్.. ఏపీ నుంచి స్పిరిట్
ఇద్దరు సూత్రధారుల ఆధ్వర్యంలో దందా
ఉమ్మడి జిల్లాలో
పలు బెల్ట్‌షాపులకు సరఫరా
రానున్న ఎలక్షన్లే టార్గెట్‌గా
పలువురితో బేరసారాలు
ఆదిలోనే అడ్డుకున్న
గద్వాల ఎకై ్సజ్ యంత్రాంగం
ఒకరి అరెస్ట్.. పరారీలో
కీలక నిందితుడు రవినాయుడు
అధికారులపై అధికార పార్టీ
నేతల ఒత్తిళ్లు ?
అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు?
ఇద్దరు సూత్రధారులు..
కర్ణాటక నుంచి క్యారమిల్..
ఏపీ నుంచి స్పిరిట్
నకిలీ మద్యం తయారీ, రవాణాకు సంబంధించి తుమ్మలపల్లికి చెందిన చిన్న ఉరుకుందు గౌడ్‌ను ఎకై ్సజ్ పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. అసలు నిందితుడు రవినాయుడితో పాటు మరో ఇద్దరు నిందితులు పెద్ద ఉరుకుందు, బోయ బీమేష్ నాయుడు పరారీలో ఉన్నారు. ఈ నెల 13న కేసు నమోదు కాగా.. కీలక నిందితుడు రవినాయుడిని ఇంకా పట్టుకోకపోవడం వెనుక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడిని అరెస్ట్ చేయకుండా ఎకై ్సజ్ అధికారులపై గద్వాల నియోజకవర్గ అధికార పార్టీకి చెందిన ఓ మహిళా నేత బంధువుతో పాటు పార్టీ మండలాల నాయకులు ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పదనుకుంటే తూతూమంత్రపు కేసులతో సరిపెట్టాలని.. అతడు లొంగిపోయేందుకు సహకరిస్తామని చెప్పినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో ఎకై ్సజ్ సీఐ గణపతిరెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా.. ‘నకిలీ మద్యం తయారీ కేసును ఛేదించేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటి వరకు కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. మరికొంత మంది వ్యక్తులు పరారీలో ఉన్నారు. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తాం. ఆ తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాం.’ అని సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment