తై..బేజార్!
పురపాలికల్లో కొనసాగని వేలం పాటలు
పురపాలికల వారీగా ఇలా..
● వనపర్తి మున్సిపాల్టీలో గతేడాది తైబజార్ ద్వారా రూ.26 లక్షల ఆదాయం వచ్చింది. ఈ సారి రూ.30 లక్షలకు టెండర్ ఆహ్వానించగా ఎవరూ ముందుకు రాలేదు.
● అమరచింతలో గతేడాది రూ.3.49 లక్షలకు వేలం నిర్వహించగా రూ.2.30 లక్షలు మాత్రమే కాంట్రాక్టర్ చెల్లించారు. ఈ ఏడాది రూ.3.25 లక్షలకు టెండర్ ఆహ్వానించినా ఎవరూ ముందుకురాలేదు.
● కొత్తకోటలో గతేడాది తైబజార్ ద్వారా రూ.21 లక్షల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది కూడా రూ.21 లక్షలకే టెండర్ దక్కించుకున్నారు.
● పెబ్బేరులో రూ.3.37 కోట్లకు టెండర్ ఆహ్వానించగా ఎవరూ రాలేదు. దీంతో పుర అధికారులు గతంలో టెండర్ దక్కించుకున్న వారితోనే తైబజార్ వసూళ్లు చేపడుతున్నారు.
● ఆత్మకూర్‌లో రూ.8.50 లక్షలకు టెండర్ ఆహ్వానించినా ఎవరూ రాకపోవడంతో పుర సిబ్బందితోనే వసూలు చేయిస్తున్నారు.
అమరచింత: జిల్లాలోని పలు పురపాలికల్లో మూడేళ్లుగా తైబజార్ వేలం కొనసాగకపోవడంతో ఆదాయానికి గండి పడుతోంది. తైబజార్‌తో వచ్చే కొద్దిపాటి ఆదాయంతో అభివృద్ధి పనులతో పాటు సిబ్బంది వేతనాల చెల్లింపునకు వినియోగించుకునే అవకాశం ఉండేదని ఆయా పుర కమిషనర్లు, కౌన్సిలర్లు చెబుతున్నారు. ఏడాది కాలానికిగాను ప్రతి నెల మార్చిలో తైబజార్ వేలం నిర్వహించి దక్కించుకున్న కాంట్రాక్టర్లకు అప్పగించేవారు. కాంట్రాక్టర్లు కుమ్మక్కవడం.. తక్కువ ధరకు వేలం పాడుతుండటంతో మూడేళ్లుగా వాయిదాలు పడుతూ వస్తోంది. తప్పని పరిస్థితుల్లో పుర సిబ్బందితోనే అధికారులు వసూళ్లు చేపడుతున్నారు. పెబ్బేరులో మూడేళ్లుగా వేలం పాటలు నిలిచిపోవడంతో గతంలో తైబజార్ నిర్వహించిన కాంట్రాక్టర్‌కు అప్పగిస్తూ ఆదాయం సమకూర్చుకుంటున్నారు. కొత్తకోట మున్సిపాలిటీలో రూ.21 లక్షలకు వేలం పూర్తవగా.. అమరచింత, ఆత్మకూర్, వనపర్తిలో పూర్తి కాలేదు.
పుర సిబ్బందికే బాధ్యతలు..
తప్పని పరిస్థితుల్లో పుర అధికారులు తమ సిబ్బందితోనే తైబజార్ వసూలుకు పూనుకొని ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నా.. ఆశించిన మేర వసూలు కావడం లేదు. పలుచోట్ల గతంలో తైబజార్ నిర్వహించిన వారికే వసూలు బాధ్యతలు అప్పగించి పురపాలికకు అందించాలని.. పర్యవేక్షణ బాధ్యతను వార్డు అధికారులకు అప్పగించారు. వారాంతపు సంత సమయంలో అధిక మొత్తంలో వసూలవుతున్నా.. రోజువారీగా వసూళ్లలో తేడాలు ఉంటున్నాయి. దీంతో కొందరు వసూళ్ల బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా.. మరికొందరు అందిన కాడికి దండుకొని రసీదులు ఇవ్వకుండా చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. అమరచింతలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూ.83 వేలు వసూలు చేశారు. అలాగే ఆత్మకూర్‌లో రోజువారీగా రూ.1,500.. వారాంతపు సంత రోజు రూ.2,500 వరకు వసూలు అవుతున్నట్లు అధికారులు తెలిపారు. పెబ్బేరులో ఇప్పటి వరకు కేవలం రూ.1.20 లక్షలు మాత్రమే వసూలు అయ్యాయని అధికారులు వెల్లడించారు. వనపర్తిలో మాత్రం నాలుగు నెలలకుగాను రూ.10 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిసింది. కాగా ఉన్న పనులతో సతమతమవుతున్న సిబ్బందికి ఆస్తి, కొళాయి పన్నులతో పాటు తైబజార్ వసూళ్లు అధిక భారం కావడంతో వాటిపై దృష్టి సారించలేకపోతున్నారు.
సిబ్బందితోనే వసూళ్లు..
రూ.లక్షల్లో ఆదాయానికి గండి
కొన్నిచోట్ల చేతివాటం ప్రదర్శిస్తున్న వైనం
సిబ్బందితోనే వసూలు..
తైబజార్ వేలం వాయిదా పడటంతో వసూళ్ల కోసం సిబ్బందిని నియమించాం. పట్టణంలోని తోపుడు బండ్లు, కూరగాయల విక్రయదారులు, పట్టణానికి సరుకుల తెచ్చిన లారీల నుంచి తైబజార్ వసూలు చేసి రసీదులు ఇస్తున్నారు. రసీదులు ఇవ్వకుండా డబ్బులు తీసుకుంటున్నారనే విషయం తెలిసి సిబ్బందిని మార్చడంతో పాటు ఆదాయ వనరులపై దృష్టి సారించాం.
– నూరుల్ నదీం,
పుర కమిషనర్, అమరచింత
Comments
Please login to add a commentAdd a comment