సీపీఆర్ చేసి.. ప్రాణాలు కాపాడి..
వైద్యుడు భవాజీ సమయస్ఫూర్తి
తాడేపల్లిగూడెం: రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న వ్యక్తి ప్రాణాన్ని అదే మార్గంలో వెళుతున్న డాక్టర్ కాపాడారు. అలంపురంలో జాతీయ రహదారిపై శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. తాడేపల్లిగూడెం కమలా హాస్పిటల్ అధినేత డాక్టర్ నార్ని భవాజీ, ఆయన సోదరుడు చినబాబుతో కలిసి తణుకు వెళ్లి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యలో అలంపురం వచ్చే సరికి ఓ యువకుడు తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడి ఉండటాన్ని గమనించారు. భవాజీ వెంటనే క్షతగాత్రుడి వద్దకు వెళ్లి సీపీఆర్ చేశారు. దీంతో క్షతగాత్రుడిలో కదలికలు రాసాగాయి. అంబులెన్స్‌కు ఫోన్ చేయగా సమయం పడుతుందనే సమాధానం రాగా.. భవాజీ సోదరుడు చిన బాబు హైవేలో ఉన్న ఎస్‌ఓఎస్ బాక్సు దగ్గరకు వెళ్లి ఎమర్జెన్సీ కాల్ చేయగానే అంబులెన్స్ వచ్చింది. డాక్టర్ భవాజీ అంబులెన్స్ సిబ్బందికి అత్యవసర సపర్యలను వివరించి క్షతగాత్రుడిని తణుకు ఆస్పత్రికి తరలించారు. తాడేపల్లిగూడెంలోని బంగారు దుకాణాల్లో నగల తయారీకి వచ్చిన బెంగాల్‌కు చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. ప్రాణాపాయ స్థితి నుంచి బాధితుడిని కాపాడిన డాక్టర్ భవాజీని పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment