భవన నిర్మాణ కార్మికుల ధర్నా
ఏలూరు (టూటౌన్): ఇసుక ర్యాంపులను ప్రభుత్వమే నిర్వహించాలని, భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునః ప్రారంభించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కంకిపాటి బుచ్చిబాబు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్, కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్రవ్యాప్త పిలుపుమేరకు ఏలూరులో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. బుచ్చిబాబు మాట్లాడుతూ ఇసుకపై జీఎస్‌టీతో పాటు ఇతర ప న్నులు రద్దుచేయాలని కోరారు. ఎన్నికల్లో హామీలను ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత కూటమి పాలకులు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం కాకుంటే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉచిత ఇసుక ఆచరణలో ఎక్కడా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చేపల్లి శ్రీనివాసరావు, ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి తోర్లపాటి బాబు, జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment