శ్రీవారి తెప్పోత్సవానికి భారీ ఏర్పాట్లు
ద్వారకాతిరుమల: చినవెంకన్న తెప్పోత్సవానికి శ్రీవారి పుష్కరణి (నృసింహ సాగరం) సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 13న రాత్రి స్వామివారి తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరిణి మధ్యలోని మండపానికి, ఆంజనేయ స్వామివారి ఆలయానికి విద్యుద్దీప అలంకారాలు చేస్తున్నారు. ఇప్పటికే పుష్కరిణి గట్లపై ఉన్న ముళ్లపొదలను తొలగించి, విద్యుద్దీప అలంకారాలు చేశారు. తెప్పను రంగులతో తీర్చిదిద్దుతున్నారు. సాగరాన్ని బోరు నీటితో నింపుతున్నారు. బుధవారం స్వామివారు ఉభయ దేవేరులతో తొళక్క వాహనంపై క్షేత్ర పురవీదుల్లో ఊరేగి రాత్రి 8 గంటల సమయంలో పుష్కరిణి వద్దకు చేరుకుంటారు. అనంతరం తెప్పోత్సవం ప్రారంభమవుతుందని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment