ఇంటర్‌ పరీక్షలపై ప్రిన్సిపాల్స్‌కు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలపై ప్రిన్సిపాల్స్‌కు శిక్షణ

Published Wed, Jan 29 2025 2:01 AM | Last Updated on Wed, Jan 29 2025 2:01 AM

ఇంటర్‌ పరీక్షలపై ప్రిన్సిపాల్స్‌కు శిక్షణ

ఇంటర్‌ పరీక్షలపై ప్రిన్సిపాల్స్‌కు శిక్షణ

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఫిబ్రవరి 1 నుంచి జరిగే ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సంబంధించి జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు ఒక రోజు శిక్షణ కార్యక్రమం మంగళవారం స్థానిక సెయింట్‌ థెరిస్సా బాలికల జూనియర్‌ కళాశాలలో నిర్వహించారు. బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే.చంద్రశేఖర బాబు మాట్లాడుతూ వచ్చే ఫిబ్రవరి 1, 3 తేదీల్లో ఇంటర్‌ క్వాలిఫయింగ్‌ పరీక్షలైన ఎథిక్స్‌, హ్యుమన్‌ వాల్యూస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. ఫిబ్రవరి 5 నుంచి ఒకేషనల్‌, ప్రయోగ పరీక్షలకు సమాయత్తం కావాలన్నారు. ఈ క్వాలిఫయింగ్‌ పరీక్షలలో విద్యార్థులు తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధిస్తేనే ఇంటర్మీడియట్‌ పాస్‌ సర్టిఫికెట్‌ ఇస్తారని తెలపాలని సూచించారు. శిక్షణా కార్యక్రమంలో ఇంటర్మీడియట్‌ పరీక్షల స్పెషల్‌ ఆఫీసర్‌ డీవీఈఓ బి.ప్రభాకర రావు, పరీక్షల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఆత్మరక్షణ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, కేజీబీవీలు, సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ చదువుతున్న బాలికలకు రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ పేరిట ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకూ శిక్షణ ఇవ్వడానికి ఏజెన్సీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ పంకజ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాసంస్థల్లో స్వీయ రక్షణ శిక్షణ నిర్వహించడంలో ఏజెన్సీలకు ముందస్తు అనుభవం ఉండాలని, శిక్షకులకు తప్పనిసరిగా కనీసం ఒక మార్షల్‌ ఆర్ట్‌ లేదా ఆత్మరక్షణ క్రమశిక్షణలో (తైక్వాండో, కరాటే, జూడో) సర్టిఫికెట్‌ పొంది ఉండాలన్నారు. దరఖాస్తులను ఈ నెల 30 సాయంత్రం 5 గంటల లోపు ఏలూరులోని జిల్లా సమగ్రశిక్ష కార్యాలయంలో అందచేయాలని సూచించారు.

ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం

ద్వారకాతిరుమల: సివిల్‌ సప్లయిస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బు తీసుకుని, ఇద్దరిని మోసగించిన వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసినట్టు ఎస్సై టి.సుధీర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జి.కొత్తపల్లికి చెందిన బిరుదుగడ్డ బజారియ్య 2023 ఆగస్టులో సివిల్‌ సప్లయిస్‌ డిపార్ట్‌మెంట్‌లో అటెండర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని, రామన్నగూడెంకు చెందిన కుక్కల నాగమల్లేశ్వరరావు, పాల నాగార్జునను నమ్మించి, వారి నుంచి చెరో రెండున్నర లక్షల రూపాయలు తీసుకున్నాడు. వారికి నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇచ్చాడు. అయితే మోసపోయినట్టు తెలుసుకున్న బాధితులు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్సై కేసు నమోదుచేసి, బజారయ్యను అరెస్టు చేశారు. అనంతరం భీమడోలు కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించినట్టు ఆయన తెలిపారు.

జేఈఈ పరీక్షకు 195 మంది హాజరు

భీమవరం: భీమవరం డీఎన్నార్‌ కళాశాలలో మంగళవారం జరిగిన జేఈఈ మెయిన్స్‌ సెక్షన్‌–1 పరీక్షకు 195 మంది హాజరయ్యారు. ఉదయం షిఫ్ట్‌లో 100 మందికి 99 మంది హాజరుకాగా, మధ్యాహ్నం 99 మందికి 96 మంది హాజరయ్యారు.

ఫీజుల పేరిట విద్యార్థులకు వేధింపులు

ఏలూరు (టూటౌన్‌): రాష్ట్రంలో నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలు విద్యార్థులను ఫీజులు పేరిట వేధింపులకు గురిచేస్తుందని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ పీడీఎస్‌యు ఆధ్వర్యంలో స్థానిక ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌ నుంచి కలెక్టరెట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని మాట్లాడుతూ పరీక్షల నేపథ్యంలో నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్‌ కళాశాలలు ఫీజులు చెల్లించాలని వేధింపులు గురిచేస్తున్నాయని, ఇందువల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కార్పొరేట్‌ విద్యాసంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా విద్యాసంస్థల తొత్తుగా మారిందని విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement