మదనపల్లెలో గ్యాంగ్ వార్
ప్రత్యర్థుల దాడిలో పుంగనూరు శేషాద్రి దారుణ హత్య
భార్య, కుమార్తె కళ్లెదుటే కిరాతకంగా నరికిన దుండగులు
ఆధిపత్యపోరులో భాగంగానే హత్య జరిగిందన్న డీఎసీ
భార్య, కుమార్తె చంపవద్దంటూ కాళ్లా వేళ్లా పడి వేడుకున్నా. కనికరం లేని కిరాతకులు వారి కళ్లెదుటే హతమార్చారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. వర్గాల ఆధిపత్య పోరుకు ప్రత్యర్థులు కలబడి బహుజన భీమ్‌సేన అధ్యక్షుడు పుంగనూరు శేషాద్రిని కిరాతకంగా నరికి చంపేశారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటనతో పట్టణవాసులు ఉలిక్కిపడ్డారు.
మదనపల్లె : ఆధిపత్య పోరులో ప్రత్యర్థుల చేతిలో ఒకరు దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని 2వ వార్డు మంజునాథ కాలనీ జగనన్న లే అవుట్‌లో బహుజన భీమ్‌సేన అధ్యక్షుడు పుంగనూరు శేషాద్రి(35) నివసిస్తున్నాడు. శేషాద్రి లారీడ్రైవర్‌గా పనిచేస్తున్న సమయంలో కలకత్తాకు చెందిన కమలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె రెడ్డి మహేశ్వరి ఉంది. కమలకు తెలుగు సరిగా రాదు. రాత్రి 11 గంటల సమయంలో గొల్లపల్లె దళితవాడకు చెందిన కొండుపల్లి ఆనంద్, అతడి అనుచరులు చరణ్, మణికంఠ, చెన్నారెడ్డి, కొందరు లావాదేవీల విషయమై చర్చించాలని మిద్దె పైకి తీసుకెళ్లారు.
మాటా మాటా పెరిగి వివాదం తలెత్తడంతో శేషాద్రిపైనా కత్తులతో దాడికి పాల్పడ్డారు. చేతి వేళ్లు అడ్డుగా పెట్టడంతో తెగి కిందపడ్డాయి. ప్రాణ భయంతో శేషాద్రి వారి నుంచి తప్పించుకుని మిద్దైపెనుంచి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. దుండగులు తలుపులు పగల గొట్టి బెడ్ రూమ్‌లో దాక్కున్న శేషాద్రిని హాల్ లోకి లాక్కొచ్చారు. తన భర్తను చంపవద్దని శేషాద్రి భార్య కమల, కూతురు రెడ్డిమహేశ్వరి వేడుకుంటున్నా.. అరిస్తే చంపేస్తామని బెదిరించారు.
వారి కళ్లెదుటే శేషాద్రిని విచక్షణా రహితంగా నరికి చంపారు. భర్తను కళ్లముందే చంపేయడంతో కమల షాక్‌కు గురైంది. కొద్దిసేపటి తర్వాత తేరుకుని రోదిస్తూ పోలీసులకు హిందీలో వివరించడం కలచివేసింది. స్థానికుల సమాచారం మేరకు డీఎస్పీ ప్రసాదరెడ్డి, సీఐలు వలీబాషా, యువరాజు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. భార్య కమల ఫిర్యాదు మేరకు కొండుపల్లె ఆనంద్, చరణ్, మణికంఠ, చెన్నారెడ్డిలతో పాటు ఆరుగురిపై ప్రాథమికంగా హత్యకేసు నమోదుచేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఆధిపత్య పోరులో భాగంగానే శేషాద్రి హత్య జరిగిందని, ఇందులో రాజకీయకోణం లేదని ఆయన స్పష్టం చేశారు.
పోలీసుల అదుపులో నలుగురు?
హత్యకు కుట్రదారుగా భావిస్తున్న కొండుపల్లె ఆనంద్ 2014, 2020లో జరిగిన రెండు హత్యకేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని డీఎస్పీ తెలిపారు. శేషాద్రి హత్యకేసులో దోషులు ఎంతమంది పాల్గొన్నారనే విషయమై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితుల కోసం ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటుచేశామన్నారు. శనివారం ఉదయం శేషాద్రి ఇంటికి డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం వెళ్లి ఆధారాలు సేకరించారు. అయితే హత్యచేసిన తర్వాత నలుగురు నిందితులు నేరుగా టూటౌన్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. ఆ సమయంలో వినియోగించిన ఏపీ–04ఏఎఫ్–5733 నెంబర్ ఇన్నోవా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నిందితులు లొంగిపోవడంపై పోలీసులు ఎలాంటి నిర్ధారణ చేయలేదు.
ఆధిపత్యం కోసమే హత్య
పుంగనూరు శేషాద్రి, కొండుపల్లె ఆనంద్ ప్రజా సంఘాల్లో సభ్యులుగా పనిచేస్తున్నారు. కొండుపల్లె ఆనంద్ ప్రధాన అనుచరుడిగా ఉన్న శేషాద్రి చిన్న దందాలు, సెటిల్మెంట్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల కిందట శేషాద్రి మదనపల్లె ఎమ్మెల్యేకు పీఏ తానేనని చెబుతూ ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసినట్లు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో అతడిపై 420 కేసు నమోదైంది. అనంతరం శేషాద్రి తన మకాం మంజునాథ కాలనీకి మార్చాడు. ఇతరుల ప్రమేయం లేకుండా సొంతంగా ల్యాండ్ సెటిల్మెంట్ చేయడం మొదలుపెట్టాడు.
ఆనంద్‌కు పోటీగా బహుజన భీమ్ సేనను స్థాపించి కాలనీలో పట్టు సాధించే ప్రయత్నం చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న రామారావు కాలనీలో అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పాడు. దీంతో ఆనంద్, శేషాద్రి వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఒకరినొకరు చంపేస్తామని బెదిరించుకోవడం, గొడవలు పడడం, సామాజిక మాధ్యమాల్లో పరస్పరం విమర్శించుకోవడం, పోలీస్ స్టేషన్‌లో రాజీప్రయత్నాలు జరగడం వెనువెంటనే జరిగిపోయాయి. దీంతో శేషాద్రిని ముట్టుబెట్టేందుకు ఆనంద్ వర్గం పథకం వేసింది. ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని, శుక్రవారం రాత్రి శేషాద్రి టూటౌన్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆనంద్ వర్గీయుల చేతిలో అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment