వైఎస్సార్‌సీపీ నాయకుడిపై కూటమి నేతల దాడి
జమ్మలమడుగు : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని కెనరా బ్యాంకుసమీపంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు పెద్దగండ్లూరు గ్రామానికి చెందిన హనుమంతురెడ్డిపై కూటమికి చెందిన శ్రీనివాసులురెడ్డి, మరో ఆరుగురు గురువారం దాడి చేశారు. బాధితుడి కథనం మేరకు.. 2018లో హనుమంతరెడ్డి స్వగ్రామం పెద్దగండ్లూరులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులు హనుమంతరెడ్డి ఇంటిపై దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేయడమేగాక, స్కార్పియో వాహనాన్ని పగులకొట్టారు. ఈ సంఘటనలో అప్పట్లో ఆదినారాయణరెడ్డి వర్గీయులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విషయంలో రాజీ పడాలని ఆదినారాయణరెడ్డి వర్గీయులు హనుమంతరెడ్డిని పదే పదే హెచ్చరిస్తూ వచ్చారు. గురువారం కేసు విచారణకు హనుమంతరెడ్డి వచ్చి వెళ్తుండగా కోర్టుకు కూతవేటు దూరంలో కూటమి నేత శ్రీనివాసులురెడ్డి, మరో ఆరుగురు కలిసి తనపై దాడి చేసినట్లు హనుమంతరెడ్డి తెలిపారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్‌రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి హనుమంతరెడ్డిని పరామర్శించారు. మాజీ ఎమ్యెల్యే డాక్టర్ మూలే సుధీర్‌రెడ్డి ఫోన్‌లో బాధితుడితో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్ట్ విచారణకు వచ్చి పోతున్న హనుమంతరెడ్డిపై దాడి చేయడం తగదన్నారు. ఇది వరకే జమ్మలమడుగు ఇన్‌ఛార్జి డీఎస్పీ భక్త వత్సలం, సీఐ లింగప్పతో మాట్లాడినట్లు వారు తెలిపారు. దాడి చేసిన వారిని శిక్షించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment