అర్జీదారుల వినతులు పరిష్కరించాలి
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారితోపాటు డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి, స్పెషల్ కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఉపాధి కల్పన అధికారి సురేష్ హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా.. ప్రజల నుంచి అందిన విజ్ఞప్తులలో కొన్నింటి వివరాలిలా ఉన్నాయి.
● తన కుమారుడికి వికలాంగ పెన్షన్ మంజూరు చేయాలని జమ్మలమడుగు మండలం మొరగుడి గ్రామానికి చెందిన టి.ధనలక్ష్మి కోరారు.
● తన ఏడేళ్ల వయసు ఉన్న ఎదుగుదల లేదని బిడ్డను వైద్యులకు చూపగా ఆపరేషన్ చేయాలని, అందుకు రూ.2 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారని, ఆపరేషన్ నిమిత్తం ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించడంతోపాటు ఆరోగ్య శ్రీ కార్డు నమోదు చేయించాలని సిద్దవటంలోని మాదిగవాడకు చెందిన పొన్నూరు వెంకటమ్మ విన్నవించారు.
● సర్వే నంబర్ 74లో 25 సెంట్ల భూమికి సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని ఖాజీపేటకు చెందిన మహబూబ్ హుస్సేన్ కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment