No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, Nov 26 2024 2:07 AM | Last Updated on Tue, Nov 26 2024 2:07 AM

No Headline

No Headline

రాష్ట్రంలో ఏకై క ఒంటిపూట బడి

విద్యార్థులకు శాపంగా మారిన ఇంటర్‌ బోర్డు నిర్వాకం

30 ఏళ్లుగా షిఫ్ట్‌ పద్ధతిలోనే చదువులు

పడిపోతున్న ‘ఐఏఎస్‌ల’హైస్కూల్‌ విద్యా ప్రమాణాలు

రాజంపేట : ఎందరో ఐఏఎస్‌లను, రాజకీయ ప్రముఖులను అందించిన నందలూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ను ఇంటర్‌మీడియెట్‌ బోర్డు పాతాళంలోకి తొక్కేస్తోంది. 30 ఏళ్ల క్రితం తాత్కాలికంగా కళాశాల తరగతులు నిర్వహించుకుంటామని చేరి శాశ్వతంగా అలాగే ఉండిపోయింది. దీంతో ఇటు హైస్కూల్‌ విద్యార్థులకు మధ్యాహ్నం వరకు.. అటు కళాశాల విద్యార్థులకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తరగతులు నడుస్తున్నాయి. కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం ఇప్పటికీ పరిష్కారం కాలేదు. 1908లో నందలూరులో బోర్డు హైస్కూల్‌ ఏర్పాటైంది. 1954లో జిల్లా పరిషత్‌ హైస్కూల్‌.. ఆ తర్వాత 1962లో జిల్లా హయ్యర్‌ సెకండరీ హైస్కూల్‌గా ఆవిర్భవించింది. ఒకప్పుడు విశాలమైన గదులు, లైబ్రరీ, ల్యాబ్‌, క్రీడా పరికరాలతో పాటు నాణ్యమైన బోధన, ఉత్తమ ఉపాధ్యాయులతో క్రమశిక్షణకు మారుపేరుగా హైస్కూల్‌ ఖ్యాతిగాంచింది. ఎందరో ఐఏఎస్‌లను అందించి చరిత్రలో నిలిచింది. ఇక్కడి హైస్కూల్‌లో తరగతులు ఉదయం 7.45కు ప్రారంభిస్తారు. మధ్నాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారు.

జూనియర్‌ కళాశాల రాకతో హైస్కూల్‌ విద్యకు గ్రహణం

నందలూరు బస్టాండు నుంచి సౌమ్యనాథ ఆలయానికి వెళ్లే మార్గంలో విశాలమైన స్థలంలో ఈ హైస్కూల్‌ ఉంది. భవనాల కొరతతో 1982లో నందలూరులోని జూనియర్‌ కళాశాలను ఇక్కడికి మార్చారు. అంతే.. ఆ రోజు నుంచి హైస్కూల్‌ సమస్యల ఒడిలోకి జారుకుంది. సొంతభవనాల నిర్మాణం వరకు అని చెప్పిన ఇంటర్‌ బోర్డు నేటి వరకు ఇక్కడే కళాశాలను కొనసాగిస్తోంది. ఇక్కడి నుంచి కళాశాలను తరలించాలని జెడ్పీ హైస్కూల్‌ యాజమాన్యం ఎన్నిసార్లు మొత్తుకున్నా.. కలెక్టర్లు జోక్యం చేసుకున్నా ఫలితం లేదు. ప్రస్తుతం 274 మంది విద్యార్థులున్న ఈ హైస్కూల్‌లో మధ్యాహ్నం వరకు తరగతులు సాగుతున్నాయి. మధ్యాహ్నం నుంచి ఇంటర్‌ విద్యను కొనసాగిస్తున్నారు. షిప్ట్‌ విధానంపై విద్యార్థుల తిరుగుబాటు, ఆందోళనలు, ఉద్యమాలు జరిగినా పట్టించుకున్న పాపానపోలేదు.

రూ.లక్షలు వెనక్కి..

ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి ఈ షిప్ట్‌ విధానానికి స్వస్తి పలకాలని భావించారు. గత ప్రభుత్వంలో లక్షలాది రూపాయలు మంజూరు చేయించారు. పీహెచ్‌సీకి సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేశారు. నిర్మాణ పనులు చేపట్టే సమయంలో వివాదాలు తలెత్తాయి. అంతే పెండింగ్‌లో పడింది. జూనియర్‌ కళాశాలను మండల కార్యాలయాల కాంప్లెక్స్‌ సమీపంలో నిరుపయోగంగా ఉన్న ఎస్సీ హాస్టల్‌ను కేటాయించి అక్కడికి తరలించాలని ప్రయత్నించారు. జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ఇంటర్‌ విద్యకు ఎస్సీ హాస్టల్‌ను ఆధునికీకరణ చేసి సరిపోతుందని భావించి ఆ దిశగా చర్యలు తీసుకున్నారు.

వ్యతిరేకిస్తున్న అధ్యాపకులు

ఏదో ఒక పూట వస్తున్నాం.. పాఠాలు చెప్పిపోతున్నాం.. అక్కడికి తరలిస్తే రెండు పూటలా కాలేజీకి రావాల్సి వస్తుంది అనుకున్నారో ఏమో... ఇంటర్‌ కళాశాలను తరలింపును కొందరు అధ్యాపకులు వ్యతిరేకిస్తున్నారు. మండల కాంప్లెక్స్‌ సమీపంలోని ఎస్సీ హాస్టల్‌ భవనాలు దూరమని.. అక్కడికి వెళితే ఇంటర్‌ బాలికలకు రక్షణ ఉండదని ప్రచారం చేశారు. నిజానికి మండల కాంప్లెక్స్‌ ఆవరణ ప్రశాంతంగా ఉంటుంది. దశాబ్దాలుగా అక్కడే వందలాదిమంది బాలికలతో బీసీ గురుకుల పాఠశాల కూడా ఉంది. కేవలం తమ స్వార్థం కోసం అధ్యాపకులు చేసిన వ్యవహారం వల్ల తరలింపు ఆగిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా కలెక్టర్‌, డీఈవో, ఇంటర్‌ ఆర్‌జెడీ ఒకతాటిపైకి వచ్చి హైస్కూల్‌కు ఒంటిపూట బడి నుంచి విముక్తి కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement