సకాలంలో వినతుల పరిష్కారం
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజలు సమర్పించే అర్జీలను జాప్యం లేకుండా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
● సోమశిల బ్యాక్ వాటర్ వల్ల తమ గ్రామాల్లోకి నీరు వస్తోందని, వెంటనే తమకు నష్టపరిహారం చెల్లించి ఇళ్లను సేకరించాలని ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లె, పెన్నపేరూరు గ్రామాల ప్రజలు కోరారు. గతంలో సోమశిలలో 78 టీఎంసీల నీరు నిల్వ చేసినపుడు తమ ఇళ్లల్లోకి నీరు రావడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 60 టీఎంసీలు నిల్వ చేస్తే దోమలు, విష పురుగులు రావడంతోపాటు డెంగీ, ఇతర జ్వరాలు ప్రబలుతున్నాయన్నారు. కనుక భూ సేకరణ జరిపి ఆదుకోవాలని కోరారు.
● ఎర్రగుంట్ల మండలం వై.కోడూరు గ్రామ సర్వే నెంబరు 756–2, 788, 792 సర్వే నెంబర్లలోని 495 ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని, వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.అన్వేష్ కోరారు.
● గండికోటలో అక్రమంగా వసూలు చేస్తున్న టోల్‌గేట్ రద్దు చేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ కోరారు. వ్యక్తికి ఒక రేటు, వాహనాలకు ఒకరేటు, సెలవు రోజుల్లో మరో రేటుతో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కోట అభివృద్దికి డబ్బులు వసూలు చేస్తున్నారనడం విడ్డూరంగా ఉందన్నారు. కోట పురావస్తుశాఖకు చెందినది కాగా, టూరిజం వారు టోల్ వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి జీఓ, సర్క్యులర్ ఏమి లేవన్నారు. డిజిటల్ ప్రింటింగ్ టిక్కెట్ కూడా ప్రజలకు ఇవ్వడం లేదన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, డీఆర్‌డీఏ పీడీ ఆనంద్‌నాయక్, ఐసీడీఎస్‌పీడీ శ్రీలక్ష్మి ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ చొరవతో తెల్లపాడుకు ఆర్టీసీ బస్సు
కలసపాడు : మండలంలోని తెల్లపాడు గ్రామానికి సోమవారం ఆర్డీఓ చంద్రమోహన్ ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు. ఇటీవల పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా తెల్లపాడుకు వచ్చిన జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ దృష్టికి ప్రజలు ఈ విషయాన్ని తీసుకొచ్చారు. దీంతో బస్సు సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ఆర్డీఓను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం తెల్లపాడుకు బస్సు సర్వీసును ఆర్డీఓ ప్రారంభించారు. తెల్లపాడు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దారు మధురవాణి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment