సాక్షి, కరీంనగర్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు కుంటలు నిండి మత్తడి దూకుతున్నాయి. జిల్లాలోని పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పంట పొలాలు నీట మునిగాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో సగటున మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లాలో సగటున 2.91 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సగటున 2.69 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లాలో సగటున 2.5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. మిడ్ మానేర్, లోయర్ మానేర్ డ్యామ్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, అన్నారం బ్యారేజ్ ల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ వరదనీటితో నిండటంతో జనజీవనం స్తంభించింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ శివారులో మంథని-కాటారం వెళ్ళే ప్రధాన రహదారి పై భారీ వర్షానికి చెట్లు విరిగిపడటంతో రవాణాకు అంతరాయం కలిగింది.