నీట్ కౌన్సెలింగ్.. ఇలా!
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్–అండర్ గ్రాడ్యుయేట్.. సంక్షిప్తంగా నీట్–యూజీ! దేశ వ్యాప్తంగా.. ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు ఆయుష్ వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష! కొద్దిరోజుల క్రితమే నీట్ యూజీ–2024 ఫలితాలు వెల్లడయ్యాయి. మరోవైపు ఈ పరీక్షపై వివాదం కొనసాగుతున్నా.. నీట్ కౌన్సెలింగ్‌కు సన్నాహాలు మొదలయ్యాయనే వార్తలు! ఈ నేపథ్యంలో నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది.. ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా సీట్ల భర్తీ విధానం.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సీట్ల భర్తీ తీరు, నీట్ ర్యాంకర్లు కౌన్సెలింగ్‌కు సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు తదితర అంశాలపై విశ్లేషణ..‘నీట్ యూజీ–2024 ఫలితాలపై ఆందోళనలు జరుగుతున్నా.. మళ్లీ పరీక్ష నిర్వహించే అవకాశాలు తక్కువే. కాబట్టి నీట్ ఉత్తీర్ణులు ఫలితాలపై వస్తున్న వార్తల జోలికి వెళ్లకుండా.. కౌన్సెలింగ్‌కు సిద్ధమవ్వాలి’ అంటున్నారు నిపుణులు. పెరుగుతున్న సీట్లు⇒ నేషనల్ మెడికల్ కమిషన్ గణాంకాల ప్రకారం–దేశ వ్యాప్తంగా మొత్తం 783 ఎంబీబీఎస్ కళాశాలల్లో 1,61,220 సీట్లు ఉన్నాయి. వీటిలో 331 ప్రైవేట్ కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీలు ఉండగా.. అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 74,703. అదేవిధంగా నీట్ స్కోర్‌తోనే భర్తీ చేసే బీడీఎస్ కోర్సులో 28,088 సీట్లు, ఆయుష్ కోర్సుల్లో 52,720 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ⇒ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో.. ప్రస్తుతం 16 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,935 ఎంబీబీఎస్ సీట్లు; మరో 16 ప్రైవేట్ కళాశాలల్లో 2,850 సీట్లు ఉన్నాయి. రెండు మైనారిటీ కళాశాలల్లో 300 సీట్లు; స్వయం ప్రతిపత్తి కలిగిన శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 175 సీట్లు ఉన్నాయి. బీడీఎస్‌కు సంబంధించి.. రెండు ప్రభుత్వ డెంటల్ కళాశాలల్లో 140 సీట్లు; 14 ప్రైవేట్ కళాశాలల్లో 1,300 సీట్లు చొప్పున ఉన్నాయి.⇒ తెలంగాణ రాష్ట్రంలో.. ఎంబీబీఎస్‌కు సంబంధించి 27 ప్రభుత్వ కళాశాలల్లో 3,790 సీట్లు; 29 ప్రైవేట్, మైనారిటీ కళాశాల్లో 4,700 సీట్లు ఉన్నాయి. బీడీఎస్‌కు సంబంధించి ఒక ప్రభుత్వ కళాశాలలో 100 సీట్లు; పది ప్రైవేట్ కళాశాలల్లో 1,000 సీట్లు; వీటికి అదనంగా సికింద్రాబాద్ ఆర్మీ డెంటల్ కళాశాలలో ఆరు సీట్లు ఉన్నాయి.పేరున్న కళాశాలలో సీటుప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను పరిగణనలోకి తీసుకుంటే.. ఆల్ ఇండియా స్థాయిలో రిజర్వ్డ్ కేటగిరీలో రెండు లక్షల వరకు ర్యాంకు వరకూ సీట్లు పొందే అవకాశముందని అంచనా. పేరున్న ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు సొంతం చేసుకోవాలంటే మాత్రం జాతీయ స్థాయిలో 40 వేల లోపు ర్యాంకుతోనే సాధ్యమని చెబుతున్నారు.కౌన్సెలింగ్.. ఏఐక్యూ, స్టేట్ కోటానీట్ యూజీ కౌన్సెలింగ్‌ను రెండు విధానాల్లో నిర్వహించి సీట్ల భర్తీ చేపడతారు. అవి.. ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా. ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీని డీజీహెచ్ఎస్కు చెందిన మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహిస్తుంది. రాష్ట్ర కోటాకు సంబంధించి.. రాష్ట్రాల వైద్య విశ్వ విద్యాలయాలు కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి.ఆల్ ఇండియా కోటాజాతీయ స్థాయిలోని మెడికల్ కళాశాలలను నేషనల్ పూల్‌లోకి తీసుకెళ్లినప్పటì æనుంచి ఆల్ ఇండియా కోటా పేరుతో కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ విధానం ప్రకారం.. జాతీయ స్థాయిలోని అన్ని మెడికల్, డెంటల్ కళాశాలలు, యూనివర్సిటీల్లోని 15 శాతం సీట్లకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. దీనిని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీజీహెచ్ఎస్కు చెందిన మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ చేపడుతుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా ఎంసీసీ నిర్వహించే కౌన్సెలింగ్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఆల్ ఇండియా కోటా విధానంలో ఒక రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లోని వైద్య కళాశాలలకు కూడా పోటీ పడే అవకాశం లభిస్తుంది.స్టేట్ కోటా కౌన్సెలింగ్జాతీయ స్థాయిలో ఎంసీసీ కేవలం 15 శాతం సీట్లకే కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. మిగతా 85 సీట్లను ఆయా రాష్ట్రాలు సొంతంగా కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తాయి. ప్రభుత్వ కళాశాలల్లోని 85 శాతం సీట్లు(ఆల్ ఇండియా కోటాకు కేటాయించాక మిగిలిన సీట్లు), ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా పేరుతో అందుబాటులో ఉండే 50 శాతం సీట్లను.. అదే విధంగా ప్రైవేట్ కళాశాలల్లో ప్రైవేట్–బి పేరిట ఉండే 35 శాతం సీట్లు, ఎన్ఆర్ఐ కోటాగా పిలిచే 15 శాతం సీట్లను కూడా హెల్త్ యూనివర్సిటీలే కౌన్సెలింగ్ విధానంలో భర్తీ చేస్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. మైనారిటీ కళాశాలల్లో అందుబాటులో ఉండే సీట్లను కూడా ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియను కూడా హెల్త్ యూనివర్సిటీలే చేపడతాయి.ఫీజులు ఇలా⇒ ఏపీలో ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో కేటగిరీ–ఎ పేరిట ఉండే కన్వీనర్ కోటాలో రూ.15 వేలు ఫీజుగా నిర్ధారించారు. ప్రైవేట్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా కేటగిరీ–బి సీటుకు రూ.12 లక్షలు; పైవేట్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా(కేటగిరీ–సి) సీట్లకు: రూ.36 లక్షలుగా పేర్కొన్నారు. బీడీఎస్ కోర్సుకు సంబంధించి ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో కేటగిరీ–ఎ కన్వీనర్ కోటా సీట్లకు ఫీజు రూ.13 వేలు; ప్రైవేట్ కళాశాలల్లోని కేటగిరీ–బి మేనేజ్మెంట్ సీట్లకు రూ.4 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీట్లకు రూ.12 లక్షలు వార్షిక ఫీజుగా ఉంది. ⇒ తెలంగాణలో ప్రభుత్వ కళాశాలల్లో సీటుకు రూ.10 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీటుకు రూ.60 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో బి–కేటగిరీ(మేనేజ్మెంట్ కోటా) సీటుకు రూ.11.55 లక్షలు–రూ.13 లక్షలుగా ఫీజు ఉంది. అదే విధంగా.. ప్రైవేట్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా(సి–కేటగిరీ) సీటు ఫీజు బి కేటగిరీ సీటుకు రెండు రెట్లుగా ఉంది. బీడీఎస్ కోర్సులో.. ప్రభుత్వ కళాశాలల్లో రూ.10 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో ఎ–కేటగిరీ(కన్వీనర్ కోటా) సీట్లు: రూ.45 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో బి–కేటగిరీ(మేనేజ్మెంట్ కోటా) సీట్లు: రూ.4.2 లక్షలు – రూ.5 లక్షలు చొప్పున ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో సి–కేటగిరీ(ఎన్ఆర్ఐ కోటా) సీటుకు బి కేటగిరీ సీటుకు 1.25 రెట్లు సమానమైన మొత్తం ఫీజుగా ఉంది. ⇒ ఈ ఫీజుల వివరాలు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించినవిగా గుర్తించాలి. కౌన్సెలింగ్ సమయానికి వీటిలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది.ఏఐక్యు.. కౌన్సెలింగ్ విధానమిదే⇒ విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు ఇప్పటి నుంచే సంసిద్ధంగా ఉండాలి. జాతీయ స్థాయిలోని సీట్లకు పోటీ పడాలనుకునే విద్యార్థులు.. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహించే ఆన్లైన్ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. ఇందుకోసం ఎంసీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉండే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను క్లిక్ చేసి.. ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అనంతరం ఆన్లైన్ అప్లికేషన్లో ఉండే అన్ని వివరాలను నమోదు చేయాలి. ⇒ ఆ తర్వాత అందుబాటులో ఉన్న కళాశాలలు, సీట్ల వివరాలు కనిపిస్తాయి. వాటికి అనుగుణంగా తమ ప్రాథమ్యాలను పేర్కొంటూ.. ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేయాలి. ఆ తర్వాత రౌండ్ల వారీగా సీట్ అలాట్మెంట్ వివరాలను వెల్లడిస్తారు. ⇒ తొలి రౌండ్లో సీట్ అలాట్మెంట్ పొందిన అభ్యర్థులు సదరు కళాశాలలో చేరాలనుకుంటే.. నిర్దేశిత మొత్తాన్ని రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ⇒ తొలి రౌండ్లో సీటు వచ్చిన కళాశాలలో చేరడం ఇష్టం లేకుంటే.. ఫ్రీ ఎగ్జిట్ అవకాశం అందుబాటులో ఉంది. వీరు రెండో రౌండ్ కౌన్సెలింగ్‌కు హాజరవ్వచ్చు. ⇒ తొలి రౌండ్ కౌన్సెలింగ్‌లోనే సీటు లభించి ఫీజు చెల్లించిన అభ్యర్థులు మరింత మెరుగైన సీటు కోసం తదుపరి రౌండ్‌కు హాజరయ్యే అవకాశం కూడా ఉంది.స్టేట్ కోటాకు ప్రత్యేక కౌన్సెలింగ్రాష్ట్రాల స్థాయిలో హెల్త్ యూనివర్సిటీలు నిర్వహించే స్టేట్ కోటా సీట్ల కౌన్సెలింగ్‌కు విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంసీసీ కౌన్సెలింగ్ తొలి రౌండ్ ముగిసిన తర్వాత హెల్త్ యూనివర్సిటీలు ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. ఈ కౌన్సెలింగ్ కూడా పలు రౌండ్లలో జరుగుతుంది. స్టేట్ కోటాకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి వారికి వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా ముందుగా ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్‌ను ప్రకటిస్తారు. ఈ మెరిట్ లిస్ట్‌లో చోటు సాధించిన అభ్యర్థులు నిర్దేశిత రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించి.. ఆన్లైన్లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. తదుపరి రౌండ్ల కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది.పూర్తిగా ఆన్లైన్హెల్త్ యూనివర్సిటీలు నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నిర్దేశించిన వెబ్సైట్లో లాగిన్ ఐడీ, పాస్ట్‌వర్డ్ క్రియేట్ చేసుకోవడం, ఆ తర్వాత నీట్ ర్యాంకు సహా, ఇంటర్మీడియెట్ వరకూ.. అన్ని అర్హతల వివరాలను పేర్కొనడం, ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ తప్పనిసరి.ప్రభుత్వ కళాశాలలకే ప్రాధాన్యంనీట్లో ఉత్తీర్ణత సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులు ప్రభుత్వ కళాశాలలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏఎంసీ–విశాఖపట్నం, జీఎంసీ–గుంటూరు, కాకినాడ మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కళాశాలలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. తెలంగాణలో.. ర్యాంకర్ల తొలి ప్రాధాన్యం ఉస్మానియా మెడికల్ కళాశాల కాగా ఆ తర్వాత స్థానంలో గాంధీ మెడికల్ కళాశాల, కాకతీయ మెడికల్ కళాశాల, ఈఎస్ఐ మెడికల్ కళాశాల నిలుస్తున్నాయి.ఈ సర్టిఫికెట్లు సిద్ధంగానీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే కౌన్సెలింగ్‌కు అవసరమైన పత్రాలు, సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలి. అవి.. నీట్ ఎంట్రన్స్ అడ్మిట్ కార్డ్, నీట్ ర్యాంక్ కార్డ్, పుట్టిన తేదీ ధ్రువపత్రం, పదో తరగతి సర్టిఫికెట్, ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు మార్క్ షీట్, సర్టిఫికెట్, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వర్టకు స్టడీ సర్టిఫికెట్స్(స్థానికతను నిర్ధారించేందుకు), పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్స్ ఎనిమిది. ఇలా కౌన్సెలింగ్ విధానంతోపాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకుంటే.. కౌన్సెలింగ్ ఎప్పుడు జరిగినా తడబాటులేకుండా ముందుకు సాగే అవకాశం ఉంటుంది.