-
గృహ ప్రవేశానికి వస్తూ తిరిగిరాని లోకాలకు..
మైదుకూరు/కాశినాయన: బంధువుల నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆదివారం మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లెకు సమీపంలో ఈ సంఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కాశినాయన మండలం చిన్నాయపల్లెకు చెందిన గుర్రాల శ్రీనివాసులరెడ్డి వ్యవసాయం చేస్తుంటారు. ఈయనకు భార్య అరుణ, కుమార్తె పవిత్ర, కుమారుడు జగదీష్‌రెడ్డి ఉన్నారు. జగదీష్‌రెడ్డి ఖాజీపేటలో అవ్వగారి ఇంటి వద్ద ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం శ్రీనివాసులురెడ్డి భార్య కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంలో మైదుకూరు మున్సిపాలిటీలోని శెట్టివారిపల్లెలో సోమవారం జరిగే తమ బంధువుల గృహ ప్రవేశానికి బయలుదేరారు. ముదిరెడ్డిపల్లెకు సమీపంలో ఎద్దడుగు కనుమ వద్ద వెనుక వైపు నుంచి లారీ బైక్‌ను ఢీకొంది. \ఈ సంఘటనలో బైక్‌పై ఉన్న శ్రీనివాసులరెడ్డి, భార్య, కుమార్తె కిందపడిపోయారు. వారిపై నుంచి లారీ వేగంగా దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిదండ్రులు, చెల్లెలు మృతి చెందడంతో జగదీష్‌రెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. చుట్టుపక్కల ఉన్న వారు గట్టిగా కేకలు వేస్తున్నా లారీ ఆపకుండా వెళ్లినట్టు తెలుస్తోంది. శుభకార్యానికి వెళుతూ ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందడంతో చిన్నాయపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని మైదుకూరు అర్బన్ సీఐ సయ్యద్ హాసం పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
జింక చర్మాల అక్రమ రవాణా
వజ్రకరూరు: అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జింకలను వేటాడి చంపి..వాటి మాంసాన్ని విక్రయించడంతో పాటు చర్మాలను అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అనంతపురం జిల్లా వజ్రకరూరు పోలీసులు అరెస్టు చేసి 24 జింక చర్మాలు, రెండు కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం వజ్రకరూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ నాగస్వామి..ఫారెస్ట్ సెక్షన్ అధికారి కరీముల్లా, బీట్ ఆఫీసర్ సతీష్‌తో కలసి కేసు వివరాలను వెల్లడించారు.గుంతకల్లుకి చెందిన షికారి దేవరాజు, షికారి గోవిందు, అనంతపురం నగరానికి చెందిన షికారి బాబు, షికారి బాలరాజు, గుంతకల్లు మండలం ఆచారమ్మ కొట్టాలకు చెందిన వడ్డే పెద్దఅంజి గుంతకల్లు, వజ్రకరూరు, ఆలూరు, చిప్పగిరి తదితర ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో కత్తెరలు ఏర్పాటు చేసి జింకలను వేటాడేవారు. వాటి మాంసాన్ని విక్రయించి చర్మాలను కర్ణాటకలోని బళ్లారి, కంప్లి, హొస్పేట్ తదితర ప్రాంతాలకు అక్రమ రవాణా చేసేవారు.శనివారం సాయంత్రం 24 జింక చర్మాలు, రెండు కొమ్ములను సంచుల్లో వేసుకుని కర్ణాటక వైపు వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం రాగా.. అటవీ శాఖ అధికారులతో కలసి వజ్రకరూరు మండలం కొనకొండ్ల సమీపంలోని బళ్లారి జాతీయ రహదారిలో వీరిని పట్టుకున్నారు. నిందితులను ఆదివారం అనంతపురంలోని మొబైల్కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. -
బాలికపై ఇంటర్ విద్యార్థి లైంగిక దాడి
తిరుపతి క్రైమ్: ఎనిమిదేళ్ల బాలికపై ఇంటర్ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని ఎంఆర్‌పల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి బాలాజీ నగర్‌లోని కాలేజీలో చదువుకుంటూ అక్కడికి దగ్గర్లో ఉన్న అమ్మమ్మ ఇంట్లో ఉండేవాడు. వీరి ఇంటికి సమీపంలోనే బాలిక కుటుంబం నివసిస్తోంది. పదో తరగతి చదువుతున్న బాలిక అన్నతో సన్నిహితంగా ఉంటూ వారింటికి వచ్చిపోతూ ఉండేవాడు. పది రోజుల కిందట బాలికకు చాక్లెట్లు కొనిస్తానని చెప్పి అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే మీ అమ్మానాన్నల్ని చంపేస్తానని బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పలేదు. అలా బెదిరిస్తూ నాలుగుసార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలికకు జ్వరం, కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. లైంగికదాడి జరిగినట్లు వైద్యులు గుర్తించడంతో తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా విషయం చెప్పింది.దీంతో తల్లిదండ్రులు ఎస్వీ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి పోక్సో కేసు నమోదుచేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా నగరంలో నివసించే రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లో నిందితుడి అమ్మమ్మ పనిచేస్తుండటంతో అతను పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించారు. బాలిక బంధువులు, కుటుంబీకులు దాడిచేసేందుకు ప్రయత్నించడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. -
తిరుపతి: ఆర్టీసీ బస్సులో విషాదం
సాక్షి, తిరుపతి: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని ఓ యువకుడు మృతిచెందాడు. శ్రీకాళహస్తి-తిరుపతి మార్గంలో వెళ్లే ఆర్టీసీ బస్సులో ఈ తెల్లవారు జామున ఘటన జరిగింది.బస్సులో వెనుక సీటు వద్ద ఉన్న హ్యాంగర్‌కు ఉరేసుకుని చనిపోయినట్లు రేణిగుంట వద్ద కండక్టర్ గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన యువకుడి వివరాలు కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. -
వామ్మో...వెడ్డింగ్ ఇన్విటేషన్లు!
పలమనేరు: గతంలో ఎవరిదైనా వివాహ శుభకార్యమైతే ఇళ్లకు వెళ్లి పెళ్లిపత్రికలు ఇచ్చేవారు. ఇప్పుడంతా డిజిటల్ మయమైంది. అన్నింటికీ స్మార్ట్ ఫోనే దిక్కుగా మారింది. అందులోనే వివాహ ఆహ్వాన పత్రికలను బంధువులు, స్నేహితులకు పంపుతున్నారు. వెడ్డింగ్ కార్డు కాబట్టి తప్పకుండా వాట్సాప్‌లో వచ్చిన మెసేజీని టచ్ చేసి చూడాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు హ్యాకర్ల పాలిట వరంలా మారింది. ఆయా ప్రాంతాల్లో బాగా తెలిసిన వారి పెళ్లి డిటిటల్ కార్డును హ్యాకర్లు డౌన్లోడ్ చేసుకుని దాన్ని డాట్ ఏపీకే ఫైల్‌గా మార్చి వేలాదిమందికి వాట్సాప్‌లో పంపుతున్నారు. కచ్చితంగా చూడాలి కాబట్టి మనం ఆ మెసేజ్‌ను టచ్ చేశామో అంతే సంగతులు. మన ఫోన్ హ్యాకర్ల చేతిలోకి వెళ్లి మన వ్యక్తిగత డేటా, మన బ్యాంకు వివరాలన్నీ హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతాయి. దీంతో మనకు తెలియకుండానే మన బ్యాంకు ఖాతాల్లోని డబ్బు స్కామర్లకు చేరిపోతోంది.వెలుగు చూసిందిలా...చిత్తూరు జిల్లా పలమనేరుకు సమీపంలోని నంగిళిలో ఓ వ్యాపారి తన కుమార్తె పెళ్లి కార్డులను మంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో చేయించి దాన్ని బంధువులకు, స్నేహితులకు వాట్సాప్‌కు పంపారు. దీన్నే కొందరు హ్యాకర్లు కాపీ చేసి అందులో డాట్ ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజి కిట్) ఫైల్‌ను సెట్‌చేసి పలువురి మొబైళ్లకు పంపారు. దీన్ని ఓపెన్ చేసినవారి ఫోన్లలోకి డాట్ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అయి వారి మొబైళ్లు హ్యాక్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కొందరు మొబైల్లో డాట్ ఏపీకే ఫైల్‌ను రీసెట్ చేయడం ద్వారా మెయిల్, పాస్వర్డ్ మార్చుకుని టూస్టెప్ వ్యాలిడేషన్ చేసుకుని ఆపై డిలీట్ చేసుకున్నారు. మరికొందరి ఖాతాల్లోంచి దాదాపు 1.60లక్షల దాకా పోగొట్టుకున్నట్టు తెలిసింది. దీంతో కొందరు బాధితులు మాత్రం సైబర్‌సెల్‌కు సెల్‌ఫోన్ ద్వారానే ఫిర్యాదులు కూడా చేశారు. కానీ పోయిన నగదు వారికి వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. -
మఠం నిర్వాహకుడిపై టీడీపీ వర్గీయుల దాడి
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న తెలుగుదేశం నేతలు దాడులు, దౌర్జన్యాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా నదీతీరంలో మఠం ఏర్పాటుచేసుకుని జీవిస్తున్న స్వామిపై దాడిచేశారు. దారి ఆక్రమిస్తుండటాన్ని ప్రశ్నించినందుకు రాడ్డుతో తలపగులగొట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో శనివారం ఏపీ అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపీ నాయకుడు ఊకా విజయ్‌కుమార్ అనుచరులు ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితుడు మహేంద్రస్వామి తెలిపిన వివరాల మేరకు.. చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లికి చెందిన మహేంద్రస్వామి స్వర్ణముఖినది ఒడ్డున నిజరూపమఠం ఏర్పాటు చేసుకున్నారు. మఠం పక్కన నది వెంబడి ఉన్న దారిని శనివారం విజయ్‌కుమార్ అనుచరులు ఆక్రమించుకుని యంత్రాలతో పనులు చేపట్టారు. ఈ ఆక్రమణను మహేంద్రస్వామి ప్రశ్నించారు. తమ నాయకుడు ఊకా విజయ్‌కుమార్ చెబితేనే పనులు చేస్తున్నామని, అడగడానికి నువ్వు ఎవడివి అంటూ వారు దురుసుగా చెప్పారు. వెంటనే వెళ్లిపొమ్మని హెచ్చరించారు. మహేంద్రస్వామి వెళ్లకపోవడంతో రాడ్లతో దాడిచేసి తలపగులగొట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి మహేంద్రస్వామిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయన తలకు కుట్లువేశారు. టీడీపీ వస్తే దాడులు చేస్తున్నారు తెలుగుదేశం అ«ధికారంలోకి వస్తే తనపై ఆ పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని మహేంద్రస్వామి ఆవేదనతో చెప్పారు. గతంలోను ఊకా విజయ్‌కుమార్ పలుమార్లు తనపై దాడిచేసినట్లు తెలిపారు. గతంలో తన పళ్లు రాలగొట్టారని, పలుమార్లు రుయా ఆస్పత్రికి వెళ్లి ఎంఎల్సీ చేసుకుని, పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని చెప్పారు. న్యాయం చేయకపోతే తాను మరణించినట్లు సర్టిఫికెట్ ఇవ్వాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఏనాడు ఈ కబ్జాలు, దౌర్జన్యాలు జరగలేదని, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ అవి పెరిగాయని చెప్పారు. ఇప్పుడు సీఎం చంద్రబాబునాయుడు వద్దకు వెళ్లి న్యాయం చేయాలని కోరతానని తెలిపారు. తనకు న్యాయం జరిగేవరకు పోరాడతానని ఆయన చెప్పారు. -
తల్లి, కుమారుడి దారుణహత్య
మండవల్లి/కైకలూరు: ఏలూరు జిల్లా మండవల్లి మండలం గన్నవరంలో శుక్రవారం రాత్రి తల్లి, కొడుకు దారుణహత్యకు గురయ్యారు. శనివారం తెల్లవారి చుట్టుపక్కలవారు మృతదేహాలను గమనించడంతో హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి తగాదాల నేపథ్యంలో వీరి హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నవరం గ్రామానికి చెందిన రొయ్యూరు సుబ్బారావు, నాంచారమ్మ దంపతులకు నగేష్‌బాబు (55) సంతానం. అతడు పుట్టిన తర్వాత నాంచారమ్మ మరణించడంతో ఆమె చెల్లెలు భ్రమరాంబను సుబ్బారావు రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి సురేష్ (35) సంతానం. సుబ్బారావు 20 సంవత్సరాల కిందట మరణించాడు. నగేష్‌బాబు విజయవాడలో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. ఐటీడీపీలో యాక్టివ్ మెంబర్‌గా కొనసాగుతున్న సురేష్ స్వగ్రామంలోనే ఉంటున్నాడు. ఈ కుటుంబానికి గన్నవరంలో 40 సెంట్ల పొలం, ఒక భవనం, 6 సెంట్ల స్థలం తండ్రి ఆస్తిగా ఉన్నాయి. వీటి విషయంలో నగేష్‌బాబు, సురేష్‌ల మధ్య విభేదాలున్నాయి.కోర్టుల్లో కేసులు కూడా ఉన్నాయి. ఇటీవల 40 సెంట్ల పొలాన్ని చెరిసగం పంచుకున్నారు. భవనం విషయంలో గొడవలు ముదిరాయి. సురేష్ భార్య గాయత్రి తండ్రి సంవత్సరీకం కావడంతో భార్య, భర్త, పిల్లలు గురువారం ముసునూరు వెళ్లారు. తల్లి ఇంటివద్ద ఒంటరిగా ఉందని సురేష్ శుక్రవారం గన్నవరం వచ్చేశాడు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు ఇంట్లో మంచంపై పడుకున్న సురేష్ మెడను కోసి హత్యచేశారు. బయట పడుకున్న భ్రమరాంబను తలపై నరికి చంపేశారు. శనివారం తెల్లవారిన తరువాత భవనం వరండాలో రక్తపుమడుగులో ఉన్న భ్రమరాంబను చుట్టుపక్కలవారు గమనించారు. వచ్చి చూడగా రెండు హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఘటనాస్థలాన్ని ఏలూరు డీఎస్పీ శ్రవణ్‌కుమార్, కైకలూరు సీఐ వి.రవికుమార్, ఎస్ఐ రామచంద్రరావు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆస్తి వివాదాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్టు భావిస్తున్నామన్నారు. మొదటి భార్య కుమారుడు నగేష్‌బాబు పాత్రతో పాటు ఇతర కారణాలపై విచారిస్తున్నట్లు చెప్పారు. -
సీబీఐ దర్యాప్తు ముమ్మరం
సాక్షి, విశాఖపట్నం: వాల్తేరు డీఆర్ఎం సౌరభ్‌కుమార్ ప్రసాద్ కాంట్రాక్టు సంస్థల నుంచి రూ.25 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. వరుసగా నాలుగో రోజు శనివారం ఏడీఆర్ఎం పేషీలో ఉద్యోగులు, అధికారులను సీబీఐ బృందం విచారించింది. డీఆర్ఎం అనధికార వ్యవహారాలను పర్యవేక్షించే ఇద్దరు ఉద్యోగులపై సీబీఐ ఆరా తీసింది. ప్రొటోకాల్–స్పోర్ట్స్ విభాగంలో ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి ఒకరు డీఆర్ఎం వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించేవారు. ఫైళ్ల లావాదేవీలు పూర్తి చేసే విషయంలో ముందుగా సదరు ఉద్యోగితో సంప్రదింపులు జరిగేవి.ఎవరైనా విదేశీ కరెన్సీ లంచంగా ఇస్తే అతనే వాటిని మార్పిడి చేసేవారని సమాచారం. ఈ విషయాలపైనా సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. అదేవిధంగా డీఆర్ఎం అక్రమ వ్యవహారాలను దగ్గరుండి చక్కబెట్టే ఒక గ్రూప్–4 ఉద్యోగి పాత్రపైనా సీబీఐ అధికారులు అనుమానాలు వ్యక్తం చేసి విచారించారు. మొత్తం మెకానికల్, ఇంజినీరింగ్, మెడికల్‌తోపాటు 8 విభాగాల ఉద్యోగులను ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నించారు. అనంతరం ‘కేసు దర్యాప్తులో ఉంది.గత డీఆర్ఎం సౌరభ్‌కుమార్ ప్రసాద్ ఆమోదించిన, ఆమోదించబోయే ఫైళ్లను ఎవరూ కదిలించొద్దు. మేం ఈ నెల 27 తర్వాత వచ్చి పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ణయం చెబుతాం’ అని సీబీఐ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు డీఆర్ఎం లంచాల వ్యవహారంలో ఓ సీనియర్ అధికారి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సదరు అధికారిని కూడా విచారించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. కొన్ని ఫైళ్లు స్వాదీనంఈ కేసులో ఇప్పటికే డీఆర్ఎం కార్యాలయంతోపాటు విశాఖ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న డీఆర్ఎం బంగ్లాలోను సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించి పలు కీలక ఫైళ్లు స్వా«దీనం చేసుకున్నారు. డీఆర్ఎం లంచం తీసుకుంటూ దొరకడానికి కారణమైన సంస్థలతోపాటు ఇంకా ఏ సంస్థలకైనా అనుకూలంగా టెండర్లలో మార్పులు చేయడం, పెనాల్టీ తగ్గించడం వంటి వ్యవహారాలకు పాల్పడి ఉండవచ్చని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే ప్రతి టెండర్ ఫైల్‌ను పరిశీలించాలని నిర్ణయించారు. సౌరభ్‌కుమార్ వాల్తేరు డీఆర్ఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏయే ఫైళ్లపై సంతకాలు చేశారన్న విషయాలపై పూర్తిస్థాయిలో ఈ నెల 27వ తేదీ తర్వాత దర్యాప్తు చేయనున్నారు. -
కష్టజీవులను కబళించిన మృత్యుశకటం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గార్లదిన్నె: వారంతా వ్యవసాయ కూలీలు.. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు. రోజూ మాదిరిగానే ఉదయాన్నే పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని ఆటోలో ఇంటికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యుశకటం కబళించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా గార్లదిన్నెకు సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు గార్లదిన్నె మండలం తిమ్మంపేట వద్ద అరటి తోటలో ఎరువు వేసే పనికోసం ఉదయమే ఆటోలో వచ్చారు. అక్కడ పని ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి తిరుగు పయనమయ్యారు. తలగాచిపల్లి క్రాస్ వద్ద ఆటో గార్లదిన్నె వైపునకు మలుపు తీసుకుంటుండగా.. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలపెద్దయ్య అలియాస్ తాతయ్య (55), చిన్ననాగమ్మ (48) రామాంజినమ్మ (47), పెద్ద నాగమ్మ (60) అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో నుంచి రోడ్డు మీద పడి తీవ్రగాయాలతో హాహాకారాలు, ఆర్తనాదాలు చేస్తున్న కూలీలను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనాల్లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్ననాగన్న (55), జయరాముడు (48), కొండమ్మ (50), ఈశ్వరయ్య మృతిచెందారు. లక్ష్మీదేవి, పెద్దులమ్మ, రామాంజినమ్మ, గంగాధర్, ఆటో డ్రైవర్ నీలకంఠ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో చిన్ననాగన్న–చిన్ననాగమ్మ, ఈశ్వరయ్య–కొండమ్మ దంపతులు.ఒకేరోజు ఎనిమిది మంది మృతిచెందడం, ఐదుగురు గాయపడడంతో ఎల్లుట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతపురం ప్రభుత్వాస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంపై గార్లదిన్నె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్, అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు.మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి:వైఎస్ జగన్అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం తలగాచిపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మరణించారు. వీరంతా కూలి పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.. వారికి అవసరమైన సాయం అందజేయాలని కోరారు. -
సమాజమా నువ్వెక్కడ?
అందరి గురించి ఆలోచించేవాడునలుగురికీ తల్లోనాలుకలా ఉండేవాడుఎవరికి ఏ జబ్బుచేసినా మందులిచ్చి నయం చేసేవాడుసాయమంటే ముందుండేవాడుఆయనకే కష్టం వస్తే...అయ్యోపాపం అనలేకపోయావాకాస్త ఆదరణచూపలేకపోయావా?జీవితంపై విరక్తి చెందితే ..ఊరడింపుగా నాలుగు మాటలు చెప్పలేకపోయావాకుటుంబంతో ఉరికంభమెక్కితే...అలా చూస్తూ ఊరుకున్నావాపసిగుడ్డు గొంతునులిమేసేంతగా మార్చేశావా..ఆయువు ఆగి ఐదురోజులైనా కన్నెత్తి చూడలేకపోయావాఇప్పుడంతా అయిపోయింది..ఆ మనిషి లేడు..ఆ కుటుంబమూ లేదునువ్వుండు.. నూరేళ్లునిర్దయగా...నిక్షేపంగా..అలా నువ్వున్నా..లేనట్టే!అందుకే అతను.. తన ఐదు నెలల ప్రతిరూపాన్ని వెంటతీసుకెళ్లాడు..నార్పలకు చెందిన కృష్ణకిశోర్, శిరీష దంపతులు ఉరి వేసుకుని చనిపోగా..ఐదురోజుల తర్వాత ఇరుగుపొరుగు గుర్తించారు. లోనికి వెళ్లి చూడగా..వారి ప్రేమకు ప్రతిరూపమైన ఐదు నెలల పసికందు ఊయలలో నిర్జీవంగా కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన మనసున్న మనిషెవరైనా ఇలాగే ప్రశ్నిస్తున్నాడు.. సమాజమా...నువ్వెక్కడా అని..అనంతపురం -
మద్యం మత్తు.. బంధాలు చిత్తు!
సీలేరు/రాయచోటి టౌన్: రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం.. బంధాలను బలి తీసుకుంటోంది. మద్యానికి బానిసైన కుమారుడిని... తండ్రి, మద్యం తాగొచ్చి తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని కుమారుడు హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ ఏనుగుబయలుకు చెందిన చెందిన కొర్రా సన్యాసి(30) మద్యం తాగి తండ్రితో, కుటుంబ సభ్యులతో రోజూ గొడవ పడుతున్నాడు. గురువారం రాత్రి కూడా మద్యం తాగి తండ్రి చిత్రోతో గొడవ పెట్టుకున్నాడు. అడ్డుకున్న కుటుంబ సభ్యులను తీవ్రంగా కొట్టాడు. కుమారుడి నుంచి తప్పించుకునేందుకు తండ్రి ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకుని అటవీ ప్రాంతానికి పారిపోయాడు. ఆయనను వెంబడిస్తూ కుమారుడు కూడా అడవిలోకి వెళ్లాడు. ఎక్కడ తన కుమారుడు తనను చంపుతాడోనన్న భయంతో గొడ్డలితో కుమారుడిని నరికి చంపేసి.. గొయ్యి తీసి పాతిపెట్టాడు. స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు అడవికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిర్వహించారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. తాగొచ్చి తల్లిని వేధిస్తున్నాడని.. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణ శివార్లలో నివాసముంటున్న వెంకట చలపతి(55) నిత్యం మద్యం తాగి భార్యను వేధించేవాడు. వారికి జీవన్ బాబు అనే 19 ఏళ్ల కుమారుడున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో మళ్లీ తాగొచ్చి తల్లిని వేధించడంతో ఆమె ఇంటి నుంచి పారిపోయింది. అప్పటికే కోపోద్రిక్తుడైన కుమారుడు అక్కడే ఉన్న క్రికెట్ బ్యాట్‌తో వెంకటచలపతి తలపై బలంగా కొట్టాడు. దీంతో అతడు తీవ్ర గాయాలతో నేలపై పడిపోవడంతో స్థానికులు రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. జీవన్ ఈ విషయాన్ని తన తల్లికి ఫోన్ ద్వారా సమాచారం అందించి అక్కడ నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఏయ్.. పవన్ చెప్పినా పనిచేయవా?’
కర్నూలు (సెంట్రల్): ‘ఏయ్.. మా పవన్ కల్యాణ్ చెప్పినా పనిచేయవా?’ అంటూ.. ఊగిపోతూ.. డీఎంహెచ్‌వో కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాసులుపై దాడికి దిగాడో జనసేన నేత. కర్నూలు జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ హర్షద్ గురువారం డీఎంహెచ్‌వోలో వీరంగం సృష్టించాడు . వివరాల్లోకి వెళితే.. 2012 నుంచి డీఎంహెచ్‌వో కార్యాలయంలో ప్రీతిబాయి తల్లి పార్వతి ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులో పనిచేస్తోంది. ఆమెకు జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి కోసం అధికారులను ఆశ్రయించింది. అందుకు సర్వీసు రూల్స్ లేవని చెప్పడంతో ఇటీవల ఆమె డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను ఆశ్రయించింది. ఆయన స్పందించి జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషాకు ఫోన్‌చేసి పార్వతికి పదోన్నతి కల్పించే అంశంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ అంశాన్ని కలెక్టర్ డీఆర్వో సి.వెంకటనారాయణమ్మకు అప్పగించారు. ఈ క్రమంలో గురువారం పార్వతితోపాటు డీఎంహెచ్‌వో కార్యాలయ ఏఓ అరుణ, సూపరింటెండెంట్ శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ సంపత్‌లను డీఆర్వో తన కార్యాలయానికి రావాలని ఆదేశించారు. ఇది పూర్తిగా ఉద్యోగుల సర్వీసు మ్యాటర్. అయితే పార్వతితోపాటు జనసేన నాయకుడు హర్షద్ కూడా వారి వెంట వెళారు. డీఎంహెచ్ఓ కార్యాలయానికి సంబంధించి కేవలం సూపరింటెండెంట్ శ్రీనివాసులు మాత్రమే రావడం, ఎలాంటి రికార్డులు లేకుండా ఉండటంపై జనసేన నాయకుడు ఆయనపై మండిపడ్డారు. డిప్యూటీ సీఎం చెప్పినా ఎందుకు పదోన్నతి ఇవ్వరని శ్రీనివాసులుపై దాడికి యత్నించాడు. అయితే అతను తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన స్వయంగా జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) సి.వెంకటనారాయణమ్మ ఎదుటే చోటుచేసుకుంది. అయితే పదోన్నతి ఇవ్వాలంటే డీఎంహెచ్‌వో ఏవో, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్లు లంచం అడిగారని పార్వతి ఆరోపిస్తుండగా.. మరోవైపు సర్వీసు రూల్స్ అందుకు అనుమతించడం లేదని అధికారులు చెబుతున్నారు. -
AP: బాలికపై గ్యాంగ్ రేప్
సాక్షి టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలో చింతకొమ్మదిన్నె మండలం సుగాలిబిడికి ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్‌నకు గురైంది. బాలిక ఇంటికి సమీపంలో ఓ యువకుడితో ఒంటరిగా మాట్లాడుతుండగా నిందితుల్లో ఒకరు సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఆ వీడియో బాలికకు చూపి ఉదయ్‌కిరణ్, మరో ఇద్దరు మైనర్లు కలిసి బాలికను లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగి దాదాపు నెల రోజులవుతోంది. నిందితులంతా కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల పిల్లలు కావడంతో ఈ దారుణం వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి మొదట బేరసారాలు మొదలెట్టారు. ఆ తర్వాత వారిని భయపెట్టే యత్నం చేశారు. ఎట్టకేలకు గురువారం బాధితురాలి తండ్రి కడపలోని ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, దిశ పోలీస్‌స్టేషన్ డీఎస్పీ రమాకాంత్లు సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. వెంటనే నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితులపై చింతకొమ్మదిన్నె సీఐ శంకర్‌నాయక్ పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారని సమాచారం రావడంతో ఆఘమేఘాల మీద టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీసు అధికారులతో మాట్లాడేందుకు, నిందితుల తరఫున బాధితులతో రాజీ కుదిర్చేందుకు రోజంతా విఫలయత్నం చేశారు.మహిళపై హత్యాచారం» తల నుజ్జునుజ్జు » వైఎస్సార్ జిల్లా, కాశినాయన మండలంలో దారుణం » చెన్నవరం–పాపిరెడ్డిపల్లె మధ్య ఘటన » కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులుకాశినాయన (కలసపాడు): ఓ మహిళపై హత్యాచారం ఘటన వైఎస్సార్ జిల్లా, కాశినాయన మండలం, కత్తెరగండ్ల గ్రామ సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. చాపాడు మండలం, ఖాదర్‌పల్లెకు చెందిన కరీమున్నీసా(32)–నజీర్ దంపతులు. కరీమున్నీసా ఎర్రచందనం వ్యవహారాల్లో సెటిల్మెంట్లు చేస్తుంటుంది. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ తిరుగుతూ ఉంటుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. నజీర్ ఎర్రచందనం కేసులో జైలులో ఉన్నాడు. బుధవారం రాత్రి కరీమున్నీసా చెన్నవరం–పాపిరెడ్డిపల్లె మధ్య అనూహ్యంగా దారుణహత్యకు గురైంది. ఆమెను గుర్తు పట్టకుండా ఎవరో ముఖంపై బండరాళ్లతో దారుణంగా మోది హత్య చేశారు. మహిళ మృతదేహం ఉన్నట్లు మేకలకాపరులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఆమెపై సామూహిక లైంగికదాడి జరిగినట్టు గుర్తించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, పోరుమామిళ్ల సీఐ శ్రీనివాసులు, కాశినాయన, పోరుమామిళ్ల ఎస్ఐలు హనుమంతు, కొండారెడ్డి, క్లూస్‌టీం అధికారులు గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. మహిళ తన స్వగ్రామం నుంచి ఫోన్ కాంటాక్ట్ ద్వారా ఘటనా స్థలానికి వచి్చనట్లు తెలిసిందని, ఈ దాషీ్టకాన్ని ఒకరు చేశారా లేక మరికొందరు కలిసి చేశారా అనేది విచారణలో తేలాల్సి ఉందని పేర్కొన్నారు. -
లా విద్యార్థినిపై దారుణం.. పోలీస్ కస్టడీకి నిందితులు?
సాక్షి, విశాఖపట్నం: లా విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దారుణానికి ఒడిగిట్టిన నలుగురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.బుధవారం దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీజ్ చేసిన వారి ఫోన్లను ఫోరెన్సిక్ కి పంపించారు. బాధితురాలి నగ్నంగా ఉన్న వీడియోలని ఎవరికి పంపించారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. దారుణ ఘటనలో ఏ2గా ఉన్న జగదీష్ తన ఫోన్లో ఉన్న బాధితురాలి నగ్న వీడియోల్ని రికార్డ్ చేసి ఏ1గా ఉన్న వంశీకి షేర్ చేశాడు. వంశీ ఏ3 ఆనంద్, ఏ4 రాజేష్‌కి పంపించాడు. అయితే, బాధితురాలి వీడియోలను ఈ నలుగురు ఇంకెవరికైనా పంపారా? అన్న కోణంలో ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ పరిశీలించిన అనంతరం రిపోర్ట్ ఇవ్వనుంది. -
విషాదం.. 5 నెలల చిన్నారిని చంపి.. దంపతుల ఆత్మహత్య
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గం నార్పలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐదు నెలల చిన్నారిని చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదు రోజుల కిందట తలుపులు వేసుకొని బలవన్మరణానికి దంపతులు పాల్పడ్డారు. దుర్వాసన రావటంతో స్థానికులతో తలుపులు బద్ధలు కొట్టించిన పోలీసులు.. మృతదేహాలను వెలికితీశారు.ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులు.. కృష్ణ కిషోర్ (45) శిరీష (35), చిన్నారి (5నెలలు)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై విచారణ చేపట్టారు. -
చిన్నారిపై లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
నెల్లూరు (లీగల్): నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మిక్కిలింపేట గ్రామానికి చెందిన బాలిక 2020 ఫిబ్రవరి 16వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంటిముందు ఆడుకుంటుండగా సమీపంలోని ఇంట్లో నివసించే ఉప్పు రవికుమార్ అనే యువకుడు బాలికను ఇంటికి తీసుకుపోయి లైంగిక దాడికి పాల్పడ్డాడు.బాలిక తల్లి అదేరోజు కొడవలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు రవికుమార్‌ను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో నెల్లూరు పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 20 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. -
గంజాయి సరఫరా చేస్తున్న ఫార్మసిస్ట్ అరెస్టు
ఆరిలోవ: విశాఖ కేంద్రకారాగారంలో ఖైదీలకు గంజాయి సరఫరా చేసే యత్నంలో ఓ ఉద్యోగి అధికారులకు చిక్కాడు. జైలు సిబ్బంది తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. జైలు సూపరింటెండెంట్ ఎస్.కిశోర్‌కుమార్ వివరాలు ప్రకారం.. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో కడియం శ్రీనివాస్ ఫార్మసిస్ట్‌గా ఏడాది నుంచి డిప్యుటేషన్‌పై విశాఖ కేంద్ర కారాగారం ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఈ జైలుకు సంబంధించి ప్రత్యేకంగా నియమించిన వైద్యులు, ఫార్మసిస్టులు లేకపోవడంతో డిప్యూటేషన్‌పై వచ్చినవారే పనిచేయాల్సి ఉంటుంది.శ్రీనివాస్ మంగళవారం డ్యూటీకి వచ్చేటప్పుడు భోజనం క్యారేజీ తీసుకొచ్చారు. అందులో గంజాయి ఉన్నట్లు జైలు ప్రధాన ద్వారంవద్ద సిబ్బంది తనిఖీల్లో బయటపడింది. ప్రధాన ద్వారం సెక్యూరిటీ సిబ్బంది జైలులో పనిచేస్తున్న ఉద్యోగుల రాకపోకల సమయంలో తనిఖీలు చేస్తుంటారు. దీన్లోభాగంగా చేపట్టిన తనిఖీల్లోనే శ్రీని వాస్ క్యారేజీలో 90 గ్రాముల గంజాయి పట్టుబడింది. దీంతో శ్రీనివాస్‌పై ఆరిలోవ పోలీసులకు సూపరింటెండెంట్ ఫిర్యాదు చేశారు. గంజాయి స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. రిమాండ్‌పై సెంట్రల్ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. -
ఏసీబీ వలలో ఉప ఖజానా అధికారిణి
ఉదయగిరి: ఉదయగిరి ఉపఖజానా అధికారిణి సీహెచ్ మమత మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఓ ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ శిరీష తెలిపిన సమాచారం మేరకు.. వరికుంటపాడు మండలం తూర్పుబోయమడుగుల గ్రామంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న లోకసాని వెంగయ్యకు సుమారు రూ.9 లక్షల వరకు పాత బిల్లులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఈ బిల్లులు మంజూరు చేయాలని వెంగయ్య ఉప ఖజానా అధికారిణి సీహెచ్ మమతను వారం రోజుల క్రితం కలిశారు. అందుకు పది శాతం లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సదరు ఉపాధ్యాయుడు అంత డబ్బు ఇవ్వలేక వెనుదిరిగాడు. తర్వాత అదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీహరిని సంప్రదించి రూ.40 వేలు లంచం ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేక ఆ ఉపాధ్యాయుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు మంగళవారం ఎస్టీఓకు లంచం ఇచ్చేందుకు కార్యాలయానికి వెళ్లి ఆమెను కలిసి రూ.40 వేలు తీసుకొచ్చానని చెప్పడంతో అదే కార్యాలయంలో పనిచేస్తున్న ప్రైవేట్ వ్యక్తి పవన్‌కు ఇవ్వాలని సూచించింది. దీంతో బాధితుడు కార్యాలయం కింద ఉన్న ప్రైవేట్ వ్యక్తి పవన్‌కు రూ.40 వేలు లంచం ఇచ్చాడు. అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్న ఏసీబీ అధికారుల బృందం పవన్‌ను అదుపులోకి తీసుకొని పైనున్న ఎస్టీఓ వద్దకు తీసుకెళ్లారు. ఎస్టీఓ సూచన మేరకే ఈ నగదు తీసుకున్నట్లు పవన్ ఏసీబీ అధికారులకు చెప్పడంతో ఆమెను అదుపులోకి తీసుకొని నగదుకు రసాయన పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎస్టీఓను, పవన్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు ఆంజనేయరెడ్డి, విజయకుమార్‌తోపాటు మరో పది మంది సిబ్బంది ఉన్నారు. మమత మూడేళ్ల క్రితం ఉదయగిరి ఉప ఖజానా అధికారిణిగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె సక్రమంగా విధులకు రావడం లేదని, ప్రతి చిన్న బిల్లుకు కూడా పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఐసీడీఎస్‌కు సంబంధించిన బిల్లుల విషయంలో కూడా లంచాలు డిమాండ్ చేసి సకాలంలో బిల్లులు పాస్ చేయలేదనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి.లంచం ఇవ్వడం ఇష్టం లేక పట్టించానునాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.8,92,710 పాత బిల్లులు పాస్ చేయాలని ఎస్టీఓను కోరాను. ఆమె పది శాతం లంచం అడిగారు. అంత ఇవ్వలేనని చెప్పినా ఒప్పుకోకపోవడంతో ఇదే కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ శ్రీహరి మధ్యవర్తిత్వం ద్వారా రూ.40 వేలకు ఒప్పందం చేసుకున్నాను. అయినా లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను సంప్రదించి వారి సూచనల మేరకు వ్యవహరించి లంచం నగదు ఇచ్చాను. -
విశాఖలో దారుణం.. లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైంది. విశాఖలో దారుణం జరిగింది. విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. న్యాయ విద్యార్థినిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని నగ్నంగా వీడియోలు తీసి నిందితులు బెదిరించారు.రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్షితో విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ, ఈ కేసులో బాధితురాలికి నిందితులలో ఒకరికి రెండు నెలల నుంచి పరిచయం ఉందని.. విచారణ జరుగుతుందని తెలిపారు. -
AP: రూ.100 కోసం హత్య
కర్నూలు (టౌన్): ఇద్దరూ కల్లు తాగారు. బొమ్మ–బొరుసు ఆడారు. రూ.వంద పోగొట్టుకున్న వ్యక్తి.. గెల్చిన యువకుడి తలపై బండరాయితో కొట్టి చంపేశాడు. ఈ విషాద సంఘటన కర్నూలులో సోమవారం జరిగింది. స్థానిక మమతానగర్‌కు చెందిన కృపానందం అలియాస్ ఆనంద్ (27) వృత్తిరీత్యా గౌండా (తాపీ) పని చేస్తున్నాడు. తల్లి, నలుగురు సోదరులు ఉన్న అతడు రోజూ కల్లు తాగేవాడు.స్థానిక రోజావీధికి చెందిన అజీజ్ అతడికి పరిచయమయ్యాడు. సోమవారం ఇద్దరూ కల్లు తాగిన తర్వాత సంకల్‌బాగ్‌లోని ఓ స్కూల్ వద్ద బొమ్మ–బొరుసు ఆట ఆడారు. ఈ ఆటలో కృపానందం రూ.100 గెల్చున్నాడు. ఈ విషయంపై ఇద్దరు గొడవ పడ్డారు. తన డబ్బులు ఇచ్చేయాలంటూ అజీజ్ రాయితో కృపానందం తలపై కొట్టాడు. దీంతో కృపానందం అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
న్యాయం కోసం చంద్రబాబు దగ్గరికి వస్తే..
తిరుపతి రూరల్: అయ్యా.. నా పరిశ్రమను నాశనం చేశారని, నాపై దౌర్జన్యం చేసి జాకెట్‌ను సైతం చించేశారు, పోలీసులు కూడా నాపై దాడిచేసిన వారికే వత్తాసు పలుకుతున్నారు, ముఖ్యమంత్రిగారికి నా బాధ చెప్పుకుంటానయ్యా.. అంటూ వచ్చింది ఓ మహిళ. అయితే ఆయన వ్యక్తిగత పర్యటన మీద వచ్చారని, ఎవరినీ కలవరంటూ ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతి జిల్లాలో చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో జరిగిందీ ఘటన. .. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన యశోద కుటుంబంతో కలిసి తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ పరిధిలో రాజేశ్వరరావు, సరోజినిదేవి దంపతుల నుంచి కొంతభూమి అద్దెకు తీసుకున్నారు. దాదాపు రూ.కోటి ఖర్చుతో ఎల్వీ పవర్‌లూమ్స్, హ్యాండ్లూమ్స్ పరిశ్రమను ఏర్పాటు చేశారు. హాథీరాంజీ మఠానికి చెందిన ఈ భూమి వివాదంలో ఉంది. ఈ భూమికి తామే యాజమానులమని, అద్దె తమకే చెల్లించాలని పలువురు బెదిరిస్తుండటంతో ఆమె కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. కోర్టు స్టే ఉన్నా రాజేశ్వరరావు, మరికొందరు కలిసి హ్యాండ్లూమ్స్ను ఖాళీచేయాలని దౌర్జన్యం చేస్తున్నారు. రూ.50 లక్షల విలువైన యంత్రాలను నాశనం చేశారు. కోర్టు స్టే ఉన్నా సామగ్రి ఎత్తుకెళ్లి ఆమెపై దాడిచేశారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు వచి్చన తనను తిరుపతి జిల్లా పోలీసులు అడ్డుకోవడమే కాకుండా దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం యశోద.. నారావారిపల్లికి వచ్చి సీఎం చంద్రబాబును కలవడానికి ప్రయత్నించింది. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఏడుస్తూ.. ఆమె రోడ్డుపై బైఠాయించారు. సీఎం తనకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. చేతి గాజులు పగులుగొట్టుకుని వాటిని మింగేందుకు ప్రయత్నించారు. ఆమెను ఆపి బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు.మీడియాపైనా దౌర్జన్యం..ఈ ఘటనను ఫొటోలు, వీడియోలు తీస్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ఫోన్లు, కెమెరాలను లాక్కుని ఫొటోలు, వీడియోలను డిలీట్ చేశారు. దీనిపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అనంతపురం: బీజేపీ కార్యకర్త దారుణ హత్య
సాక్షి, అనంతపురం జిల్లా: రాయదుర్గం నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తను టీడీపీ కార్యకర్త హత్య చేశాడు. బొమ్మనహాల్ మండలం చంద్రగిరిలో ఘటన జరిగింది. ఇంట్లో భోజనం చేస్తున్న కృష్ణమూర్తి శెట్టి (50) పై వేటకొడళ్లతో దాడి చేశాడు.స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త కృష్ణమూర్తి శెట్టి చెల్లెలు పుష్పావతితో కలిసి ఉండేవాడు. రాత్రి ఆయన ఇంట్లో చెల్లెలితో కలిసి భోజనం చేస్తుండగా టీడీపీ కార్యకర్త వేటకొడవలితో చెయ్యి, వీపు, తలపై దాడి చేశాడు. తీవ్రగాయాల పాలైన అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించి చెల్లెలు భయంతో బయటకు వచ్చి కేకలు వేసింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునేలోపు ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు.కొన ఊపిరితో ఉన్న క్రిష్ణమూర్తి శెట్టిని 108లో బళ్లారి విమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బొమ్మనహాళ్ పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా మండలంలోని కురువల్లికి చెందిన ఓ వ్యక్తితో భూమి తగాదాలతోనే ఈ హత్యాయత్నం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. -
మాటలకందని విషాదం.. కొన్ని గంటల్లో నిశ్చితార్థం.. అంతలోనే..
తాడిపత్రి రూరల్: నిశ్చితార్థం కోసం గోరింటాకు పెట్టించుకుని సోదరునితో కలిసి ద్విచక్రవాహనంపై వస్తున్న యువతిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. తాడిపత్రి అప్‌గ్రేడ్ రూరల్ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెంకటరెడ్డిపల్లికి చెందిన వీణాదేవి(24)కి ఆదివారం వివాహ నిశితార్థం జరగాల్సి ఉంది.ఇందు కోసం శనివారం సోదరుడు నారాయణరెడ్డితో కలిసి బైక్‌పై తాడిపత్రికి వెళ్లి చేతికి గోరింటాకు పెట్టించుకుంది. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా వీరి బైక్‌ను బుగ్గ నుంచి తాడిపత్రి వైపు వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో వీణాదేవి అక్కడికక్కడే చనిపోయింది.తీవ్రంగా గాయపడిన తమ్ముడు నారాయణరెడ్డికి తాడిపత్రిలో ప్రథమ చికిత్స చేసి, అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరి కొన్ని గంటల్లో నిశితార్థం జరుగుతుందన్న అనందంలో ఉన్న వీణాదేవి ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను, గ్రామస్తులను కలచివేసింది. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
టీడీపీ నేత కారు బీభత్సం
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు.. మైలవరం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కొడుకు.. టీడీపీ నేత ఉయ్యూరు వెంకటరమణ శనివారం బెజవాడలో బీభత్సం సృష్టించాడు. అతివేగంతో కారును నడిపి రోడ్డు వెంబడి ఉన్న దుకాణాలు.. తోపుడు బండ్లపైకి దూసుకెళ్లి ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ నందమూరినగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. వివరాలివీ..మద్యం మత్తులో.. మహిళతో కారు నడిపిస్తూ?మైలవరం నియోజకవర్గం జి.కొండూరు ప్రాంతానికి చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్ ఉయ్యూరు నరసింహారావు కొడుకు వెంకటరమణ తన ఏపీ 16 ఈఎఫ్ 4979 కారులో విజయవాడ నుంచి తన ఇంటికి శనివారం మధ్యాహ్నం బయల్దేరాడు. సింగ్‌నగర్ ఫ్లైఓవర్ దిగి నందమూరినగర్ సాయిబాబా గుడి దాటిన తరువాత కారు వేగాన్ని పెంచి వెళ్తుండగా ఒక్కసారిగా కారు అదుపుతప్పి రోడ్డు వెంబడి ఉన్న బడ్డీకొట్టును ఢీకొని ఆ పక్కనే ఉన్న తోపుడు బండ్ల వైపు దూసుకువెళ్లి 20 అడుగుల ఎత్తుకు ఎగిరి చివరకు స్తంభాన్ని ఢీకొని ఆగింది. ఈ ఘటనలో అక్కడే తోపుడు బండిపై శనక్కాయలు అమ్ముకుంటున్న నందమూరినగర్ తోటవారి వీధికి చెందిన పీకా కోటేశ్వరరావు (49) అనే చిరువ్యాపారి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కారును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారు నడిపింది ఓ మహిళ అని, పోలీసులు వచ్చేసరికి ఆమెను తప్పించి వెంకటరమణను చూపుతున్నారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.నిందితులను చూస్తుంటే వారు మద్యం సేవించినట్లుగా ఉన్నారని.. అతివేగంతో ఆ మహిళ కారును నడపడంవల్లే ఈ ఘటన జరిగిందని వారు చెబుతున్నారు. ఇక నిందితులకు కూడా స్వల్ప గాయాలయ్యాయని.. చికిత్స నిమిత్తం వారినీ ప్రభుత్వాస్పత్రికి పంపామని సింగ్‌నగర్ సీఐ బీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. బాధితులు ఇంకా ఫిర్యాదు ఇవ్వలేదని, కారు నడిపింది మహిళ కాదు తానే అని నిందితుడు వెంకటరమణ చెబుతున్నాడని ఆయన చెప్పారు. అయితే కారు ఎవరు నడిపారు.. ప్రమాదం ఎలా జరిగిందనే అంశాలకు సంబంధించి సంఘటనా స్థలంలో సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని.. అవి వచ్చాక పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. నిందితుడిపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది. మరోవైపు.. నిందితుడు వెంకటరమణను తప్పించేందుకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. -
బాలికలపై ఆగని అత్యాచారాలు
చాగలమర్రి/నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వ పాలనలో.. రాష్ట్రంలో అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలాంటి అత్యాచారం వార్త వినాల్సి వస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లాలో ఒక పాఠశాలలో ఐదేళ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు అత్యాచార యత్నం చేయగా, నెల్లూరులో పదేళ్ల బాలికపై యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. నిందితులపై పోక్సో కేసులు నమోదు చేశారు. ఈ దారుణం గురించి తెలిసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల కరస్పాండెంట్‌పైనా కేసు నమోదైంది.నంద్యాల జిల్లాలో మండల కేంద్రం చాగలమర్రిలోని శ్రీరాఘవేంద్ర ఉన్నత పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఐదేళ్ల బాలికపై అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు లైంగికదాడికి యత్నించారు. మూత్ర విసర్జనకు టాయిలెట్‌కు వెళ్లిన చిన్నారిపై వారు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన బయటకు పొక్కకుండా పాఠశాల యాజమాన్యం దాచిపెట్టింది. చిన్నారి తల్లిదండ్రులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 12వ తేదీ సాయంత్రం బడి నుంచి ఇంటికెళ్లిన చిన్నారికి జ్వరం వచ్చింది.పొత్తి కడుపులో నొప్పిగా ఉందని ఏడవడంతో తల్లిదండ్రులు స్థానిక కేరళ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యురాలు బాలికపై లైంగికదాడియత్నం జరిగినట్లు చెప్పారు. దీంతో బాలికను మెరుగైన చికిత్స కోసం వైఎస్పార్ జిల్లా ప్రొద్దుటూరులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా కేసు నమోదు చేయాలని సూచించారు. భయపడిన తల్లిదండ్రులు అక్కడి నుంచి కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా విషయం తెలిపి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.దీంతో తల్లిదండ్రులు వెంటనే చాగలమర్రికి వెళ్లి పాఠశాల కరస్పాండెంట్‌ను ప్రశ్నించగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో బాధితులు బంధువుల సహాయంతో నంద్యాల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ విచారణ చేయాలని ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్‌ను ఆదేశించారు. డీఎస్పీ రవికుమార్ శనివారం ఎస్ఐ రమేష్‌రెడ్డి, సిబ్బందితో కలిసి శ్రీరాఘవేంద్ర పాఠశాలకు వెళ్లి సిబ్బందిని విచారించారు. అనంతరం పోలీసు స్టేషన్లో బాధిత చిన్నారి కుటుంబసభ్యులను విచారించి, వారి ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులపై పోక్సో కేసు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల కరస్పాండెంట్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలికను మాయచేసి అత్యాచారంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో పదో తరగతి బాలిక (16)కు మాయమాటలు చెప్పి ఒక యువకుడు అత్యాచారం చేశాడు. నెల్లూరు రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. మెడికవర్ హాస్పిటల్ వెనుక పాతమెట్టపాళెంలో ఉండే బాలిక స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. అదే ప్రాంతానికి చెందిన పెంచలయ్య (23) బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని నెలలుగా తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలికకు మాయమాటలు చెబుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన బాలికను మాయచేసి లొంగదీసుకుని అత్యాచారం చేశాడు. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు శనివారం నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పొక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.