దుర్గ గుడి గోశాలలో ఫుడ్ పాయిజన్
విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి చెందిన గోశాలలో బుధవారం ఫుడ్ పాయిజన్ అయింది. బుధవారం ఉదయం సిబ్బంది పెట్టిన గోధుమరవ్వ తిని 5 ఆవులు మృతిచెందాయి. మరో 20 ఆవులు అస్వస్థతకు గురైయ్యాయి. ఆహారం విషతుల్యం కావడం వల్లే మృతి చెందినట్టు సమాచారం. ఇంద్రకీలాద్రి కొండదిగువన అర్జున వీధిలో ఉండే గోశాలలో సుమారు 500 వరకు ఆవులు సంరక్షింపబడుతున్నాయి. సాధారణంగా గోశాలను సందర్శించే భక్తులు వాటికి అన్నం, ఇతరత్రా ఆహారం పెడుతుంటారు.
అలాగే, మంగళవారం సాయంత్రం వైష్ణవి ఫుడ్స్ చెందిన ప్రతినిధులు గోధుమరవ్వ ఇచ్చి వెళ్లగా... దాన్ని బుధవారం ఉదయం గోవులకు పెట్టినట్టు తెలుస్తోంది. కాలం చెల్లిన ఆహారం తినడం వల్లనే గోవులు మృతిచెందినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆవుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, గోవుల మృతిపై గోశాల సంరక్షణ కమిటీ విచారణ ప్రారంభించింది.