ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈ
పిడుగురాళ్ళరూరల్ : బిల్లు కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనంటూ కాంట్రాక్టర్‌ను డబ్బు డిమాండ్ చేసిన పంచాయతీరాజ్ ఏఈ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన శుక్రవారం పిడుగురాళ్లలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ రాజారావు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్ల మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఏఈగా డి.వీరాంజనేయులు విధులు నిర్వహిస్తున్నాడు. రెండేళ్ల కిందట మండలంలోని కరాలపాడు గ్రామ సర్పంచి ముడేల అంబిరెడ్డి హయాంలో ఉపాధి హామీ పథకం కింద గ్రామాభివృద్ధి కోసం రూ.90 లక్షల నిధులను మంజూరయ్యాయి.
ఆ పనులను సర్పంచి కుమారుడు వెంకటేశ్వరరెడ్డి నిర్వహిస్తున్నాడు. ఏఈ నిర్లక్ష్యం వల్ల పనులు త్వరగా పూర్తి కాకపోవడంతో మంజూరైన పనులు రద్దయ్యాయి. రూ.25 లక్షల విలువైన మూడు పనులు మాత్రమే చేయగా రూ.65 లక్షలు నిధులు వెనక్కి వెళ్లాయి. పూర్తయిన పనులకు సంబంధించి ఇంకా రూ.3.2 లక్షల బిల్లులు కాలేదు. వీటిని త్వరగా చేయమని వెంకటేశ్వరరెడ్డి కోరగా ఏఈ లంచం డిమాండ్ చేశాడు. రూ.25వేలు ఇస్తేనే పనులు పూర్తిచేస్తానని పట్టుబట్టాడు.
తాను అంత మొత్తం చెల్లించలేనని, రూ.15 వేలు ఇస్తానని వెంకటేశ్వరరెడ్డి చెప్పడంతో ఏఈ అంగీకరించాడు. లంచం ఇవ్వడానికి ఇష్టపడని వెంకటేశ్వరరెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో నిఘాపెట్టిన ఏసీబీ అధికారులు బాధితుడు తెలిపిన వివరాలు నిజమేనని నిర్ధారించుకున్నారు. శుక్రవారం తన కార్యాలయంలో రూ.15 వేలు లంచం తీసుకుంటున్న ఏఈని అరెస్టు చేశారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు డీఎస్పీ వివరించారు. ఆయన వెంట ఇన్‌స్పెక్టర్లు శివరామ్, నరసింహారెడ్డి, సిబ్బంది ఉన్నారు.