సాక్షి, గుంటూరు: ఓట్ల పండుగను పురస్కరించుకుని మందుబాబులు కైపులో మునిగి తేలారు. సార్వత్రిక ఎన్నికల్లో డబ్బే కాదు, మద్యం కూడా ఏరులై పారింది. అధికారుల కళ్లు గప్పి టీడీపీ నాయకులు నాటు సారా, మద్యం సరఫరా చేశారు. ఎన్నికల కోడ్‌కు నెల రోజుల ముందు నుంచే మద్యం డంప్ చేసుకోవడంలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. దీంతో సాధారణ రోజుల్లోకన్నా ఎన్నికల సమయంలో మద్యం విక్రయాలు పెరిగాయి. జిల్లాలో 185 బార్లు, 352 వైన్ షాపులు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు రూ. 3–4 కోట్లకుపైగా నెలకు రూ. 125 కోట్ల నుంచి రూ.130 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. ఎన్నికల సందర్భంగా ఈ వ్యాపారం మరింత పెరిగింది. మార్చి 11న ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఏప్రిల్ 11 పోలింగ్ సమయానికి జిల్లాలోని మద్యం, బార్ షాప్‌ల ద్వారా రూ.186 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. నెల రోజుల వ్యవధిలో 3,34,956 బాక్సుల లిక్కర్, 2,27,258 కేసుల బీర్లు విక్రయించారు.
రూ.26 కోట్లు అదనం..
గత ఏడాది మార్చి 11 నుంచి ఏప్రిల్ 11 మధ్య రూ.160 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అదే సమయంలో గత ఏడాది కన్నా రూ. 26 కోట్లు అదనంగా బిజినెస్ జరిగింది. ఎన్నికల షెడ్యూల్‌కు 10 రోజుల ముందు బిజినెస్‌తో కలుపుకుంటే విక్రయాలు రూ.200 కోట్ల వరకూ జరిగి ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. చాలా మంది టీడీపీ నాయకులు ఎన్నికల షెడ్యూల్‌కు ముందే మందు కొనుగోలు చేసి డంప్ చేసుకున్నారు. అధికారిక లెక్కలు కాకుండా గ్రామాల్లో బెల్టు షాప్‌ల ద్వారా అనధికారిక మద్యం విక్రయాలు సైతం ఎన్నికల సమయంలో భారీగా పెరిగాయి. టీడీపీకి చెందిన బెల్టు షాప్‌ల నిర్వాహకులు ఎన్నికల కోడ్‌కు ముందే కర్ణాటక, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల నుంచి అనధికారిక మద్యాన్ని భారీగా జిల్లాకు తరలించారు. అనధికారిక మద్యం విక్రయాలు, నాటుసారా అన్ని కలుపుకుంటే సార్వత్రిక ఎన్నికల సమయంలో రూ.200 కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగినట్టు తెలుస్తోంది.
మామూళ్ల మత్తులో..
ఎన్నికల సమయంలో అబ్కారీ శాఖ అధికారులు సైతం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 2,313 తనఖీలు చేపట్టిన అధికారులు 621 మందిని అదుపులోకి తీసుకుని 677 కేసులు నమోదు చేశారు. 128 వాహనాలను సీజ్ చేశారు. అబ్కారీ శాఖలో సైతం కొందరు అధికారులు టీడీపీ నాయకులకు సహకరిస్తూ తనిఖీలకు సంబంధించిన సమాచారం ముందస్తుగా టీడీపీ నాయకులకు చేరవేసి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. బాపట్ల, రేపల్లె, పల్నాడు సహా వివిధ ప్రాంతాల్లో టీడీపీ నాయకులు యథేచ్ఛగా నాటుసారా తయారీ, విక్రయాలు, బెల్టు షాప్‌లు నిర్వహిస్తున్న కొందరు ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ చూసీచూడనటుల వదిలేశారనే విమర్శలు ఉన్నాయి.
నిబంధనలకు నీళ్లు..
సాధారణ రోజుల్లోనే మద్యం వ్యాపారులు నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. ఇక ఎన్నికల సీజన్ కావడంతో మద్యం దుకాణాలు, బార్‌లు తెరిచి ఉంచే వేళలతో సంబంధం లేకుండా రేయింబవళ్లు అమ్మకాలు కొనసాగించారు. గుంటూరు, తెనాలి, నరసరావుపేట, రేపల్లే, బాపట్ల సహా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బార్, వైన్ షాపులు మూసిన అనంతరంకూడా సమీపంలోని గొలుసు దుకాణాల్లో మద్యం విక్రయాలు కొనసాగాయి. పలు ప్రాంతాల్లో మద్యం వ్యాపారులు బీర్లకు అధిక డిమాండ్ ఉండటంతో కృత్రిమ కొరత సృష్టించి ఎమ్మార్పీ అదనంగా రూ. 20– రూ.30 ఎక్కువకి బీరు బాటిల్ అమ్మకాలు జరిపినట్టు తెలుస్తోంది. లిక్కర్ అమ్మకాల్లో సైతం మద్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా ఎమ్మార్పీ ఉల్లంఘించారు.
Comments
Please login to add a commentAdd a comment