మద్యం జోరు... ఆరోగ్యం బేజారు..! | Alcohol Saled in Hotels And Public Places Vizianagaram | Sakshi
Sakshi News home page

మద్యం జోరు... ఆరోగ్యం బేజారు..!

Published Fri, Feb 8 2019 8:31 AM | Last Updated on Fri, Feb 8 2019 8:31 AM

Alcohol Saled in Hotels And Public Places Vizianagaram - Sakshi

బొబ్బిలిలోని దాబాల్లో ఏ హట్‌ చూసినా ఇదే పరిస్థితి

పండగా లేదు.. పబ్బం లేదు.. నిత్యం జిల్లాలో మద్యం వరద ప్రవహిస్తోంది. నెలకుసర్కారుకు రూ.60 కోట్లు కాసులు కూడబెడుతోంది. లైసెన్స్‌ దుకాణాలతో పాటుబెల్టుషాపులు, పాన్‌షాపులు, దాబాలు, చివరకు చిన్న బడ్డీకొట్టుల్లో సైతం మద్యంఅమ్మకాలు జోరందుకున్నాయి. తెల్లారక ముందే ఆరంభమైన విక్రయాలు అర్ధరాత్రివరకూ సాగుతూనే ఉన్నా అధికారుల్లో చలనం లేదు. బెల్టుషాపులునిషేధిస్తామంటూ తొలి సంతకం చేసిన పెద్దమనిషి పట్టించుకోరు. మద్యాన్ని ఏరులై పారిస్తూ పల్లెల్లో అలజడులకుకారణమవుతున్నారు. పల్లె, పట్టణ ప్రజల ఆరోగ్యాన్నిచిత్తుచేస్తున్నారు. ఆస్పత్రిపాల చేస్తూ పరోక్షంగా ఆర్థిక కష్టాల్లోకినెట్టేస్తుండడంపై మహిళలు  గగ్గోలు పెడుతున్నారు. ఎక్సైజ్‌శాఖఅధికారులు నిర్వహించే ‘నవోదయం’ కూడా మందోదయంగామారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

విజయనగరం , బొబ్బిలి: జిల్లాలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. తాగునీరు సరఫరాకు మించిపోయేంతగా మద్యం సరఫరా జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం మద్యం అమ్మకాలు పెరిగేలా లక్ష్యాలు నిర్దేశిస్తోంది. ప్రజలతో మరింత ఎక్కువ మద్యం తాగించాలంటూ పరోక్షంగా సూచిస్తోంది. దీంతో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా దాబాలు,బెల్టు, కిరాణా దుకాణాల్లో సాగుతున్నా అధికారులు తామేమీ చేయలేమన్నట్టుగా చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. దీంతో ఎక్సైజ్‌ అధికారులు తమకు తాము నిర్వహిద్దామనుకున్న నవోదయం అనే బృహత్తర కార్యక్రమం కాస్త మసకబారింది. సర్కారుకు కాసులు కురిపిస్తున్న మద్యం అమ్మకాలు జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

ఇదీ లెక్క...
జిల్లా వ్యాప్తంగా 210 మద్యం దుకాణాలు ఉన్నాయి. మరో 28 బార్లున్నాయి. వీటి నుంచి  ప్రతీనెలా సుమారు రూ.60 కోట్ల మద్యం వ్యాపారం జరుగుతోంది. ప్రతీ రోజూ రూ.2 నుంచి 4 కోట్ల మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఏ పల్లె, పట్టణానికి వెళ్లినా, ఏ వీధిలోకి వెళ్లినా మద్యం దొరకదన్న చింత లేకపోవడం గమనార్హం. అందుబాటులో మద్యం దొరుకుతుండడంతో యువత, పెద్దలు బానిసలవుతున్నారు. కుటుంబాలను ఛిద్రం చేసుకుంటున్నారు.

‘సారా’ మామూలే...
గతంలో ఏజెన్సీ పరిధిలో మాత్రమే కనిపించే సారా ప్యాకెట్ల విక్రయాలు ఇప్పుడు పట్టణ పరిధిలోకి కూడా విచ్చలవిడిగా వచ్చాయి. ఈ సంస్కృతి బొబ్బిలి వంటి అభివృద్ధి చెందుతున్న పట్టణానికి పాకడంతో ఇక్కడి సాంస్కృతిక, స్వచ్ఛంద, యువజన సంఘాలు, సంస్థలు, కవులు, వంటి వారు ఆవేదన చెందుతున్నారు. ఎక్కడికి పోతోందీ సంస్కృతంటూ విమర్శిస్తున్నారు. బొబ్బిలిలోని సంఘం వీధి తదితర ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు అడుగుల దూరంలో విక్రయాలు జరుగుతున్నాయి. వీటిపై పోలీసులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. కానీ పరిస్థితిలో ఇసుమంత మార్పు కూడా లేదు. మండల శివారులోని నారాయణప్ప వలస తదితర గ్రామాల మధ్యలో పొలాల్లో, రోడ్ల పక్కన తాగిన ఖాళీ సారా ప్యాకెట్లు విరివిగా పడేస్తుండటంతో ఇవి భూమిలో కలవవంటూ రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు.

పెరుగుతున్న నిల్వలు...
మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుండడంతో దాబాలు, బెల్టుదుకాణాల్లో మద్యం నిల్వలు పెరుగుతున్నాయి. బొబ్బిలిలో ఏ రోజుకారోజు మద్యం నిల్వలు తెచ్చుకునే స్థాయి నుంచి కొన్ని రోజులకు సరిపడా నిల్వ చేసుకుంటున్నారు. వీరికి కూడా మద్యం వ్యాపారులు ఎంతగానో సహకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 45కు పైగా దాబాలుండగా వీటిలో జోరుగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అయితే, అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు ప్రజానీకం నుంచి వినపడుతున్నాయి. బొబ్బిలి, గజపతినగరం, కొత్తవలస, చీపురుపల్లి, గరివిడి, నెల్లిమర్ల, ఎస్‌.కోట, సాలూరు, రామభద్రపురం, బొబ్బిలి, పార్వతీపురం ప్రాంతాల్లో దాబాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఉన్న అధిక శాతం దాబాల్లో మద్యం దొరుకుతోంది.

ఎమ్మార్పీని మించి ధరలు..
దాబాల్లో మద్యం విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నా అక్కడ ఎమ్మార్పీ ధరలకు విక్రయిస్తున్నారంటే పొరపాటే!. ఒక్కో బాటిల్‌ పైనా రూ.10 నుంచి ఇరవై రూపాయల ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఈ దాబాల్లో భోజనంతో పాటు మద్యం కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో మద్యం ప్రియులు వెళ్తున్నారు. వీరిని ఆకట్టుకునేందుకు దాబాల యజమానులు కూడా తమ వంతు ప్రయత్నాలు చేయడం విశేషం. ఇది నిత్య కృత్యమైపోయింది.

స్థానికంగానే వ్యాపారం....
జిల్లాలోని దాబాల్లో గతంలో ఉన్న పరిస్థితికి భిన్నంగా ఉంది. గతంలో దాబాలంటే పలు రాష్ట్రాల మధ్య ప్రయాణించే లారీ కార్మికులు, సుదూర ప్రయాణం చేసే వారు మాత్రమే వినియోగదారులుగా ఉండే వారు. ఇప్పుడు మద్యం విక్రయాలు ఎప్పుడయితే ప్రారంభమయ్యాయో మద్యం ప్రియులు నేరుగా దాబాలకే వెళ్తున్నారు. దీంతో మోటారు కార్మికులే కాకుండా స్థానికంగా కూడా ఈ వ్యాపారాలు ఎక్కువయ్యాయి. గతంలో ఆయా పట్టణాల్లో ఒకటీ అరా ఉండే ఈ దాబాలు ఇప్పుడు వ్యాపారం బాగుండటంతో విరివిగా వెలుస్తున్నాయి. కొన్ని దాబాల్లో కేవలం మద్యం విక్రయాలతోనే పబ్బం గడుపుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.

అమలు కాని కమిషనర్‌ ఆదేశాలు...
మద్యం బ్రాండ్లను మార్చే వారు, నీటితో కలిపేషాపులపై కేసులు పెట్టొద్దని, నేరుగా లైసెన్స్‌ రద్దు చేసి షాపును సీజ్‌ చేయాలనే ఎక్సైజ్‌ కమిషనర్‌ ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. డైల్యూషన్స్, బ్రాండ్‌ మిక్సింగ్‌ యథావిధిగా జరిగిపోతున్నా లక్ష్యాల ఒత్తిడిలో వాటిని పక్కన పెట్టేశారు. నేరుగా ఆ షాపును సీజ్‌ చేయడం, లైసెన్స్‌ను రద్దు పరచడం మాత్రమే చేయాలని చెప్పడంతో గతంలో  మద్యం దుకాణ దారులు కాస్త సంకోచించినా ఇప్పుడు మామూలయిపోయింది.        

స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తాం
గతంలో కొన్ని కేసులు నమోదు చేశాం. ఇప్పుడు మళ్లీ కొత్తగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తాం. అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేసి మద్యం విచ్చలవిడి సరఫరాను అణచివేస్తాం. ప్రత్యేకించి వారం రోజుల పాటు డ్రైవ్‌ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం. –  కరణం సురేష్,ఎక్సైజ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్, బొబ్బిలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement