సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం ఫలితాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరానికి సంబంధించి మొత్తం 4.42 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. వీరిలో లక్షకు పైగా విద్యార్థులు బెటర్‌మెంట్ కోసం రాశారని పేర్కొన్నారు. రెగ్యులర్ పరీక్షల్లో తప్పిన విద్యార్థులు.. విద్యా సంవత్సరం కోల్పోకూడదనే ఉద్దేశంతోనే సెప్టెంబరులో కాకుండా..మేలో పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. 22 రోజుల్లోనే సప్లిమెంటరీ పరీక్ష నిర్వహణ, ఫలితాల విడుదలకు అధికారులు బాగా కృషి చేశారని ప్రశంసించారు.
ఈ యేడాది 76 శాతం పాస్
‘మొదటి సంవత్సరం విభాగంలో.. మార్చిలో అరవై శాతం మంది పాస్ కాగా, సప్లిమెంటరీలో 11 శాతం కలుపుకుని మొత్తం ఈ యేడాది 76 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. సెకండ్ ఇంటర్ రెగ్యులర్‌లో 72 శాతం పాస్ కాగా, సప్లిమెంటరీలో 15 శాతం పాస్ అయ్యారు. మొత్తంగా 87శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఒకేషనల్‌లో మొత్తంగా తొలి యేడాది 65 శాతం, రెండో సంవత్సరం 81 శాతం పాసయ్యారు అని మంత్రి తెలిపారు.రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కావాలనుకునే వారు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 22 అని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment