బతుకుతాడని కొడుకు మృతదేహానికి పూజలు
కర్నూలు: ఆధునిక సమాజంలోకి మానువుడు అడుగుపెట్టిన రోజులివి. అటు సాంకేతికపరంగా, ఇటు సంస్కృతిపరంగానూ ఎంతో అభివృద్ధి చెందిన హైటెక్ యుగమిది. మంత్రాలకు చింతకాయలు రాలవన్నది మన తెలుగు సామెతను సరిగ్గా పోలే వింత సంఘటన కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో శనివారం చోటుచేసుకుంది.
జిల్లాలో పాముకాటుకు గురైన ఓ బాలుడు మృతి చెందాడు. అయితే పూజలు చేస్తే ఆ బాలుడు బతుకుతాడని ఓ స్వామిజీ చెప్పటంతో తల్లిదండ్రులు బాలుడి మృతదేహానికి పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా తన కొడుకు బతుకుతాడనే నమ్మకంతో మంత్రాలయంలోని గర్భగుడిలో తల్లిదండ్రులు పూజలు జరిపించడం విశేషం.
వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన నారాయణ, అర్చనల ఏకైక కుమారుడు శ్రీదత్త (4). తల్లితో కలిసి శుక్రవారం ఉదయాన్నే స్వామి దర్శనానికి వెళ్లాడు. బృందావనాన్ని దర్శించుకుంటుండగా ఓ పాము బాలుడి ఎడమ చేతిపై కాటు వేసింది. ఒక్కసారిగా అరుపులు, కేకలతో భక్తులు పరుగులు తీశారు.
బాలుడిని వెంటనే కల్లుదేవకుంట ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. అయితే బాలుడికి పూజలు చేస్తే బతుకుతాడని ఓ స్వామిజీ చెప్పటంతో వారు కుమారుడికి అంత్యక్రియలు చేసే ఆలోచన మానుకుని శ్రీమఠం గర్భగుడిలో పూజలు నిర్వహించారు.