బ్రాహ్మణులకు రుణాలు అందడం లేదు
► బ్రాహ్మణ సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు జోలాపురం శ్రీకాంత్ శర్మ
► మాట్లాడుతున్న బ్రాహ్మణ సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు జోలాపురం శ్రీకాంత్ శర్మ
గుత్తి: ప్రభుత్వం ప్రవేశ పెట్టిన చాణక్య పథకం ద్వారా పేద బ్రాహ్మణులకు ఎవరికీ కూడా బ్యాంకు రుణం అందడం లేదని బ్రాహ్మణ సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు జోలాపురం శ్రీకాంత్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక తాడిపత్రి రోడ్డులోని శ్రీసాయి జూనియర్ కాలేజ్ ఆవరణలో ఆదివారం సాయంత్రం గుత్తి, పామిడి, పెద్దవడుగూరు మండలాల బ్రాహ్మణ సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి గుత్తి మండల బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శివరామ్ శర్మ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ చాణక్య పథకం కాస్త పక్కదారి పట్టిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు వేల మంది బ్రాహ్మణులు ఈ పథకం కింద రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇందులో నిబంధనల కారణంగా ధనికులే లబ్ధి పొందుతున్నారని, పేద బ్రాహ్మణులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. తమ సమస్య పరిష్కారం కాకపోతే ఈ నెల 19న విజయవాడలో రెండు లక్షల మంది బ్రాహ్మణులతో భారీ ధర్నా చేస్తామన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర అర్చక పురోహిత సంఘం కన్వీనర్ మధుసూదన్, జిల్లా అధ్యక్షుడు ఎఎల్‌ఎన్ శాస్త్రి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఆనంద్‌కుమార్, రాజన్న, నరసింహులు, కృష్ణమోహన్, రాజేంద్రకుమార్, చంద్రమౌళి, సీనియర్ నాయకులు శ్రీధర్, సురే ష్ చంద్ర, భాస్కరస్వామి, విశ్వనాథ్ శర్మ, నాగరాజు, కోట నాగరాజు, సుధీంద్ర పాల్గొన్నారు.