రుణం... నిరీక్షణం
రుణం కోసం రైతాంగం నిరీక్షిస్తోంది. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలకే సమయం వెచ్చిస్తూ రైతన్న నీరసించి పోతున్నాడు. ఆర్భాటంగా ప్రకటించిన రుణ ప్రణాళిక పది శాతం కూడా నెరవేరలేదు.
- బ్యాంకుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు
- రూ.7,493.94 కోట్లు ఇస్తామని రుణ ప్రణాళిక
- ఇప్పటి వరకు పది శాతం కూడా ఇవ్వని బ్యాంకులు
- పట్టించుకోని ప్రభుత్వం
సాక్షి, చిత్తూరు: ఈ ఏడాది రైతులకు పెద్ద ఎత్తున రుణాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.7,493.94 కోట్ల రుణాలిస్తామని బ్యాంకుల రుణ ప్రణాళిక ప్రకటించింది. కానీ ఐదు నెలల కాలం ముగుస్తున్నా ఇప్పటివరకు పది శాతం రుణాలు కూడా ఇవ్వలేదు. బ్యాంకుల మాటలు నీటిమూటలుగానే మిగిలాయి. అటు ప్రభుత్వం రైతులకు రుణాల పంపిణీ సంగతి గాలికొదిలేసింది. రాబోయే 8 నెలల కాలంలో రుణాలు పంపిణీ వేగవంతం చేస్తామని కొందరు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఆర్థికసంవత్సరంలో ప్రకటించిన రుణ ప్రణాళికలో 40 శాతానికి మించి రుణాలు పంపిణీ చేసే అవకాశం లేదని మరికొందరు బ్యాంకు అధికారులు పేర్కొనడం గమనార్హం.
గత ఏడాది కంటే 21.59 శాతం అధికంగా రుణాలిస్తామని ప్రకటించిన ప్రభుత్వం అన్నదాతలను వంచించింది. బ్యాంకుల రుణ ప్రణాళికలను పరిశీలిస్తే ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అనుబంధాలకు సంబంధించి 4,03,601 ఖాతాల పరిధిలో 4,411.69 కోట్లు రుణాలివ్వనున్నట్లు ప్రకటించింది. వేరుశనగ సాగుకు సంబంధించి 1,21,992 ఖాతాల పరిధిలో 685.32 కోట్లు, చెరకు సాగుకు సంబంధించి 35,581 ఖాతాల పరిధిలో 506.98 కోట్లు, టమాటాకు సంబంధించి 16,714 ఖాతాల పరిధిలో రూ.197.63 కోట్లు, మామిడికి సంబంధించి 30,498 ఖాతాల పరిధిలో రూ.385.86 కోట్లు చొప్పున రుణాలివ్వనున్నట్లు బ్యాంకులు ప్రకటించాయి.
దీంతో పాటు మైనర్ ఇరిగేషన్ విభాగంలో రూ.100 కోట్లు, భూ అభివృద్ధి పథకాలకు సంబంధించి రూ.40కోట్లు, హార్టికల్చర్ విభాగంలో రూ.100 కోట్లు, అటవీ, భూ అభివృద్ధి పథకాలకు సంబంధించి రూ.612 కోట్లు, డెయిరీ డెవలప్‌మెంట్ సెక్టార్‌లో రూ.832 కోట్లు, కోళ్ల పరిశ్రమకు సంబంధించి రూ.59 కోట్లు, మత్స్యకారులకు సంబంధించి రూ.19 కోట్లు, మార్కెట్‌యార్డు గోదాముల అభివృద్ధికి సంబంధించి రూ.32 కోట్లు రుణాలివ్వనున్నట్లు ప్రకటించాయి. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో అన్ని రంగాలకు సంబంధించి 5,18,515 ఖాతాల ద్వారా రూ.7,493.94 కోట్ల రుణాలిస్తామని బ్యాంకులు ప్రకటించాయి.
ప్రకటనలు నీటి మూటలు
నాలుగు నెలలు కాలం ముగిసినా ఇప్పటివరకు వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఇస్తామన్న రూ.4,411.69 కోట్లల్లో పదిశాతం రూ.400 కోట్లు కూడా ఇంతవరకు పంపిణీ చేయలేదు. మిగిలిన విభాగాల్లో సైతం పదిశాతం లోపే రుణాలు పంపిణీ చేసినట్లు బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన రూ.7,493.94 కోట్ల రుణాలు పంపిణీ చేస్తామని చెప్పిన బ్యాంకులు నాలుగు నెలల కాలం ముగిసే నాటికి పట్టుమని రూ.700 కోట్లు కూడా పంపిణీ చేయలేదు. మిగిలిన ఎనిమిది నెలల కాలంలో పెద్ద ఎత్తున రుణాలు పంపిణీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
అయితే బ్యాంకు రుణప్రణాళికలో ప్రకటించిన దానిలో 40 శాతానికి మించి రుణాలు పంపిణీ జరిగే అవకాశం లేదని కొందరు బ్యాంకు అధికారులు పేర్కొంటుండడం గమనార్హం. ఈ లెక్కన 2014-15లో పంపిణీ చేసిన 3,791.83 కోట్లకు మించి రుణాలు అందే అవకాశం కనిపించడం లేదు. గత ఏడాది కంటే 21.90 శాతం అదనంగా రుణాలిస్తామని బ్యాంకుల మాటలు నీటిమూటలు కానున్నాయి. బ్యాంకు రుణాలు అందకపోవడంతో రైతులు పంటల బీమాకు సంబంధించి బీమా ప్రీమియం చెల్లించే అవకాశం లేకుండా పోయింది. దీంతో పంట నష్టం జరిగినా ఇన్సూరెన్స్ అందే అవకాశం లేదు. ఇప్పటికే వర్షాభావంతో ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశనగ పంట నిలువునా ఎండిపోయింది. బీమా ప్రీమియం చెల్లించి ఉంటే నష్టపరిహారం అందేది.