క్యాష్ కొట్టు.. పోస్టు పట్టు
Published Thu, Nov 7 2013 1:35 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
సాక్షి, గుంటూరు: త్వరలో భర్తీకానున్న అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టులకు బేరసారాలు జరుగుతున్నాయి. ఒక్కో పోస్టుకు రూ.3 లక్షలు చెల్లిస్తే, ఉద్యోగం వచ్చినట్లేనంటూ కొందరు సీడీపీవో(చైల్డ్ డవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్) స్థాయి ఐసీడీఎస్ ఉద్యోగులు అంగన్ వాడీ కార్యకర్తల్ని మభ్యపెడుతున్నారు. కాసులు పడితేనే కోరుకున్న చోట ఉద్యోగమంటూ నమ్మబలుకుతున్నారు. ఇదే నిజమని నమ్మిన కొందరు కార్యకర్తలు ఇప్పటికే ఆయా ఉద్యోగులకు గుట్టు చప్పుడు కాకుండా రూ.లక్షలు చెల్లించినట్లు తెలిసింది. జిల్లాలోని తెనాలి రెవెన్యూ డివిజన్‌లో ఇటువంటి బేరసారాలు ఊపందుకున్నట్లు సమాచారం.
ఒంగోలు ఐసీడీఎస్ జోన్ పరిధిలో ఉన్న గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో 302 అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నెల కిందట నోటిఫికేషన్ వెలువరించింది. అంగన్‌వాడీ కార్యకర్తలుగా పదేళ్ల అనుభవం ఉండి, పదో తరగతి పాసై, 45 ఏళ్ల లోపు వయస్సున్న మహిళలు ఈ పోస్టులకు అర్హులు. ప్రభుత్వం అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టుల్ని గ్రేడ్-2 కింద పరిగణించి భర్తీ చేస్తుండటంతో వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గత నెల 27న అన్ని జిల్లాల్లోనూ అర్హత పరీక్ష నిర్వహించారు. ఈ నెల రెండున ఫలితాలు వెలువడ్డాయి. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టింగ్స్ ఇవ్వాల్సి ఉంది. జోనల్ హెడ్‌క్వార్టర్స్ కలెక్టర్లు, ఆర్‌డీ స్థాయి అధికారులు రోస్టర్ పాయింట్లను గుర్తించి పోస్టింగ్స్ వేయాల్సి ఉంది.
అయితే అక్రమార్జనకు ఇదే సరైన సమయంగా భావించిన జిల్లాలోని కొందరు సీడీపీవో స్థాయి ఉద్యోగులు, వారి కింద పనిచేసే ఉద్యోగులు పరీక్ష రాసిన కార్యకర్తల్ని మభ్యపెడుతున్నారు. మార్కుల ప్రాతిపదిక మీదనే ఉద్యోగం రాదనీ, కాస్తోకూస్తో చేతులు తడిపితేనే పోస్టింగులంటూ బేరసారాలు మొదలు పెట్టినట్లు తెలిసింది. తెనాలి రెవెన్యూ డివిజన్‌లోని ఓ ప్రాంతానికి చెందిన సీడీపీవో ఇప్పటికే కొంత మంది నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు వినికిడి. ఆయనకు కొందరు కిందిస్థాయి ఉద్యోగులు సహకరించారని తెలిసింది. అదేవిధంగా నర్సరావుపేట డివిజన్‌లోనూ కొందరు ఉద్యోగులు పోస్టింగుల్లో సహకారం అందిస్తామంటూ నమ్మబలుకుతూ అభ్యర్థుల నుంచి ముందస్తు అవగాహన కుదుర్చుకుంటున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా, తెనాలి డివిజన్‌లో విస్తృత ప్రచారంలో ఉన్న బేరసారాల వ్యవహారం గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్ విచారణ జరిపి సరైన నివేదిక ఇవ్వాల్సిందిగా ఐసీడీఎస్ ఇన్‌చార్జి ప్రాజెక్టు డెరైక్టర్ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. గురువారం గుంటూరులో జరిగే సీడీపీవోల సమావేశంలో ఈ విషయంపై సమగ్ర సమీక్ష జరిగే అవకాశం వుందని సమాచారం.
సిఫార్సుల కోసం పైరవీలు...
ఇదిలా ఉండగా రెండు మూడు రోజుల్లో సూపర్‌వైజర్ ఉద్యోగాలకు పోస్టింగ్స్ పడనున్న దృష్ట్యా పరీక్ష రాసిన పలువురు కార్యకర్తలు తమ భర్తలతో కలిసి రాజకీయ నాయకుల సిఫార్సుల కోసం తిరుగుతున్నారు. తమకు అనుకూలమైన ప్రదేశంలో పోస్టింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేలు, మంత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలోని ఓ మంత్రి చుట్టూ ఎక్కువ మంది తిరుగుతున్నారని సమాచారం. తెనాలి, పొన్నూరు, నర్సరావుపేట ప్రాంతాల్లోని కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధుల ద్వారా ఉన్నతాధికారు లకు సిఫార్సులు చేయించుకునేందుకు ఎక్కువ మంది అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Advertisement