బాబు బడాయి..! | Chandrababu Naidu Fake Statements on kadapa Steel Plant | Sakshi
Sakshi News home page

బాబు బడాయి..!

Published Fri, Dec 28 2018 1:40 PM | Last Updated on Fri, Dec 28 2018 1:40 PM

Chandrababu Naidu Fake Statements on kadapa Steel Plant - Sakshi

కంబాలదిన్నెలో జరిగిన సభలో ప్రసంగిస్తున్న సీఎం చంద్రబాబు

సాక్షి కడప : విక్రమార్కుడు సినిమాలో హీరో రవితేజ ఆడవాళ్లందరికీ అరగుండు కొట్టడం గుర్తింది కదా..అదే తరహాలో సీఎం చంద్రబాబు ప్రస్తుతం స్టీల్‌ ప్లాంటుకు శంఖుస్థాపన చేస్తున్నా..మళ్లీ నాకే అవకాశం ఇవ్వండి..లేకపోతే అభివృద్ధి ఆగిపోతుదంటూ చెప్పిన మాటలు అచ్చం సినిమాలోని అరగుండును గుర్తుకు తెచ్చాయి. అన్నీ నేనే చేశా..రాజకీయాలు చెప్పడం లేదు..రెండు నెలల్లో పనులు మొదలుపెట్టి...ఆరు నెలలకు కాంపౌండ్‌ కట్టి....రెండేళ్లకు పూర్తి చేస్తాం....అయితే అంతకుముందే వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒకసారి ఆలోచించాలి..పనిచేసే వారినే ప్రోత్సహించండి.అన్నీ చేస్తున్నా...అభివృద్ధి ఏమిటో చూపిస్తున్నా....అటువంటప్పుడు అధికారంలోకి తీసుకు రావాల్సిన బాధ్యత మీదేనంటూ చంద్రబాబు తన మనసులో మాటను వెల్లడించారు. అభివృద్ధి పేరుతో రాయలసీమ స్టీల్‌ ప్లాంటుకు శంకుస్థాపన, భూమిపూజ చేసిన ఆయన అంతలోనే ఎన్నికల మాటెత్తడంపై అందరూ చర్చించుకోవడం కనిపించింది. ముందంతా అభివృద్ధి, సంక్షేమం అంటూ పెద్దపెద్ద మాటలు చెబుతూ వచ్చిన ప్రభుత్వాధినేత చివరకు స్టీల్‌ ప్లాంటు రహస్యం వెనుక ఉన్న మతలబు ఏమిటో అందరికీ ఇట్టే అర్థమైపోయింది. ఇదేనేమో బాబు బడాయి అంటూ పలువురు పెదవి విరవడం కనిపించింది.

ఎన్నికల స్టంట్‌
టీడీపీ, బీజేపీల చెలిమి నాలుగేళ్లకుపైగా నిరాడంబరంగా కొనసాగినా..స్టీల్‌ ప్లాంటు విషయంలో అప్పట్లో పెద్దగా పోరాడిన పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు విభజన హామీలు...ప్రత్యేక హోదా, స్టీల్‌ప్లాంటుతోపాటు అనేక అంశాలు నెరవేర్చాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరుబాట సాగిస్తూనే ఉంది. అయితే ఎన్నికలు దగ్గరపడే వరకు పెద్దగా పట్టించుకోని సీఎం బాబుకు ఒక్కసారిగా స్టీల్‌ప్లాంటు గుర్తుకు రావడం ఎన్నికల స్టంట్‌ తప్ప వేరే కాదని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే జూన్‌లో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్‌ రవిల దీక్షల సందర్భంగా ప్రకటించిన బాబు తర్వాత ఆరు నెలలపాటు సాగదీశారు. తీరా ఎన్నికలు మరో మూడు నెలల్లో రాబోతున్నాయనగా ఇప్పటికిప్పుడు పునాది రాయి వేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీక్ష సందర్బంగా కేంద్రానికి అల్టిమేటం గడువు పూర్తయిన వెంటనే స్టీల్‌ప్లాంటు పనులకు శ్రీకారం చుట్టాల్సి ఉంది. కానీ ఇంతవరకు పట్టించుకోకుండా ఇప్పుడు మొదలుపెట్టి నెలరోజుల్లో భూసేకరణ....రెండు నెలల్లో పనులు ప్రారంభం....ఆరు నెలలకు కాంపౌండ్‌ వాల్, రెండేళ్లకు పరిశ్రమ పూర్తి చేస్తామంటూ చెబుతున్న బాబు మాటలపై జిల్లా వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అధికారంపై బాబు మాట
గ్రామాల రూపురేఖలు మార్చే సిమెంటు రోడ్డు వేశా.. రుణమాఫీ చేశా..... అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వేయించా..ఇళ్లు కట్టించా..తాగు, సాగునీరు అందిందా..ప్రజలకు ఏం కావాలన్నా అన్నీ చేశా....ఇంకేం కావాలి..? పనిచేసే వారిని ప్రోత్సహించాలి...ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయి....అభివృద్ధి చేసే పార్టీకే పట్టం కట్టాలి. తటస్థులందరూ ఆలోచన చేయండి...స్టీల్‌ ప్లాంటుకు రూపకల్పన చేశా..రెండేళ్లలో పూర్తి చేస్తా....గతంలోనూ జిల్లాలో మా వాళ్లకు అవకాశం ఇవ్వలేదు...ఇన్ని చేస్తున్నా 2019 ఎన్నికల్లో టీడీపీ గెలవాలి...లేకపోతే మీరు చాలా నష్టపోతారు. 2004లో కాంగ్రెస్‌ గెలిచినా ఏం చేయలేదు. అదే నేను వచ్చి ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కడో నిలిపిండే వాడిని. 2014లో గెలువకపోయి ఉంటే ఈ రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు పడేదో....ఇప్పటికైనా గుర్తించండి....అధికారాన్ని కట్టబెట్టడంటూ స్టీల్‌ప్లాంటుకు భూమిపూజ, పైలాన్, శిలాఫలాకాల ఆవిష్కరణ అనంతరం సభలో బాబు మాటలు అధికారంపై ఉన్న మమకా>రాన్ని స్పష్టం చేశాయి. స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతూనే అభివృద్ది పేరుతో పట్టం కట్టండని చెబుతున్న మాటలు విని పలువురు దీనికోసమేనా బాబు ఇంతలా సంక్షేమం అంటూ చెప్పుకొచ్చారని పలువురు చర్చించుకోవడం కనిపించింది.

చెప్పిందే చెప్పి...జనాలు లేకున్నా చెబుతూ....
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గంటా 15 నిమి షాలకు పైగా ప్రసంగంలో చెప్పిందే చెబుతూ...జనాలకు విసుగు పుట్టించారు. పదేపదే అడిగి మరీ చప్పట్లు కొట్టించుకోవడం....అంతంత మాత్రం గా స్పందన రావడం కనిపించింది. అంతేకాకుండా బాబు ప్రసంగం మొదలైన కొద్దిసేపటికే చెప్పిందే చెబుతుండడంతో వరుస పెట్టి ఇంటిదారి పట్టారు. గ్యాలరీలు ఖాళీ అయినా బాబు ప్రసంగాన్ని మాత్రం వదల్లేదు. దాదాపు గంటకు పైగా నిరంతరాయంగా చెబుతూనే ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement