► హామీల విస్మరణలో సీఎంకు ఏ మాత్రం తీసిపోని ఎమ్మెల్యేలు
►అక్రమ మార్గాల్లో పయనం..ఇల్లు చక్కదిద్దుకోవడమే ధ్యేయం
► ప్రజలకు అందుబాటులో ఉండరు...సమస్యలు పరిష్కరించరు
►సొంత గ్రామాల అభివృద్ధిలో వెనకడుగు.. ఇంటి పనుల్లో ముందడుగు
సాక్షిప్రతినిధి, గుంటూరు : ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడును మించిపోయారు. ఎన్నికల ముందు, ఆ తరువాత సందర్భానుసారం హామీలు గుప్పిస్తూ మభ్యపుచ్చుతున్నారు. చివరకు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు సైతం ఇందుకు ఏమాత్రం భిన్నంగా లేరు. తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు. ఇసుక, మట్టి, గ్రావెల్, మైనింగ్ వంటి విషయాల్లో అక్రమ మార్గాల్లో పయనిస్తూ ‘అధికారం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే’ పనుల్లో నిమగ్నమవుతున్నారు.
ఎమ్మెల్యేల వారీగా పరిశీలిస్తే...
30 పడకల హామీ ఊసేది?
- తెనాలి శ్రావణ్‌కుమార్, ఎమ్మెల్యే, తాడికొండ
తన నియోజకవర్గంలోని తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల్లో తాగునీటి సమస్య తాండవిస్తోంది. లాం చప్టా నిర్మాణం, తాడికొండ గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో 30 పడకల హాలు నెరవేర్చని హామీలుగానే మిగిలిపోతున్నాయి. రాయపూడి ఇసుక రీచ్ అక్రమ తవ్వకాల్లో వాటాలు ఉన్నట్టు ఆరోపణలు లేకపోలేదు.
తాగునీటి సమస్య పరిష్కారం కాలేదు..
- జి.వి.ఆంజనేయులు, ఎమ్మెల్యే, వినుకొండ
తాను అధికారంలోకి రాగానే ప్రతి గ్రామంలో, పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఇచ్చిన హామీ నెరవేరలేదు. వెల్లటూరు రోడ్డులో 947 మంది పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలకు పొజిషన్ చూపిస్తానని, ఇందిరమ్మ పేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3 లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం చేయిస్తానన్న హామీ నెరవేరలేదు. టీడీపీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తూ గ్రామాలకు వెళ్లడం లేదని, ప్రజలకు అందుబాటులో ఉండ డం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
సెటిల్‌మెంట్లతోనే సరి..
- యరపతినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే, గురజాల
ఎన్నికల వుుందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. ప్రైవేట్ సెటిల్‌మెంట్లు, అక్రమ క్వారీయింగ్‌పైనే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రూ.100 కోట్లతో పిడుగురాళ్ల అభివృద్ది, రూ.20 కోట్లతో వుున్సిపాలిటీలో వుురుగునీటి పారుదల, 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు వంటి హామీలు నెరవేరలేదు.
కాగితాల్లోనే అభివృద్ధి..
- డాక్టర్ కోడెల శివప్రసాద్, ఎమ్మెల్యే, సత్తెనపల్లి
అభివృద్ధి అంతా కాగితాల మీదే కనపడుతోంది. గత ప్రభుత్వం మంజూరు చేసిన మినీ స్టేడియం, కస్తూరిబాగాంధీ విద్యాలయం తదితర పనులు చేపడుతున్నారు. ఈ ఏడాదిలో ఒక్కటీ అభివృద్ధి చేయలేదు. నియోజకవర్గంలో మరుగుదొడ్లు నిర్మించడం, నీరు-చెట్టు పేరు తో మట్టి విక్రయించడం మినహా అభివృద్ధి లేదు. తనయుడు శివరామకృష్ణ జోక్యం ఎక్కువగా ఉంటుందనే విమర్శలు బాహాటంగా వినపడుతున్నాయి.
దర్శనభాగ్యమే కరువు..
- నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే, వేమూరు
కొల్లూరు మండలంలోని పోతార్లంక ఎత్తిపోతల పథకం, జంపని చక్కెర ఫ్యాక్టరీ, గాజుల్లంక వద్ద కృష్ణానదిపై కాజ్‌వే నిర్మాణం, లోవోల్టేజీ సమస్య నిర్మూలనకు 133 కె.వి. సబ్ స్టేషన్‌లు రెండు ఏర్పాటు వంటి ప్రధాన హామీలేవీ నెరవేరలేదు. ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శ ఉంది.
సొంత వ్యాపారాల మీదే దృష్టి..
- అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే, రేపల్లె
నిజాంపట్నం హార్బర్ అభివృద్ధి ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. జెట్టి రెండవ దశ నిర్మాణ పనులకు స్థల కేటాయింపులు గతంలోనే జరిగినా పనులు ప్రారంభం కాలేదు. సొంత గ్రామంలోని రహదారుల మరమ్మతులపై కూడా ఎమ్మెల్యే దృష్టి కేంద్రీకరించలేకపోయారు. సొంత వ్యాపార పనులకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండలేకపోతున్నారు.
ఆచరణ లేని హామీలు..
- రావెల కిషోర్‌బాబు, ఎమ్మెల్యే, ప్రత్తిపాడు
మంత్రిగా సొంత నియోజకవర్గం ప్రత్తిపాడులో మార్కెట్‌యార్డు, కృత్రిమ అవయవాల కంపెనీ ఏర్పాటు, కాకుమానులో రూ. 13 కోట్లతో ఎస్సీ గురుకుల పాఠశాల నిర్మాణం తదితర హామీలు ఆచరణలోకి రాలేదు. సొంత శాఖకు చెందిన ముఖ్య కార్యక్రమాలు కూడా అన్నీ కూడా చేపట్టలేకపోయారు. పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీలో విమర్శకు గురయ్యారు.
ముందుకు సాగని ఆధునికీకరణ పనులు..
- ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే, తెనాలి
తెనాలిని మోడల్ పట్టణంగా చేస్తామన్న హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. పట్టణంలో ట్రాఫిక్ రద్దీ నివారణ, కాలువల ఆధునికీకరణలో భాగంగా మూడు పంటకాల్వలపై నాలుగు వంతెనల నిర్మాణానికి గత వారంలో శంకుస్థాపన చేయటం మినహా, కొత్తగా చేపట్టిన కార్యక్రమాలు ఏవీ లేవు.
ఊహల్లోనే వాగులపై బ్రిడ్జిలు..
- కొమ్మాలపాటి శ్రీధర్, ఎమ్మెల్యే, పెదకూరపాడు
గుంటూరు రోడ్డులోని యండ్రా యి వద్ద కొండవీటివాగు, నరుకుళ్లపాడు వద్ద మేళ్లవాగు పైన, పెదమద్దూరు వద్ద వాగు పైన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణాలు ఎన్నికల హామీలుగానే మిగిలి పోతున్నాయి. పెదకూరపాడు మండలంలో తాగునీటి సమస్య, అమరావతి నుంచి దొడ్లేరు మీదుగా బెల్లంకొండ అడ్డరోడ్డు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పెండింగ్‌లో ఉన్నాయి.
సొంతశాఖ బాధ్యతల్లోనే విఫలం..
- ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే, చిలకలూరిపేట
మంత్రిగా సొంత శాఖ బాధ్యతల నిర్వహణలో విఫలమయ్యారనే అపప్రదను మూటగట్టుకున్నారు. పత్తి కొనుగోళ్లపై సీబీఐ విచారణ ఆయన వైఫల్యానికి ఉదాహరణగా పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోయారు. ఆయన దగ్గర పనులు అయినట్టుగానే ఉంటాయి కాని పూర్తికావనే విమర్శ ఉంది.
మట్టి అమ్మకాలపై ఆరోపణలు..
- ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఎమ్మెల్యే, పొన్నూరు
ఐదవసారి ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక ముద్ర వేయలేక పోయారు. నీరు-చెట్టు కార్యక్రమం కింద కార్యకర్తలతోపాటు ఎమ్మెల్యే కూడా మట్టి, గ్రావెల్ అమ్మకంలో మమేకం అవుతున్నారనే ఆరోపణలు బాహాటంగా వినపడుతున్నాయి. జీ..హుజూర్ అనే అధికారులే ఇక్కడ పనిచేయగలుగుతున్నారు. ఓ చిరు ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం ఆయన వేధింపులకు పరాకాష్ఠగా పేర్కొంటున్నారు.
విస్తరణకు నోచని రహదారులు..
- మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్యే, గుంటూరు పశ్చిమ
నగరంలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. ముఖ్యంగా శ్యామలానగర్ రైల్వేగేటు వద్ద ఆర్‌ఓబీ, అరండల్‌పేట బ్రిడ్జి విస్తరణ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. నగరంలో రోడ్ల విస్తరణతో పాటు శివారుకాలనీల్లో మౌలికవసతుల కల్పనకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
బాబుకే బాబులు
Published Sun, May 24 2015 2:53 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
Advertisement
Advertisement