తిరుపతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలుస్తోందని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా తిరుపతిలో జరిగిన సభలో విజయమ్మ ప్రసంగించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి దాపురించేది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓట్లు, సీట్లు కోసమే విభజన నిర్ణయం జరిగిందని విజయమ్మ విమర్శించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆయన సమాధికి షర్మిల ఘన నివాళులర్పించిన అనంతరం సాయంత్రం తిరుపతికి చేరుకున్నారు. తిరుపతి లీలామహల్ సెం టర్ వద్ద జరుగనున్న భారీ బహిరంగసభలో ఆమె సమైక్య శంఖారావాన్ని ఆరంభించారు. షర్మిల ముందు ప్రసంగించిన వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓట్లు, సీట్లు కోసమే విభజన నిర్ణయం జరిగిందని విజయమ్మ విమర్శించారు.
కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నాయకత్వం వహిస్తుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, కేంద్ర పాలకమండలి సభ్యురాలు రోజా తదితర నాయకులు ఈ బహిరంగసభలో పాల్గొంటారు. షర్మిల బహిరంగసభలో పాల్గొనేందుకు వేలాది మంది జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు, పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.