వేసవిలో వరదేనా?
Published Mon, Jan 20 2014 1:42 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
మామిడికుదురు, న్యూస్‌లైన్ : వేసవిలో ఎంత ఎదురు చూసినా గోదావరికి వరద రాదు. గోదావరి వైనతేయ పాయపై వారధి నిర్మాణానికి ఏళ్ల తరబడి తాము చేస్తున్న నిరీక్షణ కూడా ఆ బాపతుగానే ఉందని రాజోలుదీవి వాసులు నిట్టూరుస్తున్నారు. మరో క్యాలెండర్ మారిపోయినా తమకు వారధి సదుపాయం మాత్రం చేరువ కాలేదని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. పంటు, పడవల కోసం ఎదురు చూడనక్కర లేకుండా ఎంచక్కా వంతెనపై పయనించి, కోనసీమ రాజధాని అమలాపురానికి చేరుకునే సుదినం ఎప్పుడొస్తుందని ప్రశ్నిస్తున్నారు. గోదావరి వైనతేయ పాయపై బోడసక్రురు-పాశర్లపూడిల మధ్య వంతెన నిర్మాణం 2010 ఏప్రిల్ 25 నాటికి పూర్తి కావల్సి ఉండగా ఇప్పటికి 90 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. గత నెల 19న వారధి పనుల్ని పరిశీలించిన జాతీయ రహదారుల విభాగం ఎస్‌ఈ విజయ్‌కుమార్ జనవరి 20 నాటికి నిర్మాణం పూర్తవుతుందని ప్రకటించినా అదీ కార్యరూపం దాల్చలేదు. కాగా మార్చి నెలాఖరుకు నిర్మాణం పూర్తవుతుందని జాతీయ రహదారుల డీఈఈ బసివిరెడ్డి ఆదివారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. మరో మూడు స్పాన్‌లపై శ్లాబ్‌లతో పాటు అప్రోచ్ రోడ్లను పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఇలాంటి గడువులెన్నో గడిచిపోయినా వంతెనపై కాలు మోపే రోజు ఎప్పటికప్పుడు అల్లంత దూరాన్నే ఉంటోందని ఈ ప్రాంతవాసులు విమర్శిస్తున్నారు.
దూరాభారం తగ్గుతుంది..
కృష్ణా జిల్లా పామర్రు నుంచి జిల్లాలోని కత్తిపూడి వరకు గల 216వ నంబర్ జాతీయ రహదారిలో వైనతేయపై వారధి నిర్మాణానికి 2006 ఏప్రిల్ ఒకటిన అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.70.50 కోట్ల అంచనా వ్యయంతో గామన్ ఇండియా కంపెనీ నిర్మాణం చేపట్టింది. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ రూ.56 కోట్లు గ్రాంటుగా ఇచ్చింది. ఈ వారధి నిర్మాణం వల్ల రాజోలు దీవిలోని మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాలతో పాటు పి.గన్నవరం మండల పరిధిలోని కొన్ని గ్రామాలకు డివిజన్ కేంద్రమైన అమలాపురం వెళ్లేందుకు దగ్గరి దారి అందుబాటులోకి వస్తుంది. ఆ నాలుగు మండలాల ప్రజలు నది దాటకుండా అమలాపురం చేరుకోవాలంటే తాటిపాక సెంటర్, పి.గన్నవరం, అంబాజీపేటల మీదుగా వెళ్లాల్సి ఉంది. తాటిపాక- అమలాపురంల మధ్య దూరం 28 కిలో మీటర్లు. తాటిపాక నుంచి మామిడికుదురు, పాశర్లపూడిల మీదుగా నది దాటి అమలాపురం చేరుకుంటే దూరం 18 కిలో మీటర్లే. ప్రస్తుతం రోజూ రెండు వేల మంది వైనతేయ నదిని పంటు, పడవలపై దాటుతూ రాకపోకలు సాగిస్తున్నారు. ఈ వంతెన నిర్మాణం ద్వారా వీరికి రేవు దాటే అవస్ధలు తీరిపోతాయి. దీంతో పాటు ఈ ప్రాంతంలో పండించే కూరగాయలను, ఇతర పంటలను అమలాపురం మార్కెట్‌కు తరలించుకునేందుకు రైతులకు వెసులుబాటు కలుగుతుంది.
మంత్రి మాటలూ.. వరదలో గడ్డిపరకలే..
వారధి నిర్మాణ ం పూర్తి కావడానికి తొలుత 2010 ఏప్రిల్ 25 గడువుగా నిర్దేశించినా అప్పటికి పనులు పూర్తి కాకపోవడంతో గడువును 2011 అక్టోబరు 25 వరకు పొడిగించారు. అప్పటికీ పనులు అసంపూర్తిగా ఉండడంతో 2013 జూన్ 30 వరకు గడువును మరోసారి పొడిగించారు. షరామామూలుగా ఈ గడువు కూడా నీటి మీద రాతే అయింది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ గత ఏడాది జూన్ 25న వారధి నిర్మాణంపై పాశర్లపూడిలో బహిరంగ సమీక్ష నిర్వహించారు. గామన్ ఇండియా ప్రతినిధులపై నిప్పులు చెరిగారు. ‘సెప్టెంబర్ నెలాఖరు లోగా వారధి నిర్మాణం పూర్తి చేయని పక్షంలో సంస్ధను బ్లాక్ లిస్ట్‌లో పెడతా’మంటూ హుంకరించారు. కానీ ఆ గడువు ముగిసి మూడు నెలలు దాటిపోయినా పనులు పూర్తి కాలేదు. వారధి విషయంలో కేంద్ర మంత్రి మాటలూ వరదలో గడ్డిపరకల పాటే అయ్యాయి.
అధికారుల వైఫల్యమే..
వంతెన నిర్మాణానికి 2006లోనే శంకుస్థాపన జరిగినా ఇంత వరకు దాని నిర్మాణం పూర్తి కాకపోవడం పూర్తిగా అధికారుల వైఫల్యమే. దీని నిర్మాణంలో జరుగుతున్న జాప్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి.
- పిచ్చిక చిన్న, మాజీ సర్పంచ్, అప్పనపల్లి
ప్రజల అవస్థలు పట్టవా?
వైనతేయ వారధి నిర్మాణంలో ఆలస్యం వల్ల ప్రజలు రోజూ అవస్థలు పడుతున్నారు. నాటు పడవలు, పంటులపైనే నదిలో రాకపోకలు సాగిస్తున్నారు. రాత్రి సమయాల్లో నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా ప్రతినిధులకు, అధికారులకు జనం పాట్లు పట్టడం లేదు.
- పెదమల్లు నాగబాబు, ఆదర్శరైతు, పాశర్లపూడిలంక
Advertisement