ఫీజుకు బూజు
ఉన్నత చదువులు చదవలేమని బెంగ పెట్టుకున్న విద్యార్థు లు. పిల్లల బంగారు భవిష్యత్తు నడిసంద్రంలో నావలా తయారైందని ఆందోళనలో తల్లిదండ్రులు. ఏళ్లు గడిచిపోతున్నా బకాయిలు తీర్చకపోతే కళాశాలలు ఎలా నడపాలన్న చింతనలో యాజమాన్యాలు. వెరసి ఫీజు రీ యింబర్స్ మెంట్ విషయంలో అడకత్తెరలో పోకచెక్కలా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు పాలకుల దృష్టికొచ్చినా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రైతు, డ్వాక్రా రుణ మాఫీ తరహాలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపైనా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దంటూ కనీసం మౌఖిక ఆదేశాలైనా కళాశాలల యాజమాన్యాలకు ప్రభుత్వం ఇవ్వలేదు. గజపతినగరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు-82 మంది. ఉపాధ్యాయుడు ఒక్కరు. జామి మండలం బలరాంపురం ఎంపీపీ స్కూల్‌లో విద్యార్థులు 50మంది. ఉపాధ్యాయుడు ఒక్కరు. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలోని 624 పాఠశాలలకు ఏకోపాధ్యాయులే ఉన్నారు.
సాక్షిప్రతినిధి, విజయనగరం: పేద ఇంట్లో పుట్టినా ప్రతి విద్యార్థీ ఉన్నత చదువు అభ్యసించాలన్న సదుద్దేశంతో మహానేత వైఎస్ రాజశేఖ ర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీ యింబర్స్‌మెంట్ పథకాన్ని ఆయన తర్వాత వచ్చిన పాలకులు భ్రష్టు పట్టించడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. ఇంటర్‌మీడియెట్ తరువాత ఉన్నత చదువులు, ఇంజినీరింగ్ నుంచి ఆపై చదువులు, డిగ్రీ నుంచి భవిష్యత్‌కు దోహదపడే చదువులు అభ్యసించే విద్యార్థులంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం కల్పించిన అవకాశంతో ఆయా కోర్సుల్లో చేరినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో అర్ధాంతరంగా చదువు మానేయాల్సిన దుస్థితి వారికి ఏర్పడింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకూ దిక్కుతోచడం లేదు.
జిల్లాలో ఒక్క 2013-14 సంవత్సరానికి సంబంధించి 46వేల మంది విద్యార్థులకు ఫీజు రీ యింబర్స్‌మెంట్ అందలేదు. వారిలో రెన్యువల్ విద్యార్థులు సుమారు 26వేల మంది ఉన్నారు. వీరందరికీ రూ.47 కోట్ల మేర ఫీజు బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అదే తరహాలో 2012-13కి సంబంధించి కోట్లా ది రూపాయల బకాయిలు ఉన్నాయి. ఈ విధంగా పేరుకుపోతున్న ఫీజు బకాయిలను భరించలేక కళాశాల యాజమాన్యాలు చేతులేత్తేస్తున్నాయి. ఫీజుల కోసం ఎన్నాళ్లు వేచిచూడగలమని? అధ్యాపకుల జీతాలు, ఇతరత్రా ఖర్చులకు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టగలమని? ప్రశ్నిస్తున్నారు. నెలలైతే ఏదో సర్దుకుపోగలం గానీ సంవత్సరాలైపోతే ఎలా భరించగలమని యాజమాన్యా లు వాపోతున్నాయి.
దీంతో ఫీజు రీ యింబర్స్‌మెంట్‌తో చదువుతున్న విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. ప్రభుత్వం ఇవ్వనందున విద్యార్థులే ఫీజు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఎవరి దారి వారు చూసుకోవాలని సూచనప్రాయంగా చెప్పేస్తున్నాయి. చెప్పాలంటే అటువంటి విద్యార్థుల్ని చిన్న చూపు చూస్తున్నాయి. తమది ఆపదలో ఉన్నవారిని ఆదుకునే సంక్షేమ ప్రభుత్వమని చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ నేటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హామీ ఇవ్వడం లేదు. ఫీజుల చెల్లింపులపై కనీస స్పష్టత ఇవ్వలేదు. మరి విద్యార్థుల ఉన్నత చదువులు ఎలా సాగుతా యో వేచి చూడాల్సిందే.