ఇచ్ఛాపురంలో థర్మల్ అంటే పోరాటమే
ఈదుపురం (ఇచ్ఛాపురం): ఇచ్ఛాపురం మండలాన్ని థర్మల్ ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదిస్తే, అందుకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాటం చేయాలని ఇచ్ఛాపురం, కవిటి మండలాలకు చెందిన స్వదేశీ మత్స్యకారులు సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మండలంలోని ఈదుపురం గ్రామంలో ఆయా సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్ఛాపురంలోనూ థర్మల్ ప్లాంటు ఏర్పాటు చేయనున్నారనే వార్తలు వస్తున్నాయని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. థర్మల్ ప్లాంటు ఏర్పాటు చేస్తే 5 వేల కుటుంబాలకు చెందిన వేలాది మంది స్వదేశీ మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయి రోడ్డు పడతారని, ప్రజలను నాశనం చేసే ప్లాంటు తమకు అవసరం లేదని పేర్కొన్నారు.
థర్మల్ వ్యతిరేక పోరాటానికి అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే సోంపేట థర్మల్‌కు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంటే, మళ్లీ మరో థర్మల్ ప్లాంటుకు ప్రతిపాదించడం దారుణమన్నారు. ఇచ్ఛాపురం, కవిటి, ఈదుపురం ప్రాంతాల్లో వరుస సమావేశాలు నిర్వహించి థర్మల్ వ్యతిరేక పోరాటానికి కార్యచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని తీర్మానించుకున్నారు. సమావేశంలో ఇచ్ఛాపురం స్వదేశీ మత్సకారుల సంఘం ప్రతినిధులు మదన్ బెహరా, నవీన్ బెహరా, డైరక్టర్ గుర్నాథ్ బెహరా, మున్సిపల్ కౌన్సిలర్ రవి బెహరా, కిరణ్ కుమార్ బెహరా, ఈదుపురం సంఘం అధ్యక్షుడు తరుణ్ బెహరా, కార్యదర్శి డిల్లేశ్వర బెహరా, పెద్దలు రామచంద్ర బెహరా, రఘునాథ్ బెహరా, భీమ్ సేన్ బెహరా, కవిటి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రామచంద్ర బెహరా, కార్యదర్శి ఎం.త్రినాథ బెహరా, ఉపాధ్యక్షుడు ఎ.కమలలోచన బెహరా, డెరైక్టర్ ఎన్.నరోత్తమ్ బెహరా తదితరులు పాల్గొన్నారు.