సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
గ్రేటర్‌లో జిల్లాలోని 35 పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. సీమాంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే పంచాయతీలను విలీనం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గకుంటే పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. గురువారం తెలంగాణ భవన్‌లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కె.హరీశ్వర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, చేవెళ్ల పార్లమెంట్ ఇన్‌చార్జ్ కె.విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా ఉనికిని దెబ్బతీసే క్రమంలో భాగంగానే విలీన నిర్ణయాన్ని తీసుకున్నట్లు హరీశ్వర్‌రెడ్డి ఆరోపించారు. తాజాగా విలీనంతో జిల్లాలోని 4.38 లక్షల జనాభా గ్రేటర్‌లో కలుస్తోందన్నారు.
ఇప్పటికే చంద్రబాబు, ైవె ఎస్ పాలనలో జిల్లాలోని వేల ఎకరాల ప్రభుత్వ భూములు, వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయని, తాజాగా విలీన ప్రక్రియతో జిల్లా ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మణికొండ లో లగడపాటి, కావూరి తదితర సీమాంధ్రుల ఆస్తులపై ఎక్కువ పన్ను పడకుండా జాగ్రత్త పడుతూ ఈ గ్రామానికి ఎన్నికలు నిర్వహించేలా ఎత్తులు వేశారన్నారు. జిల్లాలోని కొంత భాగాన్ని నల్లగొండలో, మరికొంత భాగాన్ని మెదక్ జిల్లాలో కలిపి జిల్లాను కనుమరుగు చేసేలా కుట్ర జరుగుతుందని హరీశ్వర్‌రెడ్డి అన్నారు. విలీన ప్రక్రియపై, అదేవిధంగా జిల్లా అస్తిత్వానికి ముప్పు వాటిల్లే పరిణామాలపై టీఆర్‌ఎస్ ఉద్యమించనున్నట్లు చెప్పారు. అన్ని మండల కేంద్రాల్లో రిలే దీక్షలు చేపట్టనున్నట్లు, అదేవిధంగా జిల్లా పరిషత్‌లో ఆమరణ దీక్షకు దిగనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి త్వరలో కార్యాచరణ ఖరారు చేయనున్నటు నాగేందర్‌గౌడ్ చెప్పారు. విలీనానికి వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వరంలో టీఆర్‌ఎస్ ఉద్యమిస్తుందని వివరించారు.
వెనక్కి తగ్గాల్సిందే
Published Fri, Sep 13 2013 12:58 AM | Last Updated on Tue, Aug 21 2018 12:21 PM
Advertisement
Advertisement