జాబు రాలేదని దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం | Handicapped attempted suicide | Sakshi
Sakshi News home page

జాబు రాలేదని దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం

Published Fri, Sep 21 2018 4:02 AM | Last Updated on Fri, Sep 21 2018 7:42 AM

Handicapped attempted suicide - Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రభుత్వ తీరుతో కొలువు దొరక్క, బతికేందుకూ ఏ ఆసరా లేక, కుటుంబాలకు భారంగా మారలేక నిరుద్యోగ యువత మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ నిరుద్యోగ దివ్యాంగుడు కర్నూలు కలెక్టరేట్‌ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఉద్యోగం లేదా స్వయం ఉపాధి కోసం సీఎం చంద్రబాబు వద్దకు నాలుగు సార్లు వెళ్లి గోడు చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో లక్ష్మణస్వామి అనే దివ్యాంగుడు గురువారం ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు.. బేతంచెర్ల మండలం రేపల్లెకు చెందిన లక్ష్మణస్వామి 2009లో డిగ్రీ (బీఏ) పూర్తి చేశాడు.

పై చదువులు చదివే స్తోమత లేక, కుటుంబానికి భారం కావడం ఇష్టం లేక ఉద్యోగం కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. కనీసం స్వయం ఉపాధి కోసమయినా ప్రభుత్వ సాయం తీసుకోవాలనుకున్నాడు. అతికష్టమ్మీద అమరావతికి వెళ్లి సీఎం చంద్రబాబును నాలుగుసార్లు కలిశాడు. ఉద్యోగం లేదా స్వయం ఉపాధికి సాయం చేసి ఆదుకోవాలని వేడుకున్నాడు. అయినా ఎలాంటి ఫలితమూ లేదు. పైగా 80 శాతానికి పైగా వైకల్యమున్నా.. ఉద్దేశపూర్వకంగానే తక్కువ చూపి రూ.1,500 పింఛన్‌ను కూడా ఎగవేశారు. లక్ష్మణస్వామికి వివాహం కూడా అయ్యింది. ఇద్దరు కుమారులు. కుటుంబ పోషణ కోసం తల్లిదండ్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి.

ఇలా ఇంకెన్నాళ్లు బతకాలంటూ తీవ్రవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టరేట్‌ ప్రాంగణంలోని జేడీఏ కార్యాలయంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలో ఆ దగ్గర్లో ఉన్న ఉద్యోగులు వెనక్కి లాగేయడంతో ప్రమాదం తప్పింది. దీనిపై సమచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని డీఆర్వో వెంకటేశం వద్దకు తీసుకెళ్లారు. లక్ష్మణస్వామి బాధ విన్న డీఆర్‌వో ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. బ్యాంకు ద్వారా రుణం ఇప్పించి స్వయం ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు.

జాబు రావాలంటే బాబు రావాలన్నారు.. తర్వాత పట్టించుకోలేదు
‘ఇంటికో జాబు ఇస్తామన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. దివ్యాంగులం ఉన్నత చదువులు చదువు కొని ఉపాధి కోసం నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం. ఎవరూ పట్టించుకోవడంలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు ప్రయత్నించా’ అని లక్ష్మణస్వామి వాపోయాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement