ఎమ్మెల్యేలకు కనీస గౌరవం ఇవ్వరా?
నెల్లూరు సిటీ : ‘ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు నగర, రూరల్ ఎమ్మెల్యేలకు నగరపాలక సంస్థ పిలుపు రావడం లేదు. ఫ్రొటోకాల్ పాటించడంలేదు. ఎమ్మెల్యేలకు కనీస గౌరవం ఇవ్వడంలేదు.’ అంటూ నగరపాలక సంస్థ కమిషనర్ చక్రధర్‌పై వైస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్ రూప్‌కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ సమాధానం చెప్పకుండా సమావేశం నుంచి అర్థంతరంగా వెళ్లిపోయారు. దీనిపై కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం కార్పొరేషన్ కార్యాలయంలో పందుల నివారణపై సమీక్ష సమావేశం జరిగింది.
ఆ తర్వాత కార్పొరేటర్లతో మేయర్ అజీజ్, కమిషనర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తమ డివిజన్లల్లోని సమస్యలను కార్పొరేటర్లు మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. తాము డివిజన్లల్లో తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు కేటాయించి సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత అధ్వానంగా మారే అవకాశం ఉందన్నారు.
వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్ రూప్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆదివారం ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ విలేజ్, స్మార్ట్ డివిజన్ కార్యక్రమానికి నగర, రూరల్ ఎమ్మెల్యేలు డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి సమాచారం ఇవ్వకపోవడంపై కమిషనర్‌ను ప్రశ్నించారు.
గతంలోనూ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు చెప్పలేదని ఆగ్రహించారు. ప్రజాప్రతినిధుల్ని ఫ్రొటోకాల్ ప్రకారం ఆహ్వానించాల్సిన బాధ్యత కమిషనర్‌పై ఉందని గుర్తు చేశారు. అయితే కమీషనర్ సమాధానం చెప్పకుండానే సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. కమిషనర్ తీరును కార్పొరేటర్లు అందరూ తీవ్రంగా ఖండించారు. దీంతో మేయర్ జోక్యం చేసుకుని కమిషనర్‌కు ఫోన్ చేసి సమావేశానికి పిలిపించారు.
కమిషనర్ వచ్చాక రూప్‌కుమార్ మాట్లాడుతూ పార్లమెంట్, శాసనసభల్లో ఇంతకు మించి వాడీవేడిగా సమావేశాలు జరుగుతుంటాయి. అక్కడ ఇలాగే సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంటారా? అని నిలదీశారు. ఆరు లక్షల మంది ప్రజలు ఓట్లు వేసి తమను గెలిపించింది.. వారి సమస్యలను తీర్చేందుకే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. తనకు స్మార్ట్ వార్డు కార్యక్రమం ఆలస్యంగా తెలిసిం దని, గంట ముందు ఎమ్మెల్యేలకు తెలియజేశానని కమిషనర్ వివరణ ఇచ్చారు. ఇక నుంచి ఇటువంటి వివాదం పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు.
మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ కమిషనర్ కొత్తగా వచ్చారన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు కమిషనర్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాసయాదవ్, దేవరకొండ అశోక్, దామవరపు రాజశేఖర్, లేబూరు పరమేశ్వరరెడ్డి, సత్తార్, వేలూరు మహేష్, కుంచల శ్రీనివాసులు, భువనేశ్వరిప్రసాద్, ఆనం రంగమయూర్‌రెడ్డి, ఎస్‌ఈ ఇమాముద్దీన్, హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ పాల్గొన్నారు.