rupkumar Yadav
-
ఎమ్మెల్యేలకు కనీస గౌరవం ఇవ్వరా?
నెల్లూరు సిటీ : ‘ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు నగర, రూరల్ ఎమ్మెల్యేలకు నగరపాలక సంస్థ పిలుపు రావడం లేదు. ఫ్రొటోకాల్ పాటించడంలేదు. ఎమ్మెల్యేలకు కనీస గౌరవం ఇవ్వడంలేదు.’ అంటూ నగరపాలక సంస్థ కమిషనర్ చక్రధర్‌పై వైస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ రూప్‌కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ సమాధానం చెప్పకుండా సమావేశం నుంచి అర్థంతరంగా వెళ్లిపోయారు. దీనిపై కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం కార్పొరేషన్ కార్యాలయంలో పందుల నివారణపై సమీక్ష సమావేశం జరిగింది. ఆ తర్వాత కార్పొరేటర్లతో మేయర్ అజీజ్, కమిషనర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తమ డివిజన్లల్లోని సమస్యలను కార్పొరేటర్లు మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. తాము డివిజన్లల్లో తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు కేటాయించి సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత అధ్వానంగా మారే అవకాశం ఉందన్నారు. వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ రూప్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆదివారం ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ విలేజ్, స్మార్ట్ డివిజన్ కార్యక్రమానికి నగర, రూరల్ ఎమ్మెల్యేలు డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి సమాచారం ఇవ్వకపోవడంపై కమిషనర్‌ను ప్రశ్నించారు. గతంలోనూ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు చెప్పలేదని ఆగ్రహించారు. ప్రజాప్రతినిధుల్ని ఫ్రొటోకాల్ ప్రకారం ఆహ్వానించాల్సిన బాధ్యత కమిషనర్‌పై ఉందని గుర్తు చేశారు. అయితే కమీషనర్ సమాధానం చెప్పకుండానే సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. కమిషనర్ తీరును కార్పొరేటర్లు అందరూ తీవ్రంగా ఖండించారు. దీంతో మేయర్ జోక్యం చేసుకుని కమిషనర్‌కు ఫోన్ చేసి సమావేశానికి పిలిపించారు. కమిషనర్ వచ్చాక రూప్‌కుమార్ మాట్లాడుతూ పార్లమెంట్, శాసనసభల్లో ఇంతకు మించి వాడీవేడిగా సమావేశాలు జరుగుతుంటాయి. అక్కడ ఇలాగే సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంటారా? అని నిలదీశారు. ఆరు లక్షల మంది ప్రజలు ఓట్లు వేసి తమను గెలిపించింది.. వారి సమస్యలను తీర్చేందుకే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. తనకు స్మార్ట్ వార్డు కార్యక్రమం ఆలస్యంగా తెలిసిం దని, గంట ముందు ఎమ్మెల్యేలకు తెలియజేశానని కమిషనర్ వివరణ ఇచ్చారు. ఇక నుంచి ఇటువంటి వివాదం పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ కమిషనర్ కొత్తగా వచ్చారన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు కమిషనర్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాసయాదవ్, దేవరకొండ అశోక్, దామవరపు రాజశేఖర్, లేబూరు పరమేశ్వరరెడ్డి, సత్తార్, వేలూరు మహేష్, కుంచల శ్రీనివాసులు, భువనేశ్వరిప్రసాద్, ఆనం రంగమయూర్‌రెడ్డి, ఎస్ఈ ఇమాముద్దీన్, హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ పాల్గొన్నారు. -
నీళ్లు తాగించారు
సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగర పాలక తొలి కౌన్సిల్ సమావేశం సోమవారం రసాభాస అయింది. నగరపాలక సంస్థ చర్చకు పెట్టిన అజెండాలో ప్రజాసమస్యలను ప్రస్తావించలేదని, ప్రజలకు ఉపయోగపడని ఈ సమావేశం ఎందుకంటూ వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్, 40వ డివిజన్ కార్పొరేటర్ పోలుబోయిన రూప్‌కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మేయర్ అబ్దుల్‌అజీజ్‌పై మండిపడ్డారు. అసలు ఇది అజెండానే కాదంటూ రూప్‌కుమార్‌కు ఏడో డివిజన్ టీడీపీ కార్పొరేటర్ కిన్నెర ప్రసాద్ వంతపాడటంతో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. నగర సమస్యలపై రెండుగంటలపాటు వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యులు మూకుమ్మడి దాడికి దిగడంతో మేయర్ అబ్దుల్అజీజ్ దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వైఎస్సార్సీపీ సభ్యులకు కొందరు టీడీపీ సభ్యులు మద్దతు పలకండంతో ఏంచేయాలో మేయర్‌కు పాలుపోలేదు. దీంతో ఆయన పదేపదే మంచినీళ్లు తాగాల్సి వచ్చింది. వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ రూప్‌కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ ప్రజాసమస్యలు, కార్పొరేషన్లో అవినీతిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక దశలో కాంగ్రెస్ కార్పొరేటర్ ఆనం రంగమయూర్ రెడ్డి సైతం వీరికి మద్దతు పలకడం విశేషం. సభ నడిపేతీరు మేయర్‌కు తెలియక పోవడంతో పలుమార్లు రూప్‌కుమార్ యాదవ్ పదేపదే క్లాస్ పెరకడం చర్చనీయాంశమైంది. నగరపాలిక ఏర్పడిన మూడునెలల తర్వాత ఎట్టకేలకు సోమవారం ఉద యం 11 గంటలకు కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మేయర్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. తొలుత గతంలో కార్పొరేటర్లగా పని చేసి మృతి చెందిన వారితో పాటు ఇటీవల తుది శ్వాస విడిచిన మాజీముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డికి ఆత్మశాంతి కలగాలని సభ మౌనం పాటించి సంతాపం తెలిపింది. అనంతరం మేయర్ అబ్దుల్ అజీజ్ 11:30కు సభను ప్రారంభించారు. నగరప్రజల ప్రధాన సమస్యలైన తాగునీరు, పారిశుధ్యం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను ప్రస్తావించని ఎజెండాను చదవడం ప్రారంభించారు. 45 నిమిషాలపాటు ఓపిక వహిం చిన రూప్‌కుమార్ యాదవ్ ఒక్కసారిగా లేచి ‘ప్రధాన ప్రజాసమస్యలు ఎజెండా లో పెట్టకుండా అయ్యోర్లు పిల్లకాయలకు చెప్పినట్టు సోది చదివి మా సహనాన్ని పరీక్షిస్తావా? అదేదన్నా ఉంటే ప్రెస్‌మీట్ పెట్టి చెప్పుకో’ అంటూ మేయర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మేము నీకింద పనిచేసే ఉద్యోగులం కాదు. ప్రజాప్రతినిధులం’ అంటూ విరుచుక పడ్డారు. నెల్లూరు నగరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు తాగునీరు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏమైంది? శానిటేషన్ సంగతేంది? అవేవీ ఎజెండాలో పెట్టకుండా, వాటిపై చర్చలేకుండా అసలు సమావేశం ఎందుకు? అంటూ రూప్ ప్రశ్నల వర్షం కురిపించారు. కార్పొరేషన్లో అవినీతిపైనా నిలదీశారు. పార్టీలు మారడంకాదు, పద్దులు తెలుసుకో అని హితవు పలికారు. ఎజెండాపై అన్ని పార్టీల కార్పొరేటర్లతో ఎందుకు చర్చించలేదు? అని మేయర్‌పై రూప్‌కుమార్ తీవ్రస్థాయిలో విరుచుక పడ్డారు. దీంతో మేయర్‌కు దిక్కుతోచక పలుమార్లు రూప్‌కు మైక్ కట్ చేయండం, ఆయన నిలదీయడంతో మళ్లీ ఇవ్వడం కనిపించింది. ‘మా పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్లావ్’ అంటూ రూప్ పదేపదే మేయర్‌కు చురకలంటించారు. టీడీపీ సభ్యుడు కిన్నెరప్రసాద్ లేచి మేయర్‌పై ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. ఇది అసలు ఎజెండానే కాదంటూ ధ్వజమెత్తారు. ‘ఏం చేయాలో తెలియనపుడు అడిగి తెలుసుకో. పారిశుధ్యం అధ్వానంగా మారింది. దోమలతో చచ్చిపోతున్నాం. ఎవరితోనైనా దీన్ని అజెండా అనిపిస్తే రాజీనామా చేసి ఇంటికెల్లిపోతా! కార్పొరేటర్లంటే అంతవిలువ లేకుండా పోయిందా’ అంటూ మేయర్‌పై కిన్నెర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఏకపక్షంగా అజెండా పెట్టడంతప్పు. కాంట్రాక్టర్ల కేటాయింపుల్లోనూ అనుమానాలున్నాయి. మరోసారి ఇలా జరగకుండా చూసుకోండి’ అంటూ 8 వ డివిజన్ కార్పొరేటర్ జెడ్‌ఎస్‌ప్రసాద్ కిన్నెరను బలపరిచారు. విపక్షంతోపాటు స్వపక్షం వారూ ఎదురు దాడికి దిడగంతో మేయర్ అజీజ్‌కు కొద్దిసేపు ఏమిచేయాలో పాలుపోలేదు. రూప్‌కుమార్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ నేతృత్వంలో మేయర్ పోడియం వద్దకుకు వెళ్లి కార్పొరేషన్ అక్రమాలపై పత్రికల్లో వచ్చిన కటింగులు ప్రదర్శిస్తూ కొద్దిసేపు ఆందోళనకు దిగారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ కార్పొరేషన్లో అక్రమాలపై ధ్వజమెత్తారు. అవినీతిని ప్రోత్సహించేలా అజెండా ఉందన్నారు. అనంతరం మేయర్ ఎజెండాలోని ఏడు అంశాలను చదివారు. వైఎస్సార్సీపీ సభ్యు లు పలు అభ్యంతరాలను లేవనెత్తగా టీడీపీ సభ్యులు కూడా వాటిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎట్టకేలకు కొన్ని సవరణలతో ఆమోదం తెలిపారు. తాగునీటి పథకానికి రూ.550 కోట్లు హడ్కోరుణం రూ.550 కోట్లతో తాగునీటి పథకాన్ని నిర్మించతలపెట్టినట్లు చెప్పారు. నగరాభివృద్ధికి రూ.200 కోట్ల ప్రపంచబ్యాంకు రుణం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కేంద్రప్రభుత్వ కొత్త నిబంధనల వల్ల స్మార్ట్ సిటీ రాలేదన్నారు. వందలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహించడం చర్చనీయాంశమైంది.