పురుగు మందు తాగి వివాహిత మృతి | Married to death by drinking pesticides | Sakshi
Sakshi News home page

పురుగు మందు తాగి వివాహిత మృతి

Published Thu, Nov 26 2015 11:33 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

పురుగు మందు తాగి వివాహిత మృతి - Sakshi

పురుగు మందు తాగి వివాహిత మృతి

అత్తింటివారు హత్యచేశారంటూ తల్లితండ్రుల ఫిర్యాదు
 
కొత్తకోట(రావికమతం): కొత్తకోటకు చెందిన బర్ల వెంకటకుమారి(25) గురువారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుందని భర్త, అత్తలు చెబుతుండగా.. అత్తింటివారే చంపేశారంటూ మృతురాలి తల్లిదండ్రులు కొత్తకోట పోలీసులకు గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు వివరాలు ప్రకారం కొత్తకోటకు చెందిన బర్ల రామకృష్ణకు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వెంకటకుమారితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. రామకృష్ణ మద్యానికి బానిసై తరచూ భార్యను వేధించే వాడని, చాలాసార్లు ఈ విషయమై ఇంటిలో గొడవలు జరిగాయని తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్త ఆగడాలు ఎక్కువై చీటికిమాటికి కొట్టడంతో ఏడాది క్రితం వెంకటకుమారిని పుట్టింటివారు కొన్నాళ్లు తీసుకెళ్లారు.

ఈ నెల 23న రామకృష్ణ సోదరుడు చిరంజీవి , మరికొందరు కొవ్వూరు వెళ్లి ఇకపై ఇద్దరూ సక్రమంగా కాపురం చేసేలా చూస్తామని చెప్పి వెంకటకుమారిని వెంటబెట్టుకు వచ్చారు. బుధవారం రాత్రి   అల్లుడు రామకృష్ణ అత్త నూకరత్నంకు ఫోన్‌చేసి మీకుమార్తెను తీసుకువెళ్లాలంటూ చెప్పాడు. గురువారం ఉదయం వస్తానని ఆమె చెప్పింది. గురువారం ఉదయం మళ్లీ ఫోన్ చేసి పురుగుమందుతాగి మీ కుమార్తె చనిపోయిందని సమాచారం ఇచ్చారని, తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదనీ భర్త, అత్తలే ఏదో చేసిఉంటారని కొత్తకోట పోలీసుల వద్ద మృతురాలి తల్లిదండ్రులువాపోయారు. కేసునమోదు చేసినట్టు ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. పోస్టుమార్టానికి మృతదేహాన్ని నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement