ఒంగోలు: ‘అందరి కంటే ముందుగా పరిశుభ్ర ప్రకాశం పేరుతో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం. నాలుగు నెలలు గడిచినా మన అభివృద్ధి ఆవగింజంత కూడా లేదు. ఈ లక్ష్యాన్ని చేరుకోగల సత్తా ఉందంటే కొనసాగిద్దాం..ఈ సారైనా వంద శాతం లక్ష్యాన్ని సాధించాలి’ అని ఎంపీడీవోలనుద్దేశించి జెడ్పీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. స్థానిక పాత జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని మండలాల ఎంపీడీవోలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
మండలానికి కనీసం రెండు గ్రామాల్లో సంపూర్ణంగా మరుగుదొడ్లు నిర్మించలేకపోయామన్నారు. గుడ్లూరు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో పందులు కాపురం పెట్టాయని, ఎంఈవో ఉన్న పాఠశాలలోనే పందులు పొర్లాడుతుంటే ఇక మిగతా పాఠశాలల్లో మార్పు ఎలా తీసుకురాగలమని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎంపీడీవో కార్యాలయానికి వెళ్తే ఒక్క అటెండరు తప్ప ఎవరూ లేకపోవడం బాధ్యతా రాహిత్యాన్ని స్పష్టం చేస్తోందన్నారు.
జెడ్పీ సీఈవో ఎ.ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాలల్లో పరిశుభ్రత పెంపొందించేందుకు, ఆస్తుల పరిరక్షణకు సంబంధించిన పాఠశాల కమిటీల ఏర్పాటును వారం రోజుల్లో పూర్తి చే యాలని ఆదేశించారు. ఇక నుంచి ప్రతి వారం ఎంపీడీవోల షెడ్యూల్‌ను జెడ్పీకి పంపాలని, క్యాంపునకు వెళ్లేటప్పుడు కూడా ఎక్కడకు వెళ్తున్నారో రికార్డుల్లో రాసిన తరువాతే వెళ్లాలన్నారు. ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేసిన వాటిలో నూరు శాతం టాయిలెట్ల లక్ష్యాన్ని 2015 ఫిబ్రవరి 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలలు జరుగుతున్న సమయంలో మరుగుదొడ్లకు తాళం వేసి ఉంటే సహించబోమన్నారు.
డీఈవో విజయభాస్కర్ మాట్లాడుతూ ఎంఈవోలు తమ పరిధిలో ఉన్నత పాఠశాలలు లేవని చెప్పడం సరికాదని..ఏపీఆర్‌ఎస్‌ఏ పాఠశాలలున్నా వాటిని సైతం ఒకసారి పరిశీలించాలని సూచించారు. సాయంత్రం నిర్వహించిన సమావేశంలో జెడ్పీ ఆస్తులకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. పాఠశాలలకు ఆర్‌డబ్ల్యూఎస్ లేదా సర్పంచ్‌ల ద్వారా కుళాయి కనెక్షన్లు ఇప్పించాలనే అంశాలపై మాట్లాడారు.
నెలాఖరు నాటికి లక్ష మరుగుదొడ్ల లక్ష్యం:
మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి అధికారులు చెబుతున్న లెక్కలపై జెడ్పీ చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలాఖరు నాటికి లక్ష టాయిలెట్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ఈనెల 4న ప్రభుత్వం ఒక సర్క్యులర్ విడుదల చేసింది. దాని ప్రకారం ఇప్పటి వరకు జాబ్‌కార్డు కలిగి ఉన్నవారు ఎవరైనా మరుగుదొడ్లు నిర్మించుకుంటే రూ.10 వేలు ఇచ్చేవారు, ఇక నుంచి దాన్ని రూ.12 వేలకు పెంచారు. అయితే దీనికి సంబంధించి ఉత్తర్వులు నేటికీ విడుదల కాలేదు.
మరుగుదొడ్ల లబ్ధిదారుడ్ని మండల కోఆర్డినేషన్ కమిటీ ద్వారానే ఎంపిక చేయాలి. మండల కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించి విధి విధానాలు కూడా రాలేదు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ మూర్తికి పలు సూచనలు చేశారు. ఆయన కూడా ఎంపీడీవోలు అడిగిన పలు ప్రశ్నలకు వివరంగా సమాధానమిచ్చారు. నెలాఖరునాటికి లబ్ధిదారుల ఎంపిక, జనవరి 15 నాటికి మంజూరు ఉత్తర్వులు పొందడం, ఫిబ్రవరి 15వ తేదీనాటికి నిర్మాణాలు పూర్తయ్యేందుకు దృష్టి సారించాలని సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
అభివృద్ధి ఆవగింజంత కూడా లేదు
Published Wed, Dec 24 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM
Advertisement