
మా పార్టీ ఏమీ నష్టపోదు: రామచంద్రయ్య
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని మాత్రమే అధికారికంగా నిర్వహించి ఇందిరాగాంధీ వర్థంతిని విస్మరించటం సరికాదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సి.రామచంద్రయ్య అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ మోదీ సర్కార్ సెక్యులర్ విధానాలను శంకించే పరిస్థితితో ఉందన్నారు. మోదీ అవలంభించే విధానాల వల్ల మైనార్టీలు అభద్రతా భావానికి గురవుతున్నారని రామచంద్రయ్య విమర్శించారు.
వాజ్పేయ్, అద్వానీ, మోదీ సారథ్యంలోని బీజేపీకి విలువల పరంగా చాలా తేడా ఉందని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలను బీజేపీలోకి చేర్చుకోవటం వల్ల తమ పార్టీ ఏమీ నష్టపోదని ఆయన అన్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర మాజీమంత్రులు పురందేశ్వరి, కావూరి సాంబశివరావు తదితరులు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ కూడా త్వరలో కమలం గూటికి చేరుతున్నారు.