కారు ఆపలేదని రక్షక్ వాహనంతో ఢీ | Police attack with Rakshak Vehicle | Sakshi
Sakshi News home page

కారు ఆపలేదని రక్షక్ వాహనంతో ఢీ

Published Sun, Jun 28 2015 10:16 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Police attack with Rakshak Vehicle

విద్యానగర్ (గుంటూరు) : వాహనాల తనిఖీల్లో భాగంగా కారును ఆపాలని సూచించినా, ఆగకుండా కారు దూసుకెళ్లడంతో పోలీసులు రక్షక్ వాహనంతో వెంబడించి మరీ ఢీకొట్టారు. ఈ ఘటన గుంటూరు రూరల్ మండలం నల్లపాడులో శనివారం రాత్రి 9 గంటల సమయంలో చోటు చేసుకుంది.

బాధితుల కథనం ప్రకారం... హౌసింగ్‌బోర్డ్ కాలనీకి చెందిన ఉన్నం సైదమ్మ, లక్ష్మయ్య దంపతులు కుటుంబసభ్యులతో కలసి శనివారం పిడుగురాళ్ల మండలం కరాలపాడులో ఓ శుభకార్యానికి వెళ్లారు. కాగా మనవడికి అనారోగ్యంగా ఉండడంతో చికిత్స కోసం వారు కారులో గుంటూరుకు బయల్దేరారు. పేరేచర్ల సెంటర్‌లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు కారు ఆపారు. చిన్నారికి బాగాలేదని, సత్వరమే వెళ్లాలంటూ కారు డ్రైవర్ సైదారావు ముందుకు పోనిచ్చాడు.

దీంతో పోలీసులు రక్షక్ వాహనంలో వెంబడించి కారును ఢీకొట్టారు. ఆ దెబ్బతో ఆ కారు అదుపుతప్పి పల్టీకొట్టింది. కారులో ఉన్నవారు బతుకు జీవుడా అనుకుంటూ బయటకు వచ్చి గ్రామస్తుల సాయంతో రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల జులుం నశించాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు సంఘటనాస్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. సంఘటనకు కారణమైన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బాధితులు తమ ఆందోళనను విరమించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement