ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ పాఠాలు!
- ప్రత్యేకంగా ఏడాది డిప్లొమా కోర్సు
- ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో మెళకువలపై ప్రత్యేక శిక్షణ
- రాష్ట్రంలో దశల వారీగా అమలుకు కసరత్తు
- వేసవి సెలవుల్లో శిక్షణకు సిద్ధమవుతున్న జాతీయ విద్యా ప్రణాళిక విభాగం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలు లేవని, అందువల్లే పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోందని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానోపాధ్యాయులకు వాటిని నేర్పించేందుకు నడుంబిగించింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో ప్రధానోపాధ్యాయులకు శిక్షణ అవసరమని స్పష్టం చేసింది. ఇటీవల వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యాశాఖ అధికారులతో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (న్యూపా) ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించింది.
ప్రధానోపాధ్యాయుల్లో సామర్థ్యాల పెంపునకు 16 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. అలాగే స్కూల్ లీడర్‌షిప్ అండ్ మేనే జ్‌మెంట్‌పై నె లపాటు రానున్న వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచిం చింది. ఇక దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, సీనియర్ టీచర్లకు స్కూల్ లీడర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్‌పై ఏడాది వ్యవధితో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమాను నిర్వహించాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి న్యూపాకు చెందిన ప్రతినిధులు కూడా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి రాష్ట్రంలో ప్రధానోపాధ్యాయులకు ఏయే అంశాల్లో శిక్షణ అవసరం? ఎలా నిర్వహించాలన్న వివిధ అంశాలను తెలియజేశారు.
దశలవారీగా శిక్షణ..
రాష్ట్రంలోని ప్రధానోపాధ్యాయులకు దశలవారీగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఎలిమెంటరీ స్కూళ్లలో ప్రధానోపాధ్యాయులకు సర్వ శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా, ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) ద్వారా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపడుతోంది. మొదటి దశలో మెదక్, ఆదిలాబాద్, ఆ తరువాత కరీంనగర్, నిజమాబాద్, నల్లగొండ, చివరగా మిగితా జిల్లాల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ శిక్షణను 10 రోజులు ఇవ్వాలా? 16 రోజులు ఇవ్వాలా? అనే అంశాలపై ఆలోచనలు చేస్తున్నారు. న్యూపా డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టాలని పేర్కొన్న నేపథ్యంలో వీటితోపాటు 45 రోజులు ఉండే షార్ట్ టర్మ్ శిక్షణ కోర్సు, 3 నెలలు ఉండే సర్టిఫికెట్ కోర్సు, తరువాత డిప్లొమా కోర్సు ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న కోణంలో ఆలోచిస్తోంది.
ఏయే అంశాల్లో శిక్షణ ఇస్తారంటే..
నాణ్యత ప్రమాణాల పెంపు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పాఠశాల పరిపాలన, సమాచార సాంకేతిక విజ్ఞాన వినియోగం, మానవ వనరుల నిర్వహణ, కమ్యూనిటీ భాగస్వామ్యం పెంపు, సేవల్లో పరిపాలన నైపుణ్యాలు.
అన్ని స్కూళ్లలో ప్రధానోపాధ్యాయులకు శిక్షణలు అవసరమే!
రాష్ట్రంలో 28,707 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అన్నింటిలో రెగ్యులర్ ప్రధానోపాధ్యాయులు లేకపోయినా ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు అన్ని పాఠశాలలకు ఉన్నారు. అయితే వాటిల్లో పని చేసే ప్రధానోపాధ్యాయులందరికీ శిక్షణ అవసరమని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి.