రియల్’ మోసాలు | real estate scams | Sakshi
Sakshi News home page

రియల్’ మోసాలు

Published Fri, Nov 15 2013 4:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM

real estate scams

 జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పదేళ్లుగా ఓ కొత్త తరహాలో కొనసాగుతోంది. అన్ రిజిస్టర్ అగ్రిమెంట్లతో కోట్లాది రూపాయల లావాదేవీలు సాగిపోతున్నాయి. ఇదే స్థాయిలో మోసాలు పెచ్చుమీరుతున్నాయి. ఈ వ్యవహారంలో ‘స్లీపింగ్ పార్టనర్లు’గా ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉండడం గమనార్హం.
 
 పలమనేరు, న్యూస్‌లైన్:
 ఓ వ్యక్తికి చెందిన కోటి రూపాయల భూమిని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒప్పందం కుదుర్చుకుని ఐదు లేదా పది లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చి అన్ రిజిస్టర్ చేసుకుంటాడు. అందులో మూడు నుంచి ఐదు నెలల గడువులోపు పూర్తి పైకం చెల్లించి రిజిస్టర్ చేసుకుంటామని రాసుకుంటారు. ఆ కోటి రూపాయల స్థలాన్ని అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తి ప్లాట్లు వేసి అమ్మకానికి శ్రీకారం చుడతాడు. వందలాది మంది నుంచి అడ్వాన్స్ రూపం లో డబ్బు తీసుకుని అన్ రిజిస్టర్ అగ్రిమెంట్లను చేయిస్తాడు. రెండు నెలలలోపే రిజిస్టర్ చేయించుకోవాలని ఆ అగ్రిమెంట్‌లో షరతు పెడతాడు. ఆ గడువులోపు ఆ స్థలాన్ని ప్లాట్ల రూపంలో పూర్తిగా విక్రయించి అందరికీ ఒకే రోజు రిజిస్ట్రేషన్ చేస్తామని నమ్మబలుకుతాడు. ఇలా వసూలైన మొత్తాన్ని భూమి యజమానికి చెల్లించి రియల్టర్ తన పేరిట రిజిస్టర్ చేసుకుంటాడు. ఆపై తాను విక్రయించిన వారికి రిజిస్టర్ చేయిస్తాడు.
 
  ఇదీ ప్రస్తుతం జరుగుతున్న కొత్త తరహా రియల్ వ్యాపారం. ఇదంతా అనుకున్నట్లు సాగితే సరేసరి. లేకుంటే నిర్ణీత గడువులోపు భూమి యజమానికి రియల్టర్ పూర్తి పైకం చెల్లించకుంటే అతను మరొకరికి విక్రయ అగ్రిమెంట్ చేయిస్తాడు. దీంతో మొదట అగ్రిమెంట్ చేసుకున్న రియల్టర్ అడ్వాన్స్‌ను పోగొట్టుకోవడంతో పాటు తను పలువురుకి జరిపిన విక్రయాలు చెల్లకుండా వారి నుంచి వసూలు చేసిన డబ్బు వెనక్కి ఇవ్వడం లేదా మోసం చేయడం లాంటివి జరుగుతున్నాయి. ఇలా ఒకే స్థలాన్ని పలువురుకి అగ్రిమెంట్లు చేయడంతో వివాదాలు రేగుతున్నాయి. అన్ రిజిస్టర్ అగ్రిమెంట్ల ద్వారానే జిల్లాలో రోజూ కోట్లాది రూపాయల లావాదేవీలు సాగిపోతున్నాయి.
 
 బయట అగ్రిమెంట్లే ఎక్కువ
 చిత్తూరు రిజిస్ట్రేషన్ జిల్లాకు సంబంధించి 13, బాలాజీ జిల్లాకు సంబంధించి 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. ఒక్కో రిజిస్ట్రార్ కార్యాలయంలో నెలకు అధికారికంగా రూ.70 లక్షల దాకా వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. అనధికారికంగా జరిగే వ్యాపారం నెలకు రూ.కోటికి పైనే. జిల్లాలోని మదనపల్లె,పలమనేరు, కుప్పం, పుంగనూరు, చిత్తూరు ప్రాంతాల్లో ఈ కొత్త తరహా వ్యాపారం జోరందుకుంది.
 
 పోలీస్ స్టేషన్ చేరుతున్న పంచాయితీలు
 అన్ రిజిస్టర్ అగ్రిమెంట్ల ద్వారా చాలా వరకు మోసాలు జరుగుతుండడంతో ఈ పంచాయితీలన్నీ పోలీస్ స్టేషన్లకు చేరుతున్నాయి. మూడు నెలల క్రితం మదనపల్లెకు చెందిన ఓ వ్యక్తి తన భూమిని ఓ రియల్టర్ అగ్రిమెంట్ చేసుకొని పలువురుకి విక్రయించేశారని పలమనేరు పోలీసులను ఆశ్రయించాడు. గంగవరం సమీపంలో ఓ రియల్టర్ ఇలాంటి మోసానికి పాల్పడడంతో 60 మంది దాకా బాధితులు ఇప్పటికీ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. వారం రోజుల క్రితం మరికొందరు పలమనేరు డీఎస్పీని ఆశ్రయించారు. ఇలా పోలీసుల దాకా రాని ఎన్నో సెటిల్‌మెంట్లు బయటే జరిగిపోతున్నాయి.
 
 రియల్ వ్యాపారంలో స్లీపింగ్ పార్టనర్లుగా టీచర్లు
 రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ బినామీల ద్వారా ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఉపాధ్యాయులతో ఉన్న పరిచయాల కారణంగా సైట్లను సులభంగా విక్రయించుకోవచ్చనే ఉద్దేశంతో వీరు ఈ వ్యాపారంలోకి దిగుతున్నట్లు సమాచారం. వీరితో పాటు ఉద్యోగులూ త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఇందులోకి దిగి చేతులు కాల్చుకుంటున్నారు. మరోవైపు కొందరు బ్రోకర్లు సైతం అత్యాశతో రియల్టర్ల అవతారమెత్తుతున్నారు.
 
 
 ఇలాంటి మోసాలు పెరిగి పోతున్నాయి
 రియల్ మోసాలు కొంతకాలంగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణం కొనుగోలుదారుల అవగాహన రాహిత్యమే. లక్షలాది రూపాయల డబ్బు అడ్వాన్సులుగా ఇస్తున్నప్పుడు ఆ స్థలం ఎవరిదీ ఏంటీ..? అని తెలుసుకోకుండా గుడ్డిగా వ్యవహరిస్తే ఎలా. ప్రజల్లో చైతన్యం రావాలి.
 - బాలయ్య, సీఐ పలమనేరు
 
 అన్ రిజిస్టర్ అగ్రిమెంట్లను రిజిస్టర్ చేయించుకోవాలి
 అన్ రిజిస్టర్ అగ్రిమెంట్లపై మా అజమాయిషీ ఉండదు. అన్ రిజిస్టర్ డాక్యుమెంట్లను చట్ట ప్రకారం రిజిస్టర్ చేయించుకోవాలి. దీంతో అగ్రిమెంట్‌పై మరో అగ్రిమెంట్ చేసుకోవడం వీలుకాదు. ఫలితంగా తగ్గిపోతాయి. పది రూపాయల స్టాంపు పేపర్‌పై రాసుకొని ఎలా లక్షల్లో వ్యాపారాలు చేస్తున్నారో అర్థం కావడం లేదు.
 - వెంకటేశ్వర్లు, పలమనేరు, సబ్‌రిజిస్ట్రార్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement