సెరీ సిరి | Rearing of silk worms sends coins | Sakshi
Sakshi News home page

సెరీ సిరి

Published Fri, Nov 6 2015 1:30 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

సెరీ సిరి - Sakshi

సెరీ సిరి

కాసులు కురిపిస్తున్న పట్టు పురుగుల పెంపకం
సెరీ కల్చర్ అధికారుల   పర్యవేక్షణలో మల్బరీ సాగు
పట్టు పరిశ్రమలపై పల్నాడు   రైతుల ఆసక్తి
ఏడాది పొడవునా  ఇంటిల్లిపాదికీ పని..
ఔత్సాహికులకు ప్రభుత్వ   ప్రోత్సాహకాలు

 
 సెరీ కల్చర్ రైతుల ఇంట సిరులు కురిపిస్తోంది. ఇంటిల్లపాదికీ ఏడాది పొడవునా చేతి నిండా పని లభించడంతోపాటు, ప్రభుత్వం నుంచి కూడా మంచి ప్రోత్సాహకాలు అందుతుండటంతో కొందరు పట్టు పరిశ్రమ వైపు దృష్టిసారిస్తున్నారు. సెరీ కల్చర్ అధికారులు కూడా నిత్యం అందుబాటులో ఉంటూ రైతులకు తగు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే ఏడాదికి ఎకరానికి రూ.75 వేలకు పైగా లాభాలు ఆర్జించే అవకాశం ఉందని సాగుదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
పిడుగురాళ్ల  పత్తి, మిర్చి పంటల సాగుతో నష్టాలు చవిచూసిన రైతులు ప్రత్నామ్నాయ పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంత రైతులు పట్టు పురుగుల పెంపకంతో రైతులు లాభాలు గడిస్తున్నారు. పట్టు పరిశ్రమపై ఆధారపడిన మాచవరం మండలం పిల్లుట్ల గ్రామం రైతులకు ఆదర్శంగా తీసుకుని మరికొందరు వారి బాటలో నడుస్తున్నారు. రెండెకరాల్లో మల్బరీ తోటవేస్తే ప్రతి కాపుకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు లాభం వస్తుంది. వసతులు సక్రమంగా ఉంటే ఏడాదికి ఆరు నుంచి ఎనిమిది బ్యాచ్‌లను తీయవచ్చు. పట్టు పురుగులను పెంచే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీని అందిస్తోంది. పట్టు పురుగులు తినే ఆహారమైన మల్బరీ తోటలు పెంచేందుకు ప్రారంభం నుంచి మూడేళ్ల వరకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పంట అభివృద్ధి పనుల కోసం ఎంపీడీవో కార్యాలయాల్లో రూ.1,54,134 దశల వారీగా మంజూరు చేస్తారు.

ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలివీ..
మల్బరీ తోటల్లో పట్టు పురుగుల పెంపకానికి కావాల్సిన షెడ్డు నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. ఈ ప్రోత్సాహకం ముందుగా రైతు మలబరీ పంటను వేసి తర్వాత షెడ్డు బేస్‌మట్టం వరకు నిర్మించుకుంటే అక్కడి నుంచి ప్రభుత్వ ప్రోత్సాహం అందుతుంది.

అరెకరం నుంచి రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ తోట సాగుచేసే చిన్నకారు రైతులు ప్రోత్సాహకానికి అర్హులు. రెండు ఎకరాల్లో మలబరీ తోట పెంచుకునే వారికి పట్టు పురుగుల పెంపకానికి ఏర్పాటు చేసే షెడ్డు యూనిట్ విలువ రూ.2.75 లక్షలు ఖర్చు అవుతుంది. దీనికి గాను రూ.82,500 సబ్సిడీ వస్తుంది. ఈ షెడ్డులో 250 గుడ్లు పెంచుకోవచ్చు. ఒక్కొక్క గుడ్డులో సుమారు 350 పట్టుపురుగులు ఉంటాయి.
 
రెండో యూనిట్‌లో ఎకరం భూమిలో మలబరీ తోటల పెంపకానికి రూ.1.75 లక్షలతో పట్టుపురుగుల షెడ్డును నిర్మించేందుకు ఖర్చు అవుతుంది. దీనికి గాను రూ.87,500 సబ్సిడీ వస్తుంది. అర ఎకరంలో మలబరీ తోటలు పెంచుకునేందుకు ఏర్పాటు చేసే షెడ్డులో యూనిట్‌కు రూ.90 వేలకు గాను రూ.63 వేలు సబ్సిడీ లభిస్తుంది.ఇవి కాక ప్రతి యూనిట్‌కు పట్టుపురుగులు పెంచేందుకు స్టాండు, ప్లాస్టిక్ ట్రేలకు గాను మరో రూ.52,500 ఇస్తారు. వీటితో పాటు  ప్లాంటేషన్ సమయంలో ఎకరాకు రూ.10,500ను ప్రభుత్వం అందిస్తుంది.
 
ఈ మొక్కల అభివృద్ధి కోసం ఉపాధి హామీ పథకం ద్వారా మొదటి సంవత్సరానికి రూ.62,532, రెండో ఏడాది రూ.45,800, మూడో ఏడాది రూ.45,800 అందిస్తుంది.వీటన్నింటితో పాటు పట్టు పురుగులు షెడ్డులో సోలార్ లైట్లు ఏర్పాటు చేసేందుకు గాను రూ.35 వేలు అందిస్తారు. దీనిపై 50 శాతం రాయితీతో రూ.17,550 గుంటూరులోని సెరీ కల్చర్ ఏడీఏ కార్యాలయం   నుంచి అందుతాయి. పురుగులకు అందించే మందులకు గాను బ్లీచింగ్ పౌడర్, సున్నంతో కూడిన కిట్ యూనిట్ విలువ రూ.3 వేలు. వీటిని  50 శాతం రాయితీతో రూ.1500కు ప్రభుత్వం అందిస్తుంది.
 
అధికారుల నిత్య పర్యవేక్షణ..
 మల్బరీ తోట వేసినప్పటి నుంచి పట్టు పురుగులు తీసుకురావడం, షెడ్డు ఏర్పాటు, పురుగుల ఎదుగుదలపై ఎప్పటికప్పుడు సెరీ కల్చర్ అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో సెరీ కల్చర్ అధికారుల ప్రోత్సాహంతో మలబరీ పంటలు లాభాలు తెచ్చి పెడుతుండటంతో రైతులు ముందుకొచ్చి మలబరీ పంటలను పండించి పట్టు పురుగులు పెంచుతున్నారు.
 
పట్టు పురుగుల మార్కెటింగ్..
పట్టుపురుగులు పెంచిన రైతులు గుంటూరులోని ఆటోనగర్, కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్‌తో పాటు మదనపల్లి, ధర్మవరం, హిందూపురంలలో ఎక్కువ మార్కెటింగ్ చేస్తారు. ఇక్కడ మార్కెట్‌లో 50 కిలోల పైగా దిగుబడి సాధించిన రైతులకు కిలోకు రూ.50 చొప్పున ప్రోత్సాహక నగదు లభిస్తుంది. పట్టుపురుగులు 26 రోజులకు గూడు కట్టుకుంది. కట్టిన ఐదారు రోజుల్లో గుడ్లు మార్కెట్ చేస్తారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement