రిజర్వేషన్లు ఖరారు
- రెండు మునిసిపాలిటీలు, మూడు నగర పంచాయతీలకు రిజర్వేషన్లు ప్రకటించిన ప్రభుత్వం
- వరంగల్ నగర మేయర్ స్థానం జనరల్ కేటగిరికి
- కోర్టు కేసుల కారణంగా వరంగల్‌కు ఎన్నికలు లేనట్లే..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మునిసిపాలిటీ చైర్మన్ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జనగామ, మహబూబాబాద్ మున్సిపాలిటీలకు, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట నగర పంచాయతీల చైర్మన్ల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సమీర్‌శర్మ ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పురపాలక ఎన్నికలకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారవర్గాల సమాచారం ప్రకారం... వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణ ఎన్నికలు సమీపించిన తరుణంలోనే పురపాలక ఎన్నికలు వస్తుండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
ద్వితీయశ్రేణి నాయకులు పోటీకి సన్నద్ధమవుతున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు... పురపాలక ఎన్నికలు వస్తుండడం పలు నియోజకవర్గాల్లోని నేతలకు ఆందోళన కలిగిస్తోంది. సాధారణ ఎన్నికల్లో ఖర్చు విషయంలో ప్రణాళికలు వేసుకుంటున్న వీరికి ఇప్పుడు పురపాలక ఎన్నిలు రావడంతో రెట్టింపు నిధులు అవసరమయ్యే పరిస్థితి వస్తోంది. పురపాలక సంస్థలు ఉన్న జనగామ, మహబూబాబాద్, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకునే నేతలకు ఇప్పడు ఖర్చు విషయంలో కొత్త దిగులు మొదలైంది.
వరంగల్ జనరల్‌కు...
వరంగల్ నగరపాలక సంస్థ మేయర్ సీటు జనరల్(ఏ వర్గానికి రిజర్వు కాలేదు)గా ప్రభుత్వం ఖరారు చేసింది. గ్రేటర్‌లో విలీన గ్రామాలపై నెలకొన్న న్యాయపరమైన వివాదంతో ఎన్నికలు ఇప్పుడు నిర్వహించే పరిస్థితి లేదు. రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో వరంగల్‌ను గ్రేటర్‌గా పేర్కొనలేదు. వరంగల్ నగరపాలక సంస్థగానే పేర్కొన్నారు. రెండో దశలోనే వరంగల్ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగనున్నాయి.