సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎట్టకేలకు ప్రాదేశిక ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసింది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేసిన యంత్రాంగం శుక్రవారం సాయంత్రం గెజిట్‌లో పొందుపరిచింది. జిల్లాలో 614 ఎంపీటీసీ స్థానాలు, 33 జెడ్పీటీసీ రిజర్వేషన్లు వెల్లడి కావడంతో రాజకీయవర్గాల్లో మరింత హడావుడి మొదలైంది. ఇప్పటికే మున్సిపల్, సాధారణ ఎన్నికల ప్రకటన వెలువడగా.. తాజాగా ప్రాదేశిక పోరుకు సైతం ఏర్పాట్లు చకచకా సాగుతుండడం పార్టీలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. ఈ ఎన్నికలపై న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఒకట్రెండు రోజుల్లో ప్రాదేశిక ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
రిజర్వేషన్లు ఇలా..
2011 జనాభా గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. 1996, 2001, 2006 సంవత్సరాల్లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లోని రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుని రొటేషన్ పద్ధతిని అనుసరించారు. బీసీ రిజర్వేషన్లు మాత్రం వారి జనాభా అంచనాను పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్లు కేటాయించారు. ప్రస్తుతం జిల్లాలో 614 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అయితే ఇందులో ఇటీవల పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన గ్రామాలతోపాటు.. జీహెచ్‌ఎంసీలో విలీనం చేయదలచిన పంచాయతీలను కూడా పరిగణలోకి తీసుకున్నారు.
గ్రేటర్‌లో విలీనం చేయాలనుకున్న 35 గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలు/మున్సిపాలిటీలుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రయత్నాలు కూడా దాదాపు కొలిక్కి వచ్చాయి. ఈనేపథ్యంలో త్వరలో వెలువడే ప్రాదేశిక ఎన్నికల ప్రకటనలో ఈ 35 పంచాయతీల్లోని ఎంపీటీసీ స్థానాలకు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా జిల్లాలోని 33 మండలాలకు జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అయితే మండల పరిషత్ అధ్యక్ష పీఠానికి సంబంధించి రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాలేదు.
ప్రాదేశిక రిజర్వేషన్లు ఖరారు
Published Sat, Mar 8 2014 12:04 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM
Advertisement